వైసీపీ ఎమ్మెల్యేకి స్పీకర్ వార్నింగ్‌, జ్యోతుల నెహ్రు వాగ్వాదం

కాల్‌మనీ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు వైసీపీ పట్టుబట్టింది. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో తుని వైసీపీ ఎమ్మెల్యే డి. రాజాకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వార్నింగ్ ఇచ్చారు. ”మీ ప్రవర్తన సరిగా లేదు… ఐ వార్న్‌ యూ, హెచ్చరిస్తున్నా పద్దతి మార్చుకోండి. కెమెరాలకు అడ్డంగా ప్లకార్డులు అడ్డుపెట్టి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. మీకు ఇదో హెచ్చరిక” అంటూ ఎమ్మెల్యే డి. రాజాపై కోడెల ఆగ్రహం వ్యక్తం చేశారు. ”మీ ఎమ్మెల్యేల పద్దతి సరిగా లేదు… సరిచేసుకోమనండి” అంటూ జగన్‌కు స్పీకర్‌ సూచించారు. అయితే స్పీకర్‌ తీరుపై వైసీపీ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. టీడీపీ మంత్రులు, సభ్యులకు వరుసగా మాట్లాడే అవకాశం ఎలా ఇస్తున్నారంటూ వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు.. స్పీకర్‌ను ప్రశ్నించారు. సభ ఆర్డర్‌లో లేనప్పుడు అధికార పక్ష సభ్యులకు మైక్ ఎలా ఇస్తున్నారంటూ నిలదీశారు. కాసేపు కోడెల, నెహ్రుకు మధ్య వాగ్వాదం జరిగింది.  నెహ్రుకు మద్దతుగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్ రెండో సారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్‌.

click to read:అంబేద్కర్‌ సాయంతో గట్టెక్కిన ప్రభుత్వం