Telugu Global
Cinema & Entertainment

నేను...శైలజ... సినిమా రివ్యూ

రేటింగ్‌: 2.25/5 విడుదల తేదీ : 01 జనవరి 2016 దర్శకత్వం : కిషోర్‌ తిరుమల ప్రొడ్యూసర్‌ : రవి కిషోర్‌ బ్యానర్‌:  శ్రీ స్రవంతి మూవీస్‌ సంగీతం :  దేవిశ్రీ ప్రసాద్‌ నటీనటులు : రామ్‌, కీర్తిసురేష్‌, రోహిణి, సత్యరాజ్‌, ప్రదీప్‌ రావత్‌, నరేష్‌ కథ చెప్పడం రెండు రకాలు. ఎవరూ వూహించలేని విధంగా చెప్పడం. అందరికి తెలిసిన కథని ఆసక్తికరంగా చెప్పడం. మొదటి దానికి ఉదాహరణ అపరిచితుడు, భారతీయుడు. ఆ సినిమాల్లో వచ్చే మలుపుల్ని మనం కనిపెట్టలేం. […]

నేను...శైలజ... సినిమా రివ్యూ
X

రేటింగ్‌: 2.25/5
విడుదల తేదీ : 01 జనవరి 2016
దర్శకత్వం : కిషోర్‌ తిరుమల
ప్రొడ్యూసర్‌ : రవి కిషోర్‌
బ్యానర్‌: శ్రీ స్రవంతి మూవీస్‌
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
నటీనటులు : రామ్‌, కీర్తిసురేష్‌, రోహిణి, సత్యరాజ్‌, ప్రదీప్‌ రావత్‌, నరేష్‌

కథ చెప్పడం రెండు రకాలు. ఎవరూ వూహించలేని విధంగా చెప్పడం. అందరికి తెలిసిన కథని ఆసక్తికరంగా చెప్పడం. మొదటి దానికి ఉదాహరణ అపరిచితుడు, భారతీయుడు. ఆ సినిమాల్లో వచ్చే మలుపుల్ని మనం కనిపెట్టలేం. రామయణ, భారతాలు రెండోరకం. తరతరాలుగా మనకు ఈ కథలు తెలుసు. కానీ సినిమా పుట్టినప్పటినుంచి కొన్ని వందలసార్లు ఈ కథలు తెరపై కనిపించాయి. టీవీలో సీరియల్‌గా వచ్చినపుడు కూడా సూపర్‌హిట్‌ కావడానికి కారణం పాత్రల భావోద్వేగాలను గుండెలకు హత్తుకునేలా చిత్రించడం. కురుక్షేత్రం జరుగుతుందని, భీముడు దుర్యోధనున్ని చంపుతాడని అందరికీ తెలుసు. కానీ ఎన్నిసార్లయినా చూస్తారు. మన దర్శకులకు ఈ సూత్రం సరిగా అర్థంకాక తికమకపడుతున్నారు. దీనికి ఉదాహరణ నేను.. శైలజ.. సినిమా

ఈ టైటిల్‌ చూడగానే మనకు సగం కథ తెలిసిపోతుంది. శైలజ అనే అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్‌స్టోరీనే సినిమా అని. సినిమా బిగినింగ్‌లో ఇది చైల్డ్‌హుడ్‌ లవ్‌స్టోరీ అని తెలుస్తుంది. హీరోయిన్‌ తండ్రిగా సత్యరాజ్‌ లాంటి పెద్దయాక్టర్‌ కనిపించగానే తండ్రీకూతుళ్ళ మధ్య కొంత కథ నడుస్తుందని తెలుస్తుంది. ఇన్నితెలిసిన తరువాత థియేటర్‌లో రెండుగంటలు ప్రేక్షకున్ని కూచోపెట్టాలంటే స్ర్కీన్‌పై మ్యాజిక్‌ జరగాలి. అదే జరగలేదు.

నిజానికి ఈ సినిమా ఎబౌ ఏవరేజ్‌, హిట్‌రేంజ్‌కి చేరుకునే అవకాశమున్నప్పటికీ డైరెక్టర్‌ తనకు తానే చిక్కుముళ్ళు సృష్టించుకుని విప్పుకోలేక అవస్థలు పడ్డాడు. ఫీల్‌గుడ్‌ సినిమా తీయడానికి ప్రయత్నం చేసాడు కానీ దానికి తగిన కసరత్తు చేయలేకపోయాడు. జిమ్‌కి వెళ్ళకుండా ఎవరికీ సిక్స్‌ప్యాక్‌ బాడీ రాదు. అదేవిధంగా ఫీల్‌గుడ్‌ సినిమా తీయాలంటే దర్శకుడికి ఫిలసాఫికల్‌ స్టామినా ఉండాలి. జీవితాన్ని చూడకుండా, సినిమాలు చూసి సినిమాలు తీయడం వల్ల కొత్త దర్శకుల్లో ఇదిలోపిస్తోంది. భజరంగి భాయ్‌ జాన్‌ సినిమాలో ఒక పాకిస్తాని పసిపాపని చూసి మనం కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటామంటే హీరో క్యారెక్టర్‌లో ఉన్న నిజాయితీని చూసి. పాపని తల్లి దగ్గరికి చేర్చడానికి ప్రాణాలకి కూడా లెక్కచేయని అతని మంచితనాన్ని చూసి.

నేను శైలజ ఒక తలాతోకాలేని సినిమా అయితే ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడొస్తున్న చాలా సినిమాల్లో కనిపించని ఎమోషన్స్‌ ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే కేర్టక్టరైజేషన్‌లో ఉన్న లోపాలవల్ల ప్రేక్షకులకి సరిగా రిజిస్టర్‌ కాదు.

కూతుర్ని ఇష్టపడే సత్యరాజ్‌లాంటి వ్యక్తి, ఆ కూతురు ఇష్టపడే చిన్న కుక్కపిల్లని కాలితో తంతాడు. మరీ క్రూరంగా ఆ కుక్కపిల్ల ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా వెహికల్‌ కింద చంపేస్తాడు. ఈ సీన్‌వల్ల సత్యరాజ్‌ని దుర్మార్గుడని ప్రేక్షకుడు భావిస్తాడు. హీరోయిన్‌ కళ్ళలో కూడా అదే భావం కనిపిస్తుంది. తండ్రిని నెగెటివ్‌గా చూపించి అదే తండ్రి మాటకాదనలేక ప్రేమించినవాడిని కాదనుకుని ఎవడినో పెళ్ళి చేసుకోడానికి హీరోయిన్‌ ఒప్పుకుంటుందంటే ఈ సన్నివేశంలో ఏమైనా ఔచిత్యముందా?

ఇంతకీ కథ ఏమంటే శైలజ అనే అమ్మాయిని రామ్‌చిన్నప్పుడు ఇష్టపడతాడు. తరువాత ఇద్దరు విడిపోతారు. చిన్నప్పటినుంచి ఎవరో ఒకర్ని ప్రేమించాలని రామ్ అందరికి ఐలవ్‌యూ చెపుతుంటాడు. కానీ అతనికి ఎవరూ ఐలవ్‌యూ చెప్పరు. ఒకరోజు శైలజ పరిచయమవుతుంది. ఆమె తన చిన్ననాటి ఫ్రెండ్‌ అని హీరోకి తెలుస్తుంది. అతనే తన చిన్ననాటి స్నేహితుడని ఆమెకి కూడా తెలుస్తుంది. ఇద్దరి మధ్య లవ్‌. హీరో ఐలవ్‌యూ చెప్పేసరికి ఆమె కూడా ఐలవ్‌యూ చెప్పి, అయితే నేను నీ ప్రేమలో లేను అని అర్ధంలేని డైలాగ్‌ కూడా చెబుతుంది. హీరోతోపాటు మనకూ కన్‌ఫ్యూజన్‌, ఇంటర్వెల్‌. ఈ కథని చైల్డ్‌హుడ్ కథగా కాకుండా మామూలు కథగా కూడా తీయచ్చు. అనవసరమైన చిక్కుముడిని డైరెక్టర్‌ తగిలించుకున్నాడు.

సెకెండాఫ్‌లోనైనా డైరెక్టర్‌ సాపీగా ప్రయాణించాడంటే అదీ లేదు. హీరో అక్కకి ఒక లవ్‌స్టోరీ పెట్టి, ఆమెని శైలజ అన్నయ్యతో జతకలిపాడు. ఇంతకూ శైలజ హీరోకి తికమక సమాధానం ఎందుకు చెప్పిందంటే ఎప్పట్నుంచో మనస్పర్ధలున్న ఆమె తాతయ్య, తండ్రి, అత్తయ్య కలిసిపోవడం వల్ల అత్తకొడుకుతో ఆమె పెళ్ళిఫిక్స్‌ చేస్తారు. ఇక్కడ ఇంకో ఉచ్చుని తగిలించుకుని డైరెక్టర్‌ గిజగిజలాడి దిల్‌వాలే దుల్హనియ లేజాయింగే కథలోకి వెళ్ళిపోయాడు. అక్కడితో ఆగకుండా ప్రదీప్‌రావత్‌ అనే తిక్కలోడిని పెట్టి వాడి ద్వారా కథని మలుపుతిప్పాలని చూసాడు. ఇదంతా చాలదన్నట్టు ఒక విలన్‌ని పెట్టి హీరోకి రెండు మూడు ఫైట్లు పెట్టాడు. మనం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే హాయిగా ఫోర్‌లైన్‌ రోడ్‌లో వెళ్ళాలి. కానీ హైదరాబాద్‌నుంచి విమానంలో బెంగుళూరు వెళ్ళి, అక్కడి నుంచి కారులో తిరుపతి చేరుకుని, ఆ తరువాత పల్లెవెలుగు బస్సులో నెల్లూరు వెళ్ళి, అక్కడి నుంచి సర్వీస్‌ ఆటోలో కూడా విజయవాడ వెళ్ళచ్చు. కానీ అనవసరంగా ఒళ్ళుహూనమైపోతుంది. ప్రేక్షకుడికి కూడా ఇదే జరిగింది.

అయితే ఈసినిమా అస్సలు బాలేదా అంటే చాలాచోట్ల బావుంది. రామ్‌ చాలా ఎనర్జిటిక్‌గా ఉండడమే కాదు బోలెడన్ని పంచ్‌లు కూడా వేస్తాడు. కామెడీనటులే లేకుండా థియేటర్‌లో నవ్వులు వినిపించాయంటే అది రామ్‌ క్రెడిట్టే. హీరోయిన్‌ మాత్రం పప్పు సుద్దలా ఉంది. సినిమాలో ఆమె క్యారెక్టర్‌ కూడా అదే కాబట్టి సర్దుకుపోవాలి. ఆమె కంటే ధన్య బాలకృష్ణన్‌ (హీరోయిన్‌ ఫ్రెండ్‌) క్యూట్‌గా ఉంది. సీనియర్ నరేష్‌ వున్పప్పటికీ ఆయనికి నటించడానికేంలేదు. కృష్ణభగవాన్‌ ఉన్నా నీరసంగా ఉన్నాడు. తండ్రిగా సత్యరాజ్‌ అద్భుతంగా నటించాడు. కానీ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాడు.

అయినా ఈ కాలంలో కూడా అమ్మాయిని అడక్కుండా పెళ్ళి ఫిక్స్‌ చేస్తారా? మొదటిసీన్‌లో హీరో కిందపడిపోతుంటే చొరవగా అతన్ని కాపాడిన అమ్మాయి తనకి ఇష్టంలేని పెళ్ళి గురించి ధైర్యంగా చెప్పలేదా? అవన్నీ ఆలోచిస్తే సినిమానే లేదు.

దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి ఎస్సెట్‌. డైలాగ్స్‌ చాలా బావున్నాయి. (కూతుర్ని అత్తారింటికి పంపాలని డైలాగ్‌ రాసిన వాడెవడో వాడికి ఖశ్చితంగా కూతుళ్ళు ఉండరు). పాటలు అంతంత మాత్రమే ఫొటోగ్రఫి సూపర్‌. పాత వాసనలు లేకుండా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఇది మంచి సినిమా అయివుండేది.

మన తెలుగువాళ్ళకి చద్దన్నం అంటే ఇష్టం. కానీ దాన్ని సినిమాల్లో కూడా వాడడం వల్ల ప్రేక్షకులు బలైపోతున్నారు.

– జి ఆర్‌. మహర్షి

First Published:  1 Jan 2016 2:12 AM GMT
Next Story