Telugu Global
Others

అవినీతి అధికారుల మనసు గెలిచిన ప్రభుత్వం

అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. పారదర్శకమైన పాలన అందిస్తాం. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాటలు. కానీ ఏపీలో లోలోన జరుగుతున్నది వేరు. అవినీతి అధికారుల మనసును ఎప్పటికప్పడు గెలిచేస్తూనే ఉంది బాబు సర్కార్. గడిచిన 18 నెలల కాలంలో 120 మంది అవినీతి అధికారులను సురక్షితంగా కేసులు నుంచి సంరక్షించింది. అవినీతి, నిధుల మళ్లింపు వంటి తీవ్ర నేరాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 120 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ […]

అవినీతి అధికారుల మనసు గెలిచిన ప్రభుత్వం
X

అవినీతిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. పారదర్శకమైన పాలన అందిస్తాం. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాటలు. కానీ ఏపీలో లోలోన జరుగుతున్నది వేరు. అవినీతి అధికారుల మనసును ఎప్పటికప్పడు గెలిచేస్తూనే ఉంది బాబు సర్కార్. గడిచిన 18 నెలల కాలంలో 120 మంది అవినీతి అధికారులను సురక్షితంగా కేసులు నుంచి సంరక్షించింది. అవినీతి, నిధుల మళ్లింపు వంటి తీవ్ర నేరాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 120 మంది అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. అయితే విజిలెన్స్ అలా సిఫార్సు చేసిన వెంటనే ప్రభుత్వం తన పని మొదలుపెట్టింది. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి… తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఏకంగా జీవోలు విడుదల చేసింది. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే…

ఏపీ గృహనిర్మాణ శాఖలో మంత్రి ప్రైవేట్ సెక్రటరీ ఒకరు 75 లక్షల రూపాయలు గోల్‌మాల్ చేశారు. దీన్ని గుర్తించిన విజిలెన్స్ చర్యలకు సిఫార్సు చేయగా ప్రభుత్వం మాత్రం చర్యలు వద్దంటూ జీవో ఇచ్చేసింది. విజయనగరం జిల్లాలో మరో అధికారి ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇక్కడ కూడా ప్రభుత్వ తీరు మారలేదు. సదరు అవినీతి అధికారిపై చర్యలు వద్దంటూ నవంబర్‌ 11న జీవో విడుదల చేసింది బాబు సర్కార్.

గుంటూరు జిల్లాలో ఎండీవో ఒకరు గ్రామ్ స్వరాజ్‌యోజన కింద నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం చర్యలు వద్దంటూ జీవో జారీ చేసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల అండతో సదరు అధికారి బయటపడినట్టు తెలుస్తోంది. ఇలా చెబుతూపోతే ఇలాంటి అవినీతి జలగల బాగోతాలు 120కి పైగానే ఉన్నాయి. ప్రతి ఉదంతంలోనూ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చర్యలకు సిపార్సు చేయడం ప్రభుత్వం వెంటనే చర్యలు వద్దంటూ జీవో జారీ చేయడం పరిపాటి అయిపోయింది. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ , సాంఘిక సంక్షేమం, విద్యాశాఖల్లో ఇలాంటి సంఘటనలు అధికంగా జరిగాయి. ఈ అంశాన్ని జాతీయ ఆంగ్ల పత్రిక సమగ్రంగా శోధించి కథనాన్ని ప్రచురించింది.

First Published:  3 Jan 2016 4:47 AM GMT
Next Story