Telugu Global
Others

'నేషనల్ హెరాల్డ్' కేసు గురించి సింపుల్‌గా చెప్పాలంటే

నేషనల్ హెరాల్డ్.. ఈ పేరు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 5 రోజులుగా మీడియా అంతా నేషనల్ హెరాల్డ్ కేసుపైనే కథనాలు వండివారుస్తోంది. పార్లమెంట్ లోనూ ఇదే అంశం దుమారం రేపుతోంది. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, తనయుడు రాహుల్ గాంధీకి ఈ కేసుకు సంబంధం ఏంటి? . సింపుల్ గా చెప్పాలంటే తక్కువలో తక్కువ 2వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న సంస్థను.. 50లక్షల పెట్టుబడితో దక్కించుకున్నారన్నది ఆరోపణ. […]

నేషనల్ హెరాల్డ్ కేసు గురించి సింపుల్‌గా చెప్పాలంటే
X
నేషనల్ హెరాల్డ్.. ఈ పేరు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 5 రోజులుగా మీడియా అంతా నేషనల్ హెరాల్డ్ కేసుపైనే కథనాలు వండివారుస్తోంది. పార్లమెంట్ లోనూ ఇదే అంశం దుమారం రేపుతోంది. ఇంతకీ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, తనయుడు రాహుల్ గాంధీకి ఈ కేసుకు సంబంధం ఏంటి? . సింపుల్ గా చెప్పాలంటే తక్కువలో తక్కువ 2వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న సంస్థను.. 50లక్షల పెట్టుబడితో దక్కించుకున్నారన్నది ఆరోపణ. దీనిపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు.
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజెఎల్) పేరుతో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచే నిధులు సమకూర్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్ర్య పోరాట సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికగా ఉండేది. ఆ తర్వాత దశాబ్ధాల పాటు నష్టాల్లో నడవడంతో 2008 ఏప్రిల్ 1న దీన్ని మూసేశారు. అయితే జాతీయ పత్రిక హోదాలో అప్పటికే నేషనల్ హెరాల్డ్ పత్రికకు ప్రభుత్వం తరుఫున ముంబయి, ఢిల్లీ, లక్నో తదితర నగరాలలో భారీగా భూములు దక్కాయి. మొదట్లో వీటి విలువ తక్కువగా ఉన్నా ఇప్పుడు సుమారు 2వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా.
ఈ నేపథ్యంలో 2010లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ‘యంగ్ ఇండియా లిమిటెడ్’ కంపెనీ స్థాపించారు. ఇందులో తల్లి, కొడుకుల వాటా 76 శాతం. మిగిలిన దాంట్లో కాంగ్రెస్ నేతలు మోతీలాల్ ఓరా, ఆస్కార్ పెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడాలున్నారు. వీరంతా నష్టాల్లో ఉన్న నేషనల్ హెరాల్డ్ సంస్థను కేవలం 50లక్షలకే సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నేషనల్ హెరాల్డ్ కు చెందిన 90కోట్ల రూపాయలు వడ్డీలేని రుణంగా యంగ్ ఇండియా లిమిటెడ్‌కు బదిలీ చేశారు. నేషనల్ హెరార్డ్ భూములు కూడా వీరి ఆధీనంలోకి వచ్చేశాయి. 2వేల కోట్లరూపాయల విలువైన ఆస్తులున్న నేషనల్ హెరాల్డ్‌ను.. కేవలం 50లక్షలకే సోనియాతో పాటు కాంగ్రెస్ నేతలు ఎలా దక్కించుకుంటారంటూ 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. . నేషనల్‌ హెరాల్డ్‌ దినపత్రిక ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, అడుగడుగునా నిబంధనలు అతిక్రమించారని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలోనే ఈ కేసును ఈడీ క్లోజ్ చేసింది. అయితే ఇటీవల మరోసారి సుబ్రహ్మణ్యస్వామి కోర్టుకు వెళ్లడంతో ఈడీ కేసు రీఓపెన్ చేసింది. విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మోతీలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, సుమన్‌ దూబే, శ్యాం పిట్రోడా, యంగ్‌ ఇండియా లిమిటెడ్‌లోని సభ్యులు ఈనెల 19న కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఇది రాజకీయ కక్షసాధింపు అంటూ పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్నారు. అటు కేంద్రప్రభుత్వం మాత్రం ఇది ప్రైవేట్ కేసని.. దాంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కోర్టులే తేలుస్తాయంటోంది. మొత్తం మీద ఈనెల19న సోనియా, రాహుల్ కోర్టు మెట్లు ఎక్కుతారా లేదా అన్న దానిపై ఇప్పుడు ఆసక్తినెలకొంది.
First Published:  11 Dec 2015 11:56 PM GMT
Next Story