ఎంపీలకు కోపం వచ్చింది – కొందరు లోపల, మరికొందరు బయట

రైల్వే శాఖపై ఏపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌లో ఏపీకి సంబంధించిన ప్రతిపాదనలపై ఎంపీలతో రైల్వే జీఎం విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, వైసీపీ ఎంపీలు హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభం కాగానే ఎంపీలు రైల్వే జీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం సమావేశాలు నిర్వహిస్తున్నారే గానీ పనులు మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఉపయోగం లేని సమావేశాలు పదేపదే ఎందుకు నిర్వహిస్తున్నారని నిలదీశారు.

చిన్నచిన్న సమస్యలను కూడా పరిష్కరించకుండా రైల్వే బోర్డు పేరు చెప్పి తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్ల ప్రతిపాదనలు చేసి తీరా చూస్తే రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. పోయిన ఏడాది ప్రతిపాదనకే దిక్కు లేనప్పుడు మరోసారి కొత్తగా ప్రతిపాదనలు ఏమిటని ఎంపీలు ప్రశ్నించారు. దివాకర్‌ రెడ్డితో మరికొందరు టీడీపీ ఎంపీలు కూడా గొంతు కలిపారు. ఇలాంటి పొద్దుపోని సమావేశాలతో ఒరిగేదేమీ లేదంటూ దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్, కేశినేని నానిలు సమావేశాన్ని బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చారు. టీడీపీకే చెందిన మురళీ మోహన్, రాయపాటి సాంబశివరావు, సీతారామలక్ష్మీలు మాత్రం సమావేశంలోనే ఉండిపోయారు. సమస్యలు జీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైల్వే మంత్రి, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తున్నా రైల్వే బోర్డు అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీ తోట నర్సింహం ఆరోపించారు.