మీడియాకు నోటీసులు, కాల్‌మనీలో ఒక ఫిర్యాదే

శాసనమండలిలో కాల్‌మనీపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా కాల్‌మనీ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాల్‌మనీ పేరుతో మీడియా ఇష్టానుసారం వ్యవహరించకూడదని హితవు పలికారు. ఈ వ్యవహారంలో మీడియాకు నోటీసులు జారీ చేసి తీరుతామన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాపై దాడి సరికాదని సూచించారు. చంద్రబాబు మాత్రం మీడియాకు నోటీసులు తప్పకుండా జారీ చేస్తామని ఆధారాలుంటే ఇవ్వాల్సిందిగా కోరుతామని… అలా కానీ పక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఒక మహిళ మాత్రమే ఫిర్యాదు చేసిందని చెప్పారు. మిగిలిన వారికి సంబంధించి సమాచారం లేదన్నారు. నూతన రాజధాని ప్రతిష్ట దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కొందరికి ఇష్టం లేదని విమర్శించారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి ఘటనను చంద్రబాబు ప్రస్తావించారు. తహసీల్దారే హద్దులు దాటి వెళ్లారని చెప్పారు. అధికారులు హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కూడా మందలించానని చంద్రబాబు చెప్పారు.