Telugu Global
NEWS

ఢిల్లీలోనూ వాస్తు వాణి వినిపిస్తున్న బాబు బృందం

కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన సొమ్ములు, సంస్థల విషయంలో ఏమో గానీ ఢిల్లీలో తమకూ ఇళ్లు కేటాయించాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు, కొందరు టీడీపీ ఎంపీలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. 16నెలలుగా తనకు బంగళా కేటాయించాలని చంద్రబాబు స్వయంగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కేసీఆర్‌, జగన్‌లకు బంగళాలు కొనసాగించడంపై రుసరుసలాడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణ, ఏపీకి విభజించారు. దీనికి తోడు […]

ఢిల్లీలోనూ వాస్తు వాణి వినిపిస్తున్న బాబు బృందం
X

కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన సొమ్ములు, సంస్థల విషయంలో ఏమో గానీ ఢిల్లీలో తమకూ ఇళ్లు కేటాయించాలంటూ సీఎం చంద్రబాబుతో పాటు, కొందరు టీడీపీ ఎంపీలు కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. 16నెలలుగా తనకు బంగళా కేటాయించాలని చంద్రబాబు స్వయంగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా కేసీఆర్‌, జగన్‌లకు బంగళాలు కొనసాగించడంపై రుసరుసలాడుతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణ, ఏపీకి విభజించారు. దీనికి తోడు ఏపీ భవన్ మరమ్మతుల కారణంగా చంద్రబాబు ఆవాస కష్టాలు ఎదురయ్యాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఫైవ్ స్టార్‌ హోటల్స్‌లో ఉండడం ఇష్టం లేక చంద్రబాబు మంత్రుల క్వార్టర్స్‌లోనే ఉంటున్నారని చెబుతున్నారు. ఎంపీ కంభంపాటికి కూడా ఇప్పటికీ బంగళా కేటాయించకపోవడాన్ని కూడా తప్పుపడుతున్నారు.

అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు వాదన మరోలా ఉంది. తాము కేటాయించిన బంగళాలను వాస్తు కారణంతో టీడీపీ నేతలే తిరస్కరిస్తున్నారని అందువల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ గతంలో ఉన్న బంగళాను చంద్రబాబుకు కేటాయించేందుకు కేంద్ర అధికారులు సిద్దమయ్యారు. అయితే పలుమార్లు ఆ బంగళాను పరిశీలించిన ఏపీ అధికారులు, టీడీపీ నేతలు వాస్తు సరిగా లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట. పలు మార్పులు చేయాలని సూచించారు. ఇలా కొన్ని నెలల పాటు టీడీపీ నేతలు కాలయాపస చేశారని అందుకే ప్రమోద్ మహాజన్ గతంలో వాడిన బంగళాను మరొకరికి కేటాయించామంటున్నారు అధికారులు. అయినా ఏపీ భవన్‌కు మరమ్మతులు చేయడానికి 16 నెలల కాలం ఎందుకు పడుతోందని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ రాజ్యసభ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు ఇలా వాస్తు పేరుతో బంగళాను కోల్పోయారు. గతంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి కేటాయించిన ఇంటిని కంభంపాటికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. అయితే ఆ ఇంటిని చూసిన కంభంపాటి రామ్మోహన్‌రావు… వాస్తు అంశాన్ని లేవనెత్తారు. వాస్తుకు తగ్గట్టు ఇంటికి మార్పులు చేసి ఇవ్వాలని కోరారట. అయితే ఇదంతా అయ్యే పనికాదనుకున్న అధికారులు ఆ ఇంటిని మరొక ఎంపీకి కేటాయించేశారు. మరో రెండు ఇళ్లను చూపించినా కంభంపాటి సకాలంలో స్పందించలేదని చెబుతున్నారు. దీంతో కంభంపాటి ఇల్లు కేటాయింపు జాప్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు.

గతంలో జగన్‌కు కేటాయించిన ఇల్లు ఇప్పుడు వైసీపీకి చెందిన మరో ఎంపీకి మార్చారు. అయితే జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఈ ఇంటిలోనే ఉంటున్నారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కేటాయించిన ఇంటిని అనంతరం ఎంపీ కవితకు కేటాయించారు. అయితే కేసీఆర్ విజ్ఞప్తి మేరకు తిరిగి ఆయనకే కేటాయించారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కేసీఆర్ తుగ్లక్‌ రోడ్డులోని బంగళాలోనే ఉంటున్నారు. చంద్రబాబు కూడా ఇదే తరహాలో బంగళా కోసం కేంద్రాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి అవసరాలకు తగ్గట్టు ఉండే బంగళాను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం కోరినా కేంద్ర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది.

First Published:  12 Dec 2015 10:03 PM GMT
Next Story