రోజాపై అసెంబ్లీ అసాధారణ నిర్ణయం

ఆంధ్రపదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.  సభలో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే  రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా… స్పీకర్‌ ఆమోదం తెలిపారు. స్పీకర్ నిర్ణయంపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. వైసీపీ సభ్యులను బజారు రౌడీలు అని సంబోధించిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్పీకర్‌ను నిలదీశారు.  కనీసం తన వాదన వినిపించేందుకు ఒక సారి మైక్ ఇవ్వాలని  రోజా కోరినా స్పీకర్ అనుమతించలేదు.

click to read: రోజా సస్పెన్షన్‌- రూల్‌ ఏమంటోంది? కరణంను ఎలా చేశారు?

రోజా సభ నుంచి బయటకు వెళ్తేనే జగన్‌కు మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు.  ఉరి శిక్షపడిన వారికైనా వాదన వినిపించేందుకు ఆఖరి అవకాశం ఇస్తారని .. కాబట్టి రోజాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారు. అయినా స్పీకర్‌ వెనక్కు తగ్గలేదు. రూల్స్ ఆడవారికైనా మగవారికైనా ఒకేలా ఉంటాయి కాబట్టి… రోజా బయటకు వెళ్లాల్సిందేనని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. చివరకు చేసేదేమీ లేక రోజా బయటకు వెళ్లిపోయారు. సభ జరుగుతుండగా సభ్యుడిని ఏడాది పాటు సస్పెండ్ చేయాలంటే క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేయాల్సి ఉంటుందని ఆ పని చేయకుండానే రోజాను ఎలా సస్పెండ్ చేస్తారని జగన్‌ ప్రశ్నించారు.