Telugu Global
POLITICAL ROUNDUP

బ‌తికుండ‌గానే శ‌వ‌పేటిక‌ల్లోకి!

  బ‌తికి ఉండ‌గానే చ‌నిపోయిన‌ట్టుగా అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డం నాట‌కాలు, సినిమాలు , సీరియ‌ల్స్‌లోనే చూస్తాం. కానీ ద‌క్షిణ కొరియా వెళితే మ‌నం కొన్ని ఆఫీసుల్లో ఈ విచిత్ర దృశ్యాలు   నిజ‌జీవితంలోనే చూడ‌వ‌చ్చు. ప్ర‌పంచంలోనే ఇక్క‌డ ఆత్మ‌హ‌త్య‌లు ఎక్కువ‌. మాన‌సిక‌ ఒత్తిడిని త‌ట్టుకోలేని దౌర్బ‌ల్యం వీరిలో ఎక్కువ‌గా ఉంది. అయితే త‌మ ఉద్యోగులు అలాంటి దౌర్బ‌ల్యానికి గుర‌యిన‌పుడు, అందులోంచి వారిని ప‌డేసేందుకు  ఒక వింత ఉపాయాన్ని క‌నిపెట్టాయి ఉద్యోగ సంస్థ‌ల యాజ‌మాన్యాలు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రిగే […]

బ‌తికుండ‌గానే శ‌వ‌పేటిక‌ల్లోకి!
X

బ‌తికి ఉండ‌గానే చ‌నిపోయిన‌ట్టుగా అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డం నాట‌కాలు, సినిమాలు , సీరియ‌ల్స్‌లోనే చూస్తాం. కానీ ద‌క్షిణ కొరియా వెళితే మ‌నం కొన్ని ఆఫీసుల్లో ఈ విచిత్ర దృశ్యాలు నిజ‌జీవితంలోనే చూడ‌వ‌చ్చు. ప్ర‌పంచంలోనే ఇక్క‌డ ఆత్మ‌హ‌త్య‌లు ఎక్కువ‌. మాన‌సిక‌ ఒత్తిడిని త‌ట్టుకోలేని దౌర్బ‌ల్యం వీరిలో ఎక్కువ‌గా ఉంది. అయితే త‌మ ఉద్యోగులు అలాంటి దౌర్బ‌ల్యానికి గుర‌యిన‌పుడు, అందులోంచి వారిని ప‌డేసేందుకు ఒక వింత ఉపాయాన్ని క‌నిపెట్టాయి ఉద్యోగ సంస్థ‌ల యాజ‌మాన్యాలు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌రిగే డ‌మ్మీ అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మం ఇది. ఈ తంతుని నిర్వ‌హించే సంస్థ‌లు సైతం ఉన్నాయి.

అత్యాధునిక కంపెనీల్లో మంచి శాల‌రీల్లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు, మ‌ర‌ణించిన త‌రువాత ధ‌రించే తెల్ల‌ని దుస్తులు ధ‌రించి, త‌మ‌కు ప్రియ‌మైన వారికి సూసైడ్ నోట్స్ రాస్తున్న దృశ్యాలు ఇప్పుడు సియోల్‌లో త‌ర‌చుగా క‌న‌బ‌డుతున్నాయి. నిజంగా అది త‌మ చివ‌రి లేఖ‌గా భావిస్తూ, అలా న‌టిస్తూ వారు క‌న్నీళ్లు కూడా కారుస్తుంటారు. త‌రువాత న‌ల్ల‌ని రిబ్బ‌న్ చుట్టి ఉన్న త‌మ ఫొటోతో పాటు త‌మ‌ ప‌క్క‌నే ఉన్న శ‌వ‌పేటిక‌ల్లో ప‌డుకుంటారు. ఆ త‌రువాత మృత్యు దేవ‌త‌ని ప్ర‌తిబింబించేలా ఒక వ్య‌క్తి, న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి ఆ శ‌వ‌పేటిక‌ల త‌లుపుల‌ను మూసేస్తాడు. అక్క‌డితో వారి క‌ళ్ల‌ముందు మృత్యువు లా న‌ల్ల‌ని చీక‌టి ప‌రుచుకుంటుంది.

ఈ కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించేందుకు ప్ర‌త్యేకంగా సంస్థ‌లు వెలిశాయి. అలాంటి ఓ సంస్థ‌కు య‌జ‌మాని అయిన జియాంగ్ యాంగ్-మన్, జీవితం విలువ తెలియ‌జేయ‌డానికే ఈ త‌ర‌హా స్వీయ అంత్య‌క్రియ‌ల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామని అంటున్నాడు. ఇంత‌కుముందు ఇత‌నికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించే సంస్థ ఉండేది.

ఈ తంతుతో పాటు ఉద్యోగుల‌కు, మ‌ర‌ణానికి చేరువ‌లో ఉన్న‌వారి, అంగ‌వైక‌ల్యంతో జీవిత పోరాటం చేస్తున్న‌వారి వీడియోల‌ను చూపిస్తారు. శ‌వ పేటిక‌లోకి వెళ్లి రావ‌డం అనేది మ‌న మ‌న‌సు మీద తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని, షాకింగ్‌గా ప‌నిచేస్తుంద‌ని, త‌మ ఉద్యోగుల‌కు ఈ శ‌వ‌పేటిక థెర‌పీ ఇప్పించిన ఒక కంపెనీ య‌జ‌మాని చెబుతున్నాడు. ఈయ‌న త‌న కంపెనీలో ఉద‌యాన్నే ఉద్యోగుల చేత వ్యాయామాలు, లాఫింగ్ థెర‌పీ కూడా చేయిస్తున్నాడు.

ఇంత‌కీ ఈ శ‌వ‌పేటిక థెర‌పీ ఎంత‌వ‌ర‌కు ఫ‌లించింది అనే ప్ర‌శ్న వేస్తే…పాల్గొన్న‌వారిలో చాలామంది పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. జీవితంలో చేసిన త‌ప్పులు తెలిశాయ‌ని, కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతామ‌ని, జీవితం విలువ తెలిసింద‌ని… ఇలా సానుకూలంగా స్పందించారు.

ద‌క్షిణ కొరియాలో చ‌దువులు, ఉద్యోగాల్లో పోటీ పెరిగిపోతోంది. దీనివ‌ల్ల పిల్ల‌లు, పెద్ద‌లు కూడా మాన‌సిక ఒత్తిడిని భ‌రించ‌లేక‌పోతున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంలో స్పందించి చ‌ర్య‌లు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆఫీస్‌ల్లో ఒక గంట నిద్ర‌పోయే అవ‌కాశాన్ని క‌ల్పించారు. అయితే అందుకు బ‌దులుగా ఆఫీస్‌కి ఒక గంట ముందుగా రావ‌డ‌మో, ఒక‌గంట ఆల‌స్యంగా ఇంటికి వెళ్ల‌డ‌మో చేయాలి.

పిల్ల‌ల చ‌దువులు, ఉద్యోగాల కోసం త‌ల్లులు, అమ్మ‌మ్మ‌లు, నాన్న‌మ్మ‌లు ఎంతో శ్ర‌మ‌కు ఓర్చి కొండ‌ల‌పై ఉన్న ఆల‌యాల‌కు వెళ్ల‌డం, ప్రార్థ‌న‌లు చేయ‌డం కూడా అక్క‌డ ఉన్న విప‌రీత‌మైన పోటీని, ఒత్తిడిని తెలియ‌జేస్తోంద‌ని బిబిసి, దీనిపై ప్ర‌సారం చేసిన ఒక క‌థ‌నంలో పేర్కొంది.

First Published:  17 Dec 2015 7:24 AM GMT
Next Story