Telugu Global
Others

ఫేస్‌బుక్‌కి సిఇఓ అయినా మాక్సిమాకు తండ్రే..!

ఢిల్లీకి రాజ‌యినా త‌ల్లికి కొడుకే…అనేది ఎప్ప‌టికీ పాత‌బ‌డ‌ని సామెత‌. అధికారం, డ‌బ్బు, విజ్ఞానం, నియంతృత్వం, ప‌ద‌వులు…ఇలాంటివి ఎన్నో మ‌నిషిని అనుక్ష‌ణం తూకం వేస్తుంటాయి. ఈ తూకాల్లో తేడాలే మ‌నుషుల మ‌ధ్య ఉన్న తేడాలు…బేధాలు…ఆపై విబేధాలు. తాసు లేకుండా తూకం లేకుండా ఒక్క‌క్ష‌ణం గ‌డ‌వ‌ని, ఒక్క అడుగు ముందుకు ప‌డ‌ని బ‌తుకులు మ‌న‌వి. బిడ్డ ఎంత బ‌రువుతో, ఏ హాస్ప‌ట‌ల్లో పుట్టింది అనే ప్ర‌శ్న‌తో మొద‌ల‌య్యే కొల‌త‌లు, కొల‌మానాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. పాపాయికి ఎన్ని చెంచాలు సిరిలాక్ […]

ఫేస్‌బుక్‌కి సిఇఓ అయినా మాక్సిమాకు తండ్రే..!
X

ఢిల్లీకి రాజ‌యినా త‌ల్లికి కొడుకే…అనేది ఎప్ప‌టికీ పాత‌బ‌డ‌ని సామెత‌. అధికారం, డ‌బ్బు, విజ్ఞానం, నియంతృత్వం, ప‌ద‌వులు…ఇలాంటివి ఎన్నో మ‌నిషిని అనుక్ష‌ణం తూకం వేస్తుంటాయి. ఈ తూకాల్లో తేడాలే మ‌నుషుల మ‌ధ్య ఉన్న తేడాలు…బేధాలు…ఆపై విబేధాలు. తాసు లేకుండా తూకం లేకుండా ఒక్క‌క్ష‌ణం గ‌డ‌వ‌ని, ఒక్క అడుగు ముందుకు ప‌డ‌ని బ‌తుకులు మ‌న‌వి. బిడ్డ ఎంత బ‌రువుతో, ఏ హాస్ప‌ట‌ల్లో పుట్టింది అనే ప్ర‌శ్న‌తో మొద‌ల‌య్యే కొల‌త‌లు, కొల‌మానాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. పాపాయికి ఎన్ని చెంచాలు సిరిలాక్ పెడుతున్నారు నుండి ఎన్ని ల‌క్ష‌లు క‌ట్నం ఇస్తున్నారు వ‌ర‌కు…జీవిత‌మంతా కొల‌త‌లు, కొల‌మానాలు, తూకాలే.

ఏ వ‌య‌సులో అడుగులు వేశాడు, ఎప్పుడు బ‌డికి వెళ్లాడు, ఎన్ని రైమ్స్ చెబుతున్నాడు…ఎన్ని మార్కులు వ‌స్తున్నాయి…ఎంత డొనేష‌న్ క‌ట్టారు, ఎంత ర్యాంక్ వ‌చ్చింది, ఏ కంపెనీలో జాబ్ వ‌చ్చింది…జీత‌మెంత‌….ఈ కొల‌మానాల్లో ఇ మడ‌కుండా ఒక్క‌మ‌నిష‌యినా జీవించ‌గ‌ల‌డా. ఎంత చెట్టుకి అంత‌గాలి అన్న‌ట్టు ఎంత స్థాయి వాడికి అంత‌స్థాయి కొల‌త‌లు, తూకాలు ఉంటాయి. మార్కెట్లో వ‌స్తువుల కంటే ఎక్కువ‌గా మ‌నుషుల‌ను అనుక్ష‌ణం తూకం వేసే అంశాలు అడుగ‌డుగునా ఉంటాయి. నివ‌సించే ఇల్లు, తిరిగే వాహ‌నం, బ్యాంక్ బ్యాల‌న్స్‌…జీవ‌న శైలిలో ప్ర‌తి అల‌వాటునీ తూకం వేస్తాం. వాడు ఫ‌లానాదేశంలో టిపిన్ చేసి భోజ‌నానికి ఫ‌లానా దేశానికి వెళ‌తాడ‌ట‌…అనే స‌మాచారంలో ఎన్ని లెక్క‌లుంటాయో, ఎన్ని తూకాలుంటాయో.

చాలా పాపుల‌ర్ అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్ డైలాగ్…. నాక్కాస్త తిక్కుంది…దానికో లెక్కుంది… అనేది…నిజానికి రివ‌ర్స్‌గా వాడారు. దాన్ని స‌రిగ్గా చెప్పాలంటే మ‌న‌ జీవితంలో అడుగ‌డుగునా ఒక లెక్కుంది…ప్ర‌తి లెక్క‌లో ఎంతో తిక్కుంది…ఇదీ మ‌నంద‌రి జీవితాల‌కు వ‌ర్తించే స‌రైన కొటేష‌న్‌.

మ‌నం ఏం చేస్తున్నాం, మ‌న స్నేహితులు ఎవ‌రు, మ‌నం ఎవ‌రితో ఎంత స‌మ‌యం గ‌డుపుతున్నాం…ఇవి కూడా మ‌న జీవితానికి తూకాలే. ఇన్ని తూకాల మ‌ధ్య అప్పుడ‌ప్పుడు అత్యంత స‌హ‌జంగా మ‌నం మ‌నుషులం క‌దా…ని గుర్తు చేసే సంద‌ర్భాలు ఎదుర‌వుతుంటాయి. మ‌నం కొలిచే అంశాలన్నీ మ‌న సృష్టి. అందుకే వాటిని లెక్క‌లు వేసే శ‌క్తి, మేధ‌స్సు మ‌న‌కు ఉంటుంది.

కానీ లెక్క‌ల‌కు అంద‌ని అంశాలూ మ‌న జీవితాల్లో ఉంటాయి. ప్ర‌ధాని అయిన త‌రువాత మోదీ త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మిఠాయి తిన‌డం, ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ త‌న కూతురిని చంక‌న ఎత్తుకుని ప్ర‌పంచ చ‌ల‌న చిత్రోత్సవాల్లో క‌న‌బ‌డ‌టం, ప్రియాంకా గాంధీ త‌న కూతురి స్కూలుకి వెళ్లి ఆమె బాస్కెట్‌బాల్ ఆడుతుంటే చూడ‌టం…ఇవ‌న్నీ ప్ర‌పంచానికి వార్త‌ల్లా క‌న‌బ‌డ‌తాయి. మ‌నిషి చుట్టూ అల్లుకుంటున్న కృత్రిమ‌త్వాన్ని ప‌టాపంచ‌లు చేసి మ‌నిషంటే మ‌నిషే అనే సార్వ‌జ‌నీన‌త‌ను గుర్తుకు తెచ్చే అంశాలు ఇవి. మ‌నిషి అసాధార‌ణ‌త్వంలో ఎంత సాధార‌ణ‌త ఉందో తెలిపే అంశాలు కూడా ఇవే. డ‌బ్బు, అధికారాలు, ప్రాంతాలు, సంస్కృతులు ఇవ‌న్నీ సృష్టించే జీవ‌న‌శైలి తేడాలు కుప్ప‌కూలిపోయే క్ష‌ణాలు అవి.

ఫేస్‌బుక్ బిగ్ డాడీ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ త‌న చిన్నారి కూతురు మాక్సిమా, తన ప‌క్క‌న కేవ‌లం డైప‌ర్‌తో ప‌డుకుని ఉన్న చిత్రాన్ని సోష‌ల్‌ మీడియాకు విడుద‌ల చేశాడు. లిటిల్ మాక్స్‌తో తాను అత్యంత సంతోషంగా ఉన్న‌ట్టుగా చెప్పాడు. దానికి విప‌రీతంగా లైక్స్ వ‌స్తున్నాయి. రెండునెల‌లు పితృత్వ సెల‌వులు పెట్టి మరీ కూతురి పుట్టుక‌ను ఎంజాయి చేస్తున్నాడు జుక‌ర్ బ‌ర్గ్. కొత్త‌గా తండ్ర‌యిన ఒక నిరుపేద పొందే ఆనందానికి, జుక‌ర్ బ‌ర్గ్ ఆనందానికి తేడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక్క‌డ మ‌న తూకాలు కొల‌తలు ప‌నికిరావు.

కూతురు పుట్టిన సంద‌ర్భంగా ఫేస్‌బుక్ షేర్ల‌లో 99శాతం దానం చేస్తున్న‌ట్టుగా జుక‌ర్ బ‌ర్గ్ ప్ర‌క‌టించాడు. అదే స‌గ‌టు తండ్రి అయితే కూతురి భ‌విష్య‌త్తుకి ఎంత క‌ష్ట‌ప‌డి ఎంత కూడ‌పెట్టాలి…అని ఆలోచిస్తాడు. కానీ ఇక్క‌డ జుక‌ర్ బ‌ర్గ్ కూడా స‌గ‌టు తండ్రే. త‌న కూతురు నివ‌సించ‌బోతున్న ప్ర‌పంచం అందంగా ఉండాల‌ని, స‌మ‌ర్థులైన వారంద‌రికీ ఎలాంటి వివ‌క్ష‌లేకుండా అన్ని రంగాల్లో అవ‌కాశాలు ద‌క్కాల‌ని తాను ఆశిస్తున్నానంటున్నాడు. తండ్రిగా ఒక నిరుపేద‌, జుక‌ర్‌బ‌ర్గ్ పొంద‌గ‌ల ఆనందం ఒకేలా ఉన్నా, ఆ పుట్టుకకు స్పంద‌న‌గా చేస్తున్న వారి ఆలోచ‌న‌ల్లో తేడాలున్నాయి. ఆ తేడాల‌కు కార‌ణ‌మైన అంశాల‌న్నింటినీ మ‌ళ్లీ తూకం వేయ‌వచ్చు. ఎందుకంటే అవ‌న్నీ మ‌న సృష్టి.

కోటీశ్వ‌రుడి గా జుక‌ర్‌బ‌ర్గ్ అసామాన్యుడు కావ‌చ్చు, కానీ ఒక పాపాయికి తండ్రిగా అత‌ను ఈ భూమ్మీద ప్ర‌తి తండ్రిని ప్ర‌తిబింబిస్తున్నాడు…

చివ‌రిగా దీన్ని ముగించేముందు ఒక్క మాటలో‌ సారాంశాన్ని చెప్పాలంటే… ఇత‌రుల‌తో మ‌న‌ల్ని వేరుచేసే అంశాలు ఎన్ని ఉన్నా (త‌ప్ప‌కుండా ఉండితీరుతాయి) వాటిపై కాకుండా, ఇత‌రుల‌తో మ‌న‌ల్ని మ‌నం ప్ర‌తిబింబించే అంశాల‌పై దృష్టి పెడితే, అలాంటివాటిని గుర్తుపెట్టుకుంటే ఈ ప్ర‌పంచంలో తార‌త‌మ్యాలు విభేదాలు త‌గ్గుతాయి. త‌గ్గ‌క‌పోయినా క‌నీసం వాటి వ‌ల‌న ఎక్కువ స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా ఉంటాయి.

కొస‌మెరుపు…

ఓట్లు అడిగే రాజ‌కీయ‌నాయ‌కుడు గుడిసెల్లో నుల‌క‌మంచం మీద కూర్చుని, గంజి తాగ‌డంలో ఉన్న అంత‌స్సూత్రం అదే. ఢిల్లీకి రాజు కాబోతున్నా నేనూ మీలాంటి మ‌నిషినే అన్న సంగ‌తి… నాకు గుర్తుంది అని చెప్ప‌డ‌మ‌న్న‌మాట‌. కానీ ఆ త‌రువాత ఏం జ‌రుగుతుందో మ‌నంద‌రికీ తెలుసు….అందుకే జుక‌ర్‌బ‌ర్గ్… నాలోనూ తండ్రి మ‌న‌సుంద‌ని అంత‌గా చెప్పుకోవాల్సి వ‌స్తోంది!!!!

-వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  9 Dec 2015 9:55 AM GMT
Next Story