ఆమెకున్న‌ది అంగ‌వైక‌ల్యం కాదు…పోరాడే గుణం!

 2ఇక్క‌డ ఫొటోలో క‌న‌బ‌డుతున్న అమ్మాయిపేరు పుష్పా సింగ్‌. కాలుతో మౌస్ ప‌ట్టుకుని కంప్యూట‌ర్‌మీద ప‌నిచేస్తున్న ఆమె, స‌మాజంలో పాతుకుపోయి ఉన్న కొన్ని ప‌నికిరాని ‌న‌మ్మ‌కాల‌ను ప‌టాపంచ‌లు చేసింది. అంగ‌వైక‌ల్యం మ‌నిషి ప్ర‌గ‌తికి ఎలాంటి ఆటంకాలను సృష్టించ‌లేద‌ని నిరూపించింది. చేతులు రెండూ పూర్తిగా ప‌నిచేయ‌ని పుష్ప, అన్ని అవ‌య‌వాలు బాగున్న‌వారికంటే ఎక్కువే సాధించింది. ఏదైనా సాధించాలంటే అన్నిటికంటే ముందు కావాల్సింది మ‌న మీద మ‌న‌కు న‌మ్మ‌క‌మేన‌ని రుజువుచేసింది. మెద‌డుకి తెలివితేట‌లుంటే, పోరాడే గుణ‌ముంటే ఏ ప‌రిస్థితులూ మ‌న‌ల్ని ఆప‌లేవ‌ని  చాటిచెప్పి, త‌న‌లాంటివారికే కాదు, అన్ని అవ‌య‌వాలు స‌జావుగా ఉన్న‌వారికి సైతం ఒక రోల్‌మోడ‌ల్‌గా నిలిచింది. ఆమె గురించి-

పుష్పాసింగ్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని మొంగాలా అనే చిన్న ప‌ల్లెటూరికి చెందిన అమ్మాయి. ఆమె వ‌య‌సు 26 సంవ‌త్స‌రాలు. పుట్టుక‌తోనే పుష్ప అంగ‌వైక‌ల్యంతో జ‌న్మించింది. చేతులు ఉన్న‌ట్టుగా క‌న‌బ‌డుతున్నా అవి అచేత‌నం, ప‌నిచేయ‌వు. అయినా ఆమె ఎవ‌రి స‌హాయం లేకుండా త‌న ప‌నుల‌న్నీ చేసుకుంటుంది. బ‌ట్ట‌ల ఇస్త్రీతో స‌హా. అంతేకాదు, ప‌ట్టుద‌ల‌గా చ‌దువుకుని త‌న త‌ల‌రాత‌ని తానే తిర‌గ‌రాసుకుంది.

చ‌దువు త‌న‌కి అండ‌గా నిలుస్తుంద‌ని పుష్ప‌కి చిన్న‌త‌నంలోనే బాగా అర్థ‌మైంది. అందుకే ప‌దేళ్ల వ‌య‌సులో మంచి చ‌దువుకోసం త‌మ గ్రామానికి 55కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌న్నిహిత బంధువుల ఊరు  బ‌హ్రైచ్‌ వెళ్లింది. ఆమెకిప్పులు రెండు డిగ్రీలున్నాయి. బ్యాచిల‌ర్ ఇన్ ఎడ్యుకేష‌న్‌, ఎమ్ఎస్‌సి కంప్యూట‌ర్ సైన్స్‌.  ప్ర‌స్తుతం త‌ను చ‌దువుకున్న ఊళ్లోనే మూడేళ్లుగా ఒక ఇంట‌ర్ కాలేజిలో కంప్యూట‌ర్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. అంతేకాదు, తాను నివ‌సిస్తున్న ప్రాంతానికి బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్‌ స‌భ్యురాలిగా కూడా ఎన్నికైంది. ఈ ఎన్నిక‌ల్లో ఏడుగురిని ఓడించి ఆమె గెలిచింది. మొత్తం పోల‌యిన 1400 ఓట్ల‌లో పుష్ప‌కు 486 ఓట్లు వ‌చ్చాయి.

త‌న‌విజ‌యాల‌కు త‌ల్లి, తండ్రి, కుటుంబం ఇచ్చిన స‌పోర్టే కార‌ణ‌మంటోంది పుష్ప‌. చిన్న‌త‌నం నుండి జీవితంలో పోరాడ‌టం అనే ల‌క్ష‌ణాన్ని అత్యంత సులువుగా ఒంట‌బ‌ట్టించుకుంది ఆమె.  పోరాట గుణం ఉన్న‌వాడికి ఆ గుణం ఉండ‌ట‌మే గెలుపు. అలాంటి వ్య‌క్తి ఓడినా గెలిచిన‌ట్టే ఎందుకంటే తిరిగి పోరాటం మొద‌లుపెడ‌తాడు కాబట్టి. ఆమెలోని ఆ పోరాడే గుణాన్ని చూసే పుష్ప‌కు ఓట్లు వేశామ‌ని, ఆమెకు ప‌నిచేయ‌డం, విజ‌యం సాధించ‌డం బాగా తెలుసున‌ని పుష్ప‌కు ఓటేసిన ఓ ఓట‌రు తెలిపింది.

పుష్ప ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌టం త‌మ‌కు తెలియ‌ద‌ని, త‌మ స‌హాయం కూడా ఆమె అడ‌గ‌డ‌లేద‌ని ఆమె ప‌నిచేస్తున్న‌ కాలేజి ప్రిన్స్‌పాల్ అన్నారు. పుష్ప తెలివితేట‌ల‌ను చూసే తాము ఉద్యోగం ఇచ్చామ‌ని మ‌నీష్ శ‌ర్మ అనే ఆ ప్రిన్స్‌పాల్ చెప్పారు. కాలుతో మౌస్‌ని ఆప‌రేట్ చేస్తూ ఎలాంటి పొర‌బాటు, త‌డ‌బాటు లేకుండా ఆమె కంప్యూట‌ర్ మీద ప‌నిచేయ‌డం త‌మ‌ని ముగ్దుల‌ను చేసింద‌ని మ‌నీష్ అన్నారు.

1ఇక్క‌డ అన్నిటికంటే ఎక్కువ‌గా చెప్పుకోవాల్సిన  విష‌యం ఒక‌టుంది. పుష్ప క‌డుపులో ఉండ‌గానే వైద్యులు ఆమెలోని అవ‌క‌రాన్ని గుర్తించారు. అబార్ష‌న్ చేయించుకోమ‌ని ఆమె త‌ల్లికి అంద‌రూ చెప్పారు. కానీ ఆమె అందుకు ఒప్పుకోలేదు.  క‌డుపులో ఉండ‌గానే కూతురికి అండ‌గా నిల‌బ‌డ‌టం మొద‌లుపెట్టిన ఆ త‌ల్లి నిజంగా పుష్ప‌కంటే అభినంద‌నీయురాలు.

త‌న ప‌రిస్థితిని కార‌ణంగా చూపించి ప్ర‌త్యేక స‌దుపాయాలు కావాల‌ని అడ‌గ‌టం త‌న‌కు న‌చ్చ‌దు అంటోంది పుష్ప‌. సంవ‌త్స‌రం పాటు ల‌క్నోలో ఉండి బిఇడి ట్రైనింగ్ పూర్తి చేసిందామె.  ప‌రీక్ష‌ల స‌మ‌యంలో కూడా, అంద‌రికీ టేబుల్ ఉంటే త‌న‌కు దాని బ‌దులు, కాలుతో రాసేందుకు వీలుగా ఒక బెంచీ కావాల‌ని మాత్ర‌మే ఆమె అడిగింది. అంగ‌వైక‌ల్యం కార‌ణంగా ఏ ప‌నులు తాను చేయ‌లేన‌ని అంతా భావిస్తారో వాటిని చేసి చూపించ‌డమే ధ్యేయంగా పెట్టుకుందామె. త‌న తోబుట్టువుల‌తో పాటు కంప్యూట‌ర్ నేర్చుకుంటానంటే ఇంట్లోవారంతా వింత‌గా చూశార‌ని, కానీ వారి సందేహాల‌కు స‌మాధానంగా నేర్చుకుని చూపించాన‌ని పుష్ప అంటోంది.

ఆమె ప‌రిస్థితిని చ‌క్క‌బ‌రిచేందుకు త‌ల్లిదండ్రులు ప‌లువురు డాక్ట‌ర్ల‌కు చూపించారు. 18 ఏళ్లు దాటితే ఆప‌రేష‌న్ చేయ‌వ‌చ్చ‌ని,  కొంత వ‌ర‌కు చేతులు ప‌నిచేయ‌వ‌చ్చ‌ని  డాక్ట‌ర్లు చెప్పారు. కానీ పుష్ప వైద్యానికి అంగీక‌రించ‌లేదు. ఇప్పుడు తాను ఉన్న స్థితి వ‌ల‌న త‌న‌కెలాంటి బాధా లేద‌ని అంటోందామె. తాను చేయ‌లేనిది ఏమీ లేద‌ని ఆత్మ‌విశ్వాసం(ఇది ఆమెకు చాలా చిన్న‌ప‌దం)తో చెబుతోంది. వైద్యం పేరుతో స‌మ‌యాన్ని వృథా చేయ‌లేనంటోంది.

నిజంగా పుష్ప మ‌నిషిలోని అంత‌ర్గ‌త శ‌క్తికి నిలువెత్తు సాక్ష్యమే. అందుకే ఆమె బాహ్య రూపం తాలూకూ ఇబ్బందుల‌ను అవ‌లీల‌గా జ‌యించేయ‌గ‌లుగుతోంది. రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే క్షేత్ర‌స్థాయి నాయ‌కురాలిగా ఎదుగుతున్న పుష్ప ఆడ‌పిల్ల‌ల విద్య‌, వెనుక‌బ‌డిన‌వారికి నాణ్య‌మైన వైద్యం, అంగ‌విక‌లుర‌కు స‌మాన అవ‌కాశాలు…ఈ ల‌క్ష్యాల‌తో ముందుకు సాగుతానంటోంది.  పుష్ప ఆశ‌యాలు నెర‌వేరాల‌ని కోరుకుందాం.