Telugu Global
Others

మ‌ర‌ణం వ‌ర్సెస్ కిర‌ణం!

రోగాలు రాకుండా…ఎండే మ‌న‌కు అండ‌! మ‌ర‌ణం, కిర‌ణం….ఈ రెండు ప‌దాలు రైమింగ్‌తో ఒకేలా వినిపిస్తున్నా, రెండూ ప‌ర‌స్ప‌ర‌ విరుద్ధ‌మైన‌వి. చైత‌న్యం, తేజం, ఉత్తేజం, ప్రాణం ఇవ‌న్నీ సూర్య‌కిర‌ణంలో ఉన్నాయి…ఇవ‌న్నీ కోల్పోతే…మ‌ర‌ణం. ఇదంతా మ‌నం అనుకుంటున్న‌ది కాదు, సైన్స్ చెబుతున్న‌దే. శ‌రీరానికి త‌గినంత సూర్య‌ర‌శ్మి అంద‌క‌పోతే ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే శాస్త్రీయంగా రుజువైంది. సూర్య‌ర‌శ్మిలో దాక్కుని ఉన్న మ‌న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవీ- రోగాలను నివారించే ర‌క్ష‌ణ క‌వ‌చం మ‌న ఆహారంలోని క్యాల్షియం, పొటాషియంల‌ను […]

మ‌ర‌ణం వ‌ర్సెస్ కిర‌ణం!
X

రోగాలు రాకుండా…ఎండే మ‌న‌కు అండ‌!
మ‌ర‌ణం, కిర‌ణం….ఈ రెండు ప‌దాలు రైమింగ్‌తో ఒకేలా వినిపిస్తున్నా, రెండూ ప‌ర‌స్ప‌ర‌ విరుద్ధ‌మైన‌వి. చైత‌న్యం, తేజం, ఉత్తేజం, ప్రాణం ఇవ‌న్నీ సూర్య‌కిర‌ణంలో ఉన్నాయి…ఇవ‌న్నీ కోల్పోతే…మ‌ర‌ణం. ఇదంతా మ‌నం అనుకుంటున్న‌ది కాదు, సైన్స్ చెబుతున్న‌దే. శ‌రీరానికి త‌గినంత సూర్య‌ర‌శ్మి అంద‌క‌పోతే ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే శాస్త్రీయంగా రుజువైంది. సూర్య‌ర‌శ్మిలో దాక్కుని ఉన్న మ‌న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవీ-

రోగాలను నివారించే ర‌క్ష‌ణ క‌వ‌చం
మ‌న ఆహారంలోని క్యాల్షియం, పొటాషియంల‌ను శ‌రీరం తీసుకోవాలంటే విట‌మిన్ డి అవ‌స‌రం. ఇది సూర్య‌ర‌శ్మి ద్వారానే శ‌రీరానికి అందుతుంది. అంతేకాదు, విటమిన్ డి కండ‌రాల బ‌ల‌హీన‌త‌ను పోగొడుతుంది. థైరాయిడ్ స‌క్ర‌మంగా ప‌నిచేయాల‌న్నా, గుండె కొట్టుకునే తీరు క్ర‌మ‌బ‌ద్ధంగా ఉండాల‌న్నా విట‌మిన్ డి కావాలి. శ‌రీరానికి నేరుగా త‌గిలే ఎండ ద్వారా మ‌నలో విట‌మిన్ డి త‌యార‌వుతుంది. శ‌రీరం ఎంత‌గా డి విట‌మిన్‌ని వినియోగించుకుంటే అంత‌గా మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. కొన్ని ర‌కాల ఆటోఇమ్యూన్ వ్యాధులు, గుండెకు సంబంధించిన జ‌బ్బులు, తీవ్ర‌మైన వాపులు, కొన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌తో పాటు మ‌ధుమేహాన్ని సైతం సూర్య‌ర‌శ్మి దూరంగా ఉంచ‌గ‌లుగుతుంది.

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది
విట‌మిన్ డి, మ‌న శ‌రీరానికి రోగాలను తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మీద పోరాటం చేసే టి క‌ణాల‌ను ఉత్తేజ‌ప‌రుస్తుంది. అందుకే రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారు త‌గినంత సూర్య‌ర‌శ్మిని పొందాలి.

మూడ్‌ని స‌రిచేస్తుంది
ఈ ప్ర‌పంచంలో ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు సీజ‌నల్ ఎఫెక్టివ్ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. అంటే వాతావ‌ర‌ణంలోని మార్పులు వీరి మ‌న‌సుమీద, భావోద్వేగాల మీద ప్ర‌భావం చూపుతుంటాయి. చ‌లి, వానాకాలాల్లో ఇలాంటి వారు అనాస‌క్తిగా, దేనిప‌ట్లా ఉత్సాహం లేన‌ట్టుగా ఉంటారు. నిరాశానిస్పృహ‌ల‌కు గుర‌వుతుంటారు. ఇలాంటివారికి సూర్య‌ర‌శ్మి మంచి మందు. వీరు కాసేపు ఉద‌య‌పు ఎండ‌లో ఉంటే, ఉల్లాసాన్ని, సంతోషాన్ని క‌లిగించే ఫీల్‌గుడ్ హార్మోన్లు ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతాయి. అంటే స‌న్‌లైట్ యాంటీ డిప్రెష‌న్ మందులా ప‌నిచేస్తుంద‌న్నమాట‌.

క్యాన్స‌ర్లు రాకుండా…
కొలోన్‌, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్స‌ర్ల నివార‌ణ‌లో విటమిన్ డి పాత్ర చాలా ఉంటుంద‌ని ఇప్ప‌టికే చాలా ప‌రిశోధ‌న‌లు రుజువుచేశాయి. స్థూలకాయం, సంతాన‌లేమి, మెనోపాజ్ త‌రువాత ఎదుర‌య్యే స‌మ‌స్య‌లే కాక‌, గుండె వ్యాధులు, మ‌ధుమేహం లాంటి అనారోగ్యాల్లో విట‌మిన్ డి ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తుంది. ఇది లివ‌ర్ ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. శ‌రీరం, వ్య‌ర్థాన్ని బ‌య‌ట‌కు తోయ‌డంలో ఇది తోడ్ప‌డుతుంది క‌నుక జాండీస్‌కి కూడా విట‌మిన్ డి మంచి మందు. స‌రిగ్గా స‌న్‌బాత్ తీసుకుంటే 25 ప్రాణాంత‌క వ్యాధుల‌ను రాకుండా నివారించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

నొప్పిని త‌గ్గిస్తుంది
రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌తో నొప్పుల‌ను భ‌రిస్తున్న‌వారి కి సూర్య‌ర‌శ్మి నిజంగా వ‌రం లాంటిదే. లేత ఎండ శ‌రీరానికి త‌గిలేలా చేస్తే నొప్పి తీవ్ర‌త త‌గ్గుతుంది. సూర్య‌ర‌శ్మిని త‌గినంత పొందుతున్న మ‌హిళ‌లకు ఈ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు చాలావ‌ర‌కు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నొప్పికి స‌హ‌జ ఉప‌శ‌మ‌నం సూర్య‌ర‌శ్మి. ఆప‌రేష‌న్ల అనంత‌రం నొప్పిని త్వ‌ర‌గా త‌గ్గించుకోవాల‌న్నా ఎండ మ‌న‌కు మంచి అండ‌గా నిలుస్తుంది.

నిద్ర‌లేమిని దూరం చేస్తుంది
నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న‌వారికి సైతం సూర్య‌ర‌శ్మి మంచి మందుగా ప‌నిచేస్తుంది. ప‌గ‌లు శ‌రీరానికి ఎండ త‌గిలితే రాత్రులు చ‌క్క‌ని నిద్ర ప‌డుతుంది. మొత్తానికి సూర్యుడు ప్రాణ‌ర‌క్ష‌ణ చేసే క‌వ‌చ కుండ‌లాల‌ను క‌ర్ణుడికే కాదు, మ‌నంద‌రికీ కూడా సూర్య‌ర‌శ్మి రూపంలో ఇచ్చాడు, మ‌న‌మే దాన్ని స‌క్ర‌మంగా వినియోగించుకోవ‌డం లేదు.

First Published:  7 Jan 2016 10:23 PM GMT
Next Story