Telugu Global
Others

అగ్రహారంగా మారిన హైదరాబాద్ యూనివర్సిటీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు గత ఆరవ తేదీన అయిదుగురు దళిత విద్యార్థులను బలవంతంగా వారి హాస్టల్ గదులనుంచి ఖాళీ చేయించారు. వారు ప్రతిఘటిస్తే వారి గదులకు తాళాలు పెట్టి వారిని నిరాశ్రయులను చేశారు. ఇంతకీ ఆ దళిత విద్యార్థుల మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ వారు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష వేయడాన్ని వ్యతిరేకించడం. యాకూబ్ మెమెన్ ను 2015 జులై 30న ఉరి తీశారు. ఈ ఉరిని ఆ దళిత విద్యార్థులు వ్యతిరేకించి […]

అగ్రహారంగా మారిన హైదరాబాద్ యూనివర్సిటీ
X

RV Ramaraoహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు గత ఆరవ తేదీన అయిదుగురు దళిత విద్యార్థులను బలవంతంగా వారి హాస్టల్ గదులనుంచి ఖాళీ చేయించారు. వారు ప్రతిఘటిస్తే వారి గదులకు తాళాలు పెట్టి వారిని నిరాశ్రయులను చేశారు. ఇంతకీ ఆ దళిత విద్యార్థుల మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ వారు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష వేయడాన్ని వ్యతిరేకించడం. యాకూబ్ మెమెన్ ను 2015 జులై 30న ఉరి తీశారు. ఈ ఉరిని ఆ దళిత విద్యార్థులు వ్యతిరేకించి ఉండొచ్చు. హైదరాబాద్ యూనివర్సిటీ అధికారులకు దళిత విద్యార్థులు వ్యక్తం చేసిన అభిప్రాయంపై చర్య తీసుకోవడానికి అయిదు నెలలకన్నా ఎక్కువ సమయం పట్టడం విచిత్రమే. యాకూబ్ మెమెన్ ను ఉరి తీసిన సమయంలో ఆర్.పి.శర్మ హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా ఉన్నారు. ఆయన హయాంలో ఈ విద్యార్థుల మీద చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ప్రొఫెసర్ పొదిలె అప్పా రావు గత సెప్టెంబర్ లో వైస్ చాన్సలర్ గా నియమితులయ్యారు. దీనికి ముందు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ 2015 ఆగస్టులో మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొందరు విద్యార్ధులు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యతీసుకోవాలి అని రాశారు. ప్రస్తుత వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు అయిదుగురు దళిత విద్యార్థులను హాస్టల్ గదుల నుంచి ఖాళీ చేయించాలని నిర్ణయించడం వెనక ఏ శక్తులు పని చేశాయో ఊహించడం కష్టం కాదు.

dalit3ఈ విద్యార్థులు యాకూబ్ మెమెన్ కు ఉరి శిక్ష అమలు చేయడాన్ని వ్యతిరేకించినందువల్లే హాస్టల్ నుంచి బహిష్కరించారని నమ్మడం కష్టమే. ఈ ఉరి శిక్షను వ్యతిరేకించింది ఈ అయిదుగుగురు విద్యార్థులే కాదు. అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఉరి శిక్షలను సమర్థించే వారు ఉన్నట్టే వ్యతిరేకించే వారూ ఉన్నారు, ఉంటారు. ఉరి శిక్షను వ్యతిరేకించడం, సమర్థించడం భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం. వ్యతిరేకించే వారికి సైద్ధాంతిక కారణాలూ మానవతా దృష్టి ఉండొచ్చు. కాని విద్యార్థుల బహిష్కరణ వెనక అంతకు మించిన కారణాలున్నాయి. హిందుత్వ శక్తులు బలం పుంజుకోవడం వీరి బహిష్కరణకు అనుకూలమైన పరిస్థితి కల్పించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో హిందుత్వ అనుకూల వాతావరణం పెరుగుతున్న సూచనలున్నాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హిందుత్వ పరిధిలోకి వెళ్లడానికి ఓ క్రమం ఉంది. ఈ యూనివర్సిటీలో అంబేద్కర్ విద్యార్థి సంఘం బలంగా ఉంది. ఈ విద్యార్థి సంఘం “ముజఫ్ఫర్ నగర్ బాకీ హై” అన్న చిత్రాన్ని ప్రదర్శించాలని నిర్ణయించింది. దీనిని బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) వ్యతిరేకించింది. ఏబీవీపీకి చెందిన ఓ విద్యార్థి అంబేద్కర్ విద్యార్థి సంఘంపై ఫేస్ బుక్ లో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏబీవీపీ విద్యార్థి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. చిత్ర ప్రదర్శన వివాదంపై వైస్ చాన్సలర్ దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అంబేద్కర్ విద్యార్థి సంఘం తప్పేమీ లేదని తేల్చింది. ఈ దశలోనే వైస్ చాన్సలర్ పై స్థానిక బీజేపీ, ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ వర్గాల వారు దళిత విద్యార్థుల మీద చర్య తీసుకోవాలని ఒత్తిడి ప్రారంభించారు. ఈ కారణంగానే వైస్ చాన్సలర్ విద్యార్థుల బహిష్కరణకు నోటీసులు ఇచ్చారు. కాని విద్యార్థుల నుంచి ప్రతిఘటన ఎదురైనందువల్ల బహిష్కరణ నిర్ణయాన్ని కొంత కాలం ఆపారు. బండారు దత్తాత్రేయ రాసిన లేఖ ప్రతిని స్మృతి ఇరానీ యూనివర్సిటీ అధికారులకు పంపించారు. అంబేద్కర్ విద్యార్థి సంఘం “కులతత్వం, ఉగ్రవాదం, జాతి వ్యతిరేక ధోరణులు అనుసరిస్తోంది” అని దత్తాత్రేయ తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ విద్యార్థి సంఘం వారు యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను వ్యతిరేకించడం ద్వారా జాతి వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తున్నారు కనక ఈ పరిస్థితిని మెరుగు పరచాలని దత్తాత్రేయ తన లేఖలో స్మృతి ఇరానీకి సూచించారు.


dalit2కథ అక్కడితో ఆగలేదు. యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను అంబేద్కర్ విద్యార్థి సంఘం వ్యతిరేకించడంపై వైస్ చాన్సలర్ సంజాయిషీ కోరుతూ సంఘ పరివార్ వారు ఒక పిటిషన్ కూడా సమర్పించారు. కేంద్ర మంత్రి అభిప్రాయాలను, ఈ పిటిషన్ ను దృష్టిలో ఉంచుకుని కాబోలు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పొదిలె అప్పా రావు దళిత విద్యార్థులనుంచి సంజాయిషీ కోరకుండా, ఈ గొడవ పూర్వా పరాలు పరిశీలించకుండా అయిదుగురు విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించారు.

ఈ బహిష్కరణ నిర్ణయం అసమ్మతికి తావు లేకుండా చేస్తోంది. యూనివర్సిటీ పరిపాలనా విభాగం అగ్రకులాధిపత్య ధోరణి అనుసరిస్తోందన్న అనుమానానికి తావిస్తోంది. ఎందుకంటే దళిత విద్యార్థులను హాస్టల్ నుంచి బహిష్కరించడమంటే వారిని సామాజిక వెలివేతకు గురిచేయడమే. ఈ బహిష్కరణ ఒక రకమైన కుల వివక్ష ప్రదర్శించడమే. ఈ విద్యార్థులను బహిష్కరించడం వల్ల వారు యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను అమాంతం సమర్థించే అవకాశం ఏమానా ఉందా? ఉరి శిక్షను వ్యతిరేకించడం నేరం ఎలా అవుతుంది. ఒక వేళ నేరమయ్యేటట్టయితే ఎవరికైనా ఉరి శిక్ష విధించడం అమానుషం, అన్యాయం అని వాదించే వారి అభిప్రాయాలను ఈ బహిష్కరణ మార్చే అవకాశం ఏమైనా ఉందా? అధికార పార్టీ అభిప్రాయాలతో అందరూ ఆమోదించి తీరాలన్న నియమమేమీ లేనప్పుడు అభిప్రాయ వ్యక్తీకరణను నివారించడం అసాధ్యం. నివారించడం అప్రజాస్వామికం.

-ఆర్వీ రామారావ్

First Published:  9 Jan 2016 3:31 AM GMT
Next Story