Telugu Global
National

కేజ్రీవాల్‌పై జైట్లీ పరువు నష్టం దావా... వివాదం ఏమిటంటే!

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అక్రమాల్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తన ప్రతిష్టకు భంగంకలిగించేలా కేజ్రీవాల్ వ్యాఖ్యలున్నాయంటూ ఢిల్లీ పటియాల కోర్టులో రూ. 10 కోట్లకు జైట్లీ  పరువు నష్టం దావా వేశారు. జైట్లీ పిటిషన్ స్వీకరించిన కోర్టు జనవరి 5న విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. జైట్లీ వెంట కేంద్ర మంత్రులు స్మృతి […]

కేజ్రీవాల్‌పై జైట్లీ పరువు నష్టం దావా... వివాదం ఏమిటంటే!
X

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. అక్రమాల్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాత్ర ఉందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. తన ప్రతిష్టకు భంగంకలిగించేలా కేజ్రీవాల్ వ్యాఖ్యలున్నాయంటూ ఢిల్లీ పటియాల కోర్టులో రూ. 10 కోట్లకు జైట్లీ పరువు నష్టం దావా వేశారు. జైట్లీ పిటిషన్ స్వీకరించిన కోర్టు జనవరి 5న విచారణ ఉంటుందని స్పష్టం చేసింది. జైట్లీ వెంట కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, వెంకయ్య నాయుడుతోపాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు పటియాల కోర్టుకు వచ్చారు.

వివాదం ఏంటి?
ఢిల్లీ క్రికెట్ సంఘానికి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ఆమ్ ఆద్మీపార్టీ ప్రధాన ఆరోపణ. నిజానికి బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కూడా గత 9ఏళ్లుగా ఇదే ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం మరమ్మతులకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయల చొప్పున 500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారన్నది ప్రధానమైన ఆరోపణ. తాజాగా కీర్తి ఆజాద్ జైట్లీపై తీవ్ర ఆరోపణలు చేశారు. డీడీసీఏ‌లో అవినీతి జరిగిందని ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని కీర్తి ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. అక్రమాలకు సంబంధించిన 28 నిమిషాల వీడియోను ఆయన ఆదివారం రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అడ్రస్‌లేని కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం.. టెండర్లలో అక్రమాలకు పాల్పడడం.. ఒకరోజు అద్దె కోసం కంప్యూటర్ కు 16వేలు, ప్రింటర్‌కు రూ. 3వేలు, హారతి పళ్లానికి రూ. 5వేలు చెల్లించినట్టు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నా.. సొంతపార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ జైట్లీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం ఆపార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.

విచారణ కమిషన్ ఏర్పాటు
మరోవైపు ఢిల్లీ క్రికెట్ సంఘం అవినీతి వ్యవహారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రమణ్యం అధ్యక్షతన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ క్రికెట్‌ సంఘం అవకతవకలపై జైట్లీని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆప్‌ డిమాండ్‌ చేసింది. జైట్లీ హయాంలో డీడీసీఏలో జరిగిన అక్రమాలపై తాను విచారణకు ఆదేశించానన్న విషయం తెలుసుకుని ఆ ఫైలు కోసమే సీబీఐ తన కార్యాలయంపై దాడులు నిర్వహించిందని కేజ్రీవాల్ ఇదివరకే ఆరోపించారు. తాజాగా జైట్లీ తప్పు చేయనపుడు ఎందుకు భయపడుతున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆయనపై దర్యాప్తు జరపకుండా వదిలిపెడితే బొగ్గు, 2జీ కుంభకోణం కేసుల్లో నింధితులు కూడా ఇలాగే చెప్పారని.. వారినీ అలాగే వదిలిపెట్టాలా? కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇటు జైట్లీ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్‌ కూడా ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ సంఘం వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పుడు డీడీసీఏ వ్యవహారం నుంచి జైట్లీని కాపాడే ప్రయత్నాల్లో బీజేపీ, ఇరికించే ప్రయత్నాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది.

First Published:  21 Dec 2015 5:16 AM GMT
Next Story