అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ కూడా హాట్ హాట్ గా మొదలయ్యాయి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను మొత్తం వైసీపీ బహిష్కరించింది. వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం సబబు కాదని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సభకు విజ్ఞప్తి చేశారు. రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని లేనిపక్షంలో సెషన్ మొత్తం బాయ్ కాట్ చేస్తామని జగన్ ప్రకటించారు. రోజా విషయంపై అవసరమైతే తాము కోర్టుకు కూడా వెళ్తామన్నారు జగన్. అదే సమయంలో టీడీపీకి బీజేపీ వత్తాసు పలుకుతోందని జగన్ విమర్శించారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు.
 
ప్రతిపక్ష నేత జగన్ కోర్టుకు వెళ్లినా, సభను బాయ్ కాట్ చేసినా రోజాపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే ప్రసక్తే లేదని యనమల ప్రకటించారు. హౌస్ కాకుండా మరెవరికి అధికారాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. దీనిపై రూలింగ్ ఇచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్.. రోజా విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందని ఆమె వ్యవహారశైలి సభా నియమాలకు విరుద్ధంగా ఉందని సస్పెన్షన్ ఎత్తివేయడం కుదరదని స్పీకర్ అన్నారు. ఈ విషయంపై కోర్టుకెళ్లడం అన్నది మీఇష్టమని.. ప్రతిపక్షనేతగా సభలో ఉంటే మంచిదని మాత్రమే సూచిస్తున్నానని స్పీకర్ అన్నారు.
 
దీంతో మరోసారి మైకు అందుకున్న జగన్.. కాల్ మనీ వ్యవహారంపై తమ పార్టీకి చెందిన అనేక మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. అయినా అర్థంతరంగా చర్చ ముగించారన్నారు. ఇక రోజా విషయంలో ప్రభుత్వం ప్రకటన,  స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ జగన్ ఈ అసెంబ్లీ సెషన్స్ అంతా బాయ్ కాట్ చేస్తున్నట్టు ప్రకటించి ఎమ్మెల్యేలందరితో కలిసి బయటకు వెళ్లిపోయారు.