చివరికి మిగిలింది ఖైరతాబాదే !

మొన్నటి వరకు మాజీ మంత్రి దానం నాగేందర్ అంటే గ్రేటర్ కాంగ్రెస్ లో మంచి పట్టున్న నేత. ఆయన కదిలితే వందల మంది నాయకులు, వేల మంది కార్యకర్తలు వెంట తరలివచ్చేవారు. కాంగ్రెస్ మాస్ లీడర్లలో దానం పేరు మొదట ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే ఇటీవల ఆయన టీఆర్ఎస్ లోకి వెల్లబోయి భంగపడ్డారు. దీంతో దానం నాగేందర్ కు సొంతపార్టీలోని నాయకులే చుక్కలు చూపిస్తున్నారు. ఉప్పల్ లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రొటోకాల్ ను విస్మరించి జెండా ఎగురవేశారంటూ దానంపైనే స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఇప్పుడు ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ దానంను పూర్తిస్థాయిలో నమ్మడం లేదని తెలుస్తోంది. దానం ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా… ఎన్నికలు అయిపోయాక టీఆర్ఎస్ లో చేరతాడని హస్తం నేతలు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే దానం నాగేందర్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా.. కేవలం ఖైరతాబాద్ కు మాత్రమే పరిమితం చేసింది. అంతటితో ఆగని పీసీసీ దానంను ఇతర డివిజన్లలో జోక్యం చేసుకోవద్దని కూడా సూచించిందట. 
ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసేదేమీ లేక దానం కూడా సైలెంట్ గా ఉన్నారట. ఖైరతాబాద్ లోనైనా తన సత్తా చాటి భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని దానం చూస్తున్నారట. అయితే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ ను దానం వదులుకున్నారని.. అప్పుడే టీఆర్ఎస్ లో చేరి ఉంటే గ్రేటర్ లో అధికారపార్టీ నుంచి హవా కొనసాగించేవారని కార్యకర్తలు వాపోతున్నారట. మొత్తం మీద గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం పీసీసీ చెప్పిన ప్రకారం కేవలం ఇప్పుడు సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతారా? లేదా గ్రేటర్ మొత్తం తిరుగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.