జైలుకే గాంధీల మొగ్గు !

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నాడు దిల్లీలోని పటియాలా కోర్టుల ఆవరణలో ఓ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఈ సందర్భాన్ని బలప్రదర్శనకు వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులను, రాష్ట్ర పీసీసీల అధ్యక్షులను, ఎం.పీ.లను శనివారం ఉదయానికల్లా అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గరకు చేరుకోవాలని ఆదేశించారు. అక్కడి నుంచి సోనియా, రాహుల్ తో కలిసి ఊరేగింపుగా కోర్టుకు హాజరు కావాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక.

మూత పడిన నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కేసు దాఖలు చేయడానికి నిరసనగా బలప్రదర్శన చేసి తమ సత్తా నిరూపించుకోవాలని కాంగ్రెస్ సంకల్పించింది.

ఈ కేసులో జామీను కోరకుండా అవసరమైతే జైలుకెళ్లాలన్నది రాహుల్ ఎత్తుగడ. సొనియా ఆరోగ్యం బాగా లేనందువల్ల ఆమె జామీనుకు దరఖాస్తు చేయాలని ముందు అనుకున్నా ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో కాంగ్రెస్ కోశాధికారి మోతీ లాల్ ఓరా కూడా నిందితుడు. ఆయనకు 86 ఏళ్లు. ఆయన మాత్రం జామీను కోరవచ్చు. తాను ఇందిరా గాంధీ కోడలిని కనక ఎవరికీ జడవనని సోనియా ఇటివలే గంభీరమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకే 1977లో ఇందిరా గాంధీ అరెస్టు అయినట్టే తాము అరెస్టు అయి ప్రజల సానుభూతి సంపాదించవచ్చునని సోనియా, రాహుల్ భావిస్తున్నారు.