Telugu Global
Cinema & Entertainment

క్లీన్‌ కామెడీ భలేమంచిరోజు

రేటింగ్‌: 3.0/5 విడుదల తేదీ : 25 డిసెంబర్‌ 2015 దర్శకత్వం : శ్రీరామ్‌ అధిత్య ప్రొడ్యూసర్‌ : విజయ్‌ కుమార్‌ రెడ్డి, శశిధర్‌ రెడ్డి సంగీతం :  సన్నీ ఎం. ఆర్‌ కిడ్నాప్‌ కామెడీ ఇప్పటి కథ కాదు. వందేళ్ళక్రితమే ఆస్కార్‌ వైల్డ్‌ “రాంసమ్‌ ఆఫ్‌ రెడ్‌ చీఫ్‌” అనే కథ రాసాడు. మూర్ఖులైన కిడ్నాపర్స్‌ ఎలాంటి చిక్కుల్లో పడ్డారనేది కథ. ఆ తరువాత ఈ అంశంతో అనేకభాషల్లో సినిమాలు వచ్చాయి. మన తెలుగులో కూడా ఇవేం కొత్త […]

క్లీన్‌ కామెడీ భలేమంచిరోజు
X

రేటింగ్‌: 3.0/5
విడుదల తేదీ : 25 డిసెంబర్‌ 2015

దర్శకత్వం : శ్రీరామ్‌ అధిత్య
ప్రొడ్యూసర్‌ : విజయ్‌ కుమార్‌ రెడ్డి, శశిధర్‌ రెడ్డి

సంగీతం : సన్నీ ఎం. ఆర్‌

కిడ్నాప్‌ కామెడీ ఇప్పటి కథ కాదు. వందేళ్ళక్రితమే ఆస్కార్‌ వైల్డ్‌ “రాంసమ్‌ ఆఫ్‌ రెడ్‌ చీఫ్‌” అనే కథ రాసాడు. మూర్ఖులైన కిడ్నాపర్స్‌ ఎలాంటి చిక్కుల్లో పడ్డారనేది కథ. ఆ తరువాత ఈ అంశంతో అనేకభాషల్లో సినిమాలు వచ్చాయి. మన తెలుగులో కూడా ఇవేం కొత్త కాదు. అందులో కొన్ని హిట్స్‌, కొన్ని ఫట్‌.

కిడ్నాప్‌ కథతో ఈ మధ్యనే శంకరాభరణం వచ్చి చతికిలపడింది. మళ్ళీ నెల తిరక్కుండానే ఇంకోసినిమా. దానిపేరు భలే మంచిరోజు. అయితే దర్శకుడు ప్రతిభావంతుడు కావడం వల్ల ఈ సినిమా బావుంది. ఇలాంటి కథలు చాలా చూసినప్పటికీ సినిమా బోర్‌ కొట్టకుండా ఉండడానికి ప్రధానకారణం స్క్రీన్‌ప్లే. తెరపై వచ్చే ప్రతి పాత్రకి కథతో సంబంధముంటుంది. ఆ క్యారెక్టర్స్‌ని రిజిస్టర్‌ చేయడంలో డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య సక్సెసయ్యాడు.

ఇక సుధీర్‌బాబు మంచినటుడు. మంచి కథలు కుదరకపోవడం వల్ల ప్లాప్‌ల పాలయ్యాడు. ఈ సినిమాకొంత అతన్ని గట్టెక్కించింది. నిజానికి ఈ కథని పరిచయం చేస్తే థ్రిల్‌ పోతుంది. అయినా కొంతవరకూ చెప్పుకుందాం.

హీరోయిన్‌ పేరు సీత (కొత్తనటి వామిక) ఆమె పెళ్ళి ఏర్పాట్లతో కథ మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల పెళ్ళి ఆగిపోతుంది. ఆమె కిడ్నాప్‌ జరుగుతుంది. ఆమెని ఎవరు కిడ్నాప్‌ చేసారు, హీరో ఈ కిడ్నాప్‌ డ్రామాలో ఎలా ఇరుక్కున్నాడనేది మిగతా కథ.

ఈ మధ్య చాలా సినిమాల్లో లేనిది, ఈసినిమాలో వున్నది ఏమిటంటే సీన్స్‌ ఫ్రెష్‌గా ఉండడం. రొటీన్‌ పంచ్‌లు, ప్రాసలు కాకుండా సాదాసీదా మాటలతోనే హాస్యాన్ని సృష్టించడం. అయితే చాలామందిలాగే సెకెండాఫ్‌లో డైరెక్టర్‌ తడబడ్డాడు. నెరేషన్‌ కొంత స్లోకావడం, కథకి అడ్డంగా రెండు పాటలని ఇరికించడం చేసాడు. క్లీన్‌ హ్యూమర్‌తో కథ నడుస్తునపుడు పంటికింది రాయిలా ఐశ్వర్య (నటి లక్ష్మికూతురు) ఎపిసోడ్‌ అడ్డొస్తుంది. వల్గారిటి అవసరం లేకుండా కూడా ఈ పాత్ర ఉండొచ్చు. ఇలాంటి సీన్స్‌ దర్శకుడి మీద గౌరవాన్ని తగ్గించడమేకాదు, బ్యాడ్‌ టేస్ట్‌ని తెలియచేస్తాయి.

జబర్దస్త్‌ బ్యాచ్‌ చమ్మక్‌ చంద్ర తన స్టయిల్‌లో కామెడీని పండించాడు. సాయికుమార్‌తో అనవసరంగా కేకలు పెట్టించకుండా కామెడి క్రియేట్‌ చేయడం పెద్దరిలీఫ్‌. ఇక పోసాని కృష్ణమురళికి ఫాదర్‌ వేషం తగిలించాడు. అత్తారింటికి దారేదిలో లాగా “ఏసునాధా” అంటూ నవ్విస్తాడు. ధన్య బాలకృష్ణన్‌ కాసేపున్నా గ్లామరస్‌గా కనిపించింది. ఫొటోగ్రఫి, సంగీతం ఓకే. చాలాకాలం తరువాత పరుచూరి గోపాలకృష్ణ కనిపించాడు. కారు మెకానిక్‌గా “రెంచ్‌, స్పానర్‌, బోల్ట్‌లు” అంటూ డైలాగ్‌ కురిపించాడు. అందరూ కూడా ఎక్కడా అతిలేకుండా నటించడమే విశేషం.

తెలుగు సినిమా ప్రేక్షకులు విసిగిపోతున్న విషయం ఏమంటే హీరో గుణగణాలను వర్ణిస్తూవచ్చే ఇంట్రడక్షన్‌ సాంగ్‌. అదృష్టవశాత్తూ ఈ సినిమాలో ఆ పాటలేదు. హీరోకి సిక్స్‌ప్యాక్‌ వున్నా ఫైటింగ్‌లకి అవకాశంవున్నా విలన్లు గాల్లోకి ఎగరకుండా నేలమీదే ఉండడం ఈ సినిమా ప్లస్‌పాయింట్‌. సెకండాఫ్‌ని కొంత ట్రిమ్‌చేసి పదిహేను నిముషాలు నిడివి తగ్గించి ఉంటే బావుండేది.

చివరల్లో పృధ్వి కామెడికూడా ఉంది. అయితే అది లౌక్యం సినిమాని గుర్తుతెస్తుంది. చిన్నచిన్న లోపాలున్నప్పటికీ చూడతగిన సినిమా.
ఈ సినిమాలో ఒక డైలాగుంది “కొత్తగా డైలాగ్‌లు రాయడానికి నేనేమైనా కోన వెంకట్‌నా” అని. అయితే కోన వెంకట్‌ డైలాగ్‌లు రాయడం మానుకున్న తరువాత ఈ సినిమా వచ్చింది. అదే విచిత్రం.

సినిమా అంతటా హీరో నుదుటిపై చిన్న ప్లాస్టర్‌ ఉంటుంది. అయితే సినిమా మొదట్లో ఎడమవైపు ఉంటుంది. తరువాత కుడికి మారుతుంది.ఇ కుడిఎడమైతే పొరపాటు లేదోయ్‌ అని రేడియోలో పాట వినిపించడం వల్ల దీన్ని పెద్ద తప్పుగా పట్టించుకోనక్కరలేదేమో!

– జి ఆర్‌. మహర్షి

First Published:  25 Dec 2015 6:55 AM GMT
Next Story