మాన‌సిక బ‌ల‌వంతులు…ఇలా ఉంటారు!

శారీర‌క సౌంద‌ర్యం కంటే మాన‌సిక అందం ఎంత ముఖ్యమో, శారీర‌క బ‌లం కంటే మాన‌సికంగా స్ట్రాంగ్ ఉండ‌టం అంతే అవ‌స‌రం. అస‌లు మాన‌సిక బ‌లం అంటే ఏమిటి, అది ఉన్న‌వారి ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయి…ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతున్నారు సైకోథెర‌పిస్ట్ అమీ మోరిన్‌. ఆమె, థర్టీన్ థింగ్స్ మెంట‌లీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ…అనే పుస్త‌కాన్ని రాశారు. మ‌నం మాన‌సికంగా ఎంత బ‌ల‌వంతులం… అనే విష‌యాన్ని వార‌సత్వంగా వ‌చ్చిన మ‌న శ‌రీరంలోని జ‌న్యువులు, మ‌న వ్య‌క్తిత్వ ల‌క్ష‌ణాలు, మ‌నం ఎదుర్కొన్న అనుభ‌వాలు నిర్ణ‌యిస్తాయ‌ని చెబుతున్నారామె. మాన‌సిక బ‌ల‌వంతులు ఏఏ ప‌నులు చేయరు…. అనే అంశాల‌ను పుస్త‌కంగా రాసిన ఆమె, మ‌రి వారు ఏ ప‌నులు చేస్తారు…అనే అంశం గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ విశేషాలు ఇవి-

  • మాన‌సిక బ‌ల‌వంతులకు భావోద్వేగాలు త‌క్కువ‌గా ఉంటాయి, వారు త‌మ ఎమోష‌న్స్‌ని అణ‌చేసుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వారు త‌మలోని ఎమోష‌న్స్‌ని బాగా గ‌మ‌నిస్తారు. రోజంతా వాటిపై నిఘా ఉంచుతారు. త‌మ ఫీలింగ్స్… త‌మ ఆలోచ‌న‌ల‌ను, ప్ర‌వ‌ర్త‌న‌ను ఎలా ప్ర‌భావితం చేస్తున్నాయో ప‌రిశీలిస్తుంటారు. ఆ ప‌రిశీల‌న వ‌ల్ల‌నే వారు త‌మ భావోద్వేగాల‌తో కాకుండా ఆలోచ‌న‌ల‌తో ప‌నిచేస్తుంటారు. ఒక‌ ఫీలింగ్ కార‌ణంగా న‌ష్టం క‌లుగుతుంద‌నుకుంటే వారు దానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తారు కూడా.
  • ఎల్ల‌ప్పుడూ పాజిటివ్‌గా ఎవ‌రూ ఉండ‌లేరు. అలా ఉంటే అది నెగ‌టివ్ ఆలోచ‌న‌ల్లోకి దారితీస్తుంది. అది మాన‌సిక బ‌ల‌వంతుల‌కు తెలుసు. అలాగే త‌మ ఆలోచ‌న‌లన్నీక‌రెక్ట్ కాద‌న్న సంగ‌తిని వారు అర్థం చేసుకుంటారు. మైండ్ నెగెటివ్ ఆలోచ‌న‌ల్లోకి వెళ్లిపోతున్న‌ప్పుడు, వాటిని ఆపి వాస్త‌వం ఏమిట‌నే పున‌రాలోచ‌న చేయ‌గ‌లుగుతారు.
  • మాన‌సిక బ‌ల‌వంతులు అనుత్పాద‌క ప‌నులు ఎప్పుడూ చేయ‌రు. అంటే ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌యోజ‌నాన్ని ఇవ్వ‌ని కాల‌క్షేపం ప‌నులు. ఈ రోజు చాలా చెత్త‌గా న‌డిచింది… అనుకున్న స‌మ‌యాల్లో, ఆ రోజుని అలా మార్చింది ఎవ‌రు, ఏమిటి అనేది ప‌రిశీలించుకుని, ఆ ప‌ద్ధ‌తి మార్చుకుంటే క‌లిగే రిస్క్‌ని లెక్క‌వేసుకుంటూ ముందుకు న‌డుస్తారు.
  • -మాన‌సిక బ‌ల‌వంతులు త‌ప్పులు చేస్తే అప‌రాధ భావం, ప‌శ్చాత్తాపాల‌తో కుమిలిపోరు. దాన్నుండి పాఠం నేర్చుకుని త‌మ‌ని తాము క్ష‌మించుకుంటారు. ముఖ్యంగా మాన‌సికంగా బ‌లంగా ఉన్న‌వారు త‌మ‌ప‌ట్ల తాము చాలా ద‌య‌గా ఉంటారు. వీరు ఆత్మ విమ‌ర్శ చేసుకుంటారు కానీ, ప‌నిగ‌ట్టుకుని విమ‌ర్శిస్తూ,  కుంగ‌దీసే మ‌న‌సుని ప‌ట్టించుకోరు.
  • త‌మ మాట‌లు, చేత‌లకు తామే పూర్తిగా బాధ్య‌త వ‌హిస్తారు. ఇత‌రులు త‌మ‌ని న‌డిపించాల‌ని, నియంత్రించాల‌ని ఆశించ‌రు. మంచ‌యినా, చెడ‌యినా త‌మ ప‌నుల‌కు తామే బాధ్యుల‌మ‌ని ఒప్పుకుంటారు.
  • మాన‌సిక బ‌ల‌వంతుల‌కు కాలం విలువ తెలుసు. అందుకే వారు స‌మ‌యాన్ని వృథా చేయ‌రు. గ‌తాన్ని తవ్వుకుంటూనో, ఇత‌రుల‌కోసం కాలం వెచ్చించి, త‌రువాత‌ వారిని తిట్టుకుంటూనో కాలం గ‌డ‌ప‌రు. ఏదైనా ఉత్పాద‌క‌తనిచ్చే ప‌నిని మాత్ర‌మే చేస్తారు.
  • వీరి మెద‌డులో త‌మ ల‌క్ష్యం తాలూకూ పూర్తి చిత్రం ఉంటుంది. ఈ రోజు తీసుకున్న నిర్ణ‌యం, దీర్ఘ‌కాలంలో త‌మ‌ని ప్ర‌భావితం చేస్తుంద‌నే విష‌యం వీరికి తెలుసు.
  • వారు ప్ర‌తి స‌వాల్లోనూ ఒక అవ‌కాశాన్ని సృష్టించుకుంటారు. త‌మ‌కి తిరుగులేదు… అనే అహంకారం మాన‌సిక బ‌ల‌వంతుల‌కు ఉండ‌దు. ప్ర‌తిరోజూ ఎదిగేందుకు సిద్ధంగా ఉంటారు.
  • త‌మ బ‌ల‌హీన‌త‌ల‌ను గుర్తిస్తారు, వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. వీరికి త‌ప్పుల‌కు సాకులు వెతుక్కోవ‌డం కంటే, వాటి గురించి పూర్తిగా తెలుసుకుని, మ‌రొక‌సారి అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌ట‌మే ఇష్టం.

-వి.దుర్గాంబ‌