Telugu Global
Others

వాటికి చెక్‌... చెకప్‌లతోనే !

రెగ్యుల‌ర్‌గా హెల్త్ చెక‌ప్‌లు చేయించుకోండి…అనే డాక్ట‌రు స‌ల‌హాని త‌ర‌చుగా వింటూ ఉంటాం.  అస‌లు మ‌నం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామా లేదా ఏద‌న్నా అనారోగ్య ముప్పుకి చేరువ‌లో ఉన్నామా అనే విష‌యాన్ని తెలియ‌చేసే హెల్త్ చెక‌ప్‌లు ఏంటి…ఎన్నాళ్ల‌కో సారి వాటిని చేయించుకోవాలి…. ఆ వివ‌రాలు మీకోసం- బిపి ప‌రీక్ష‌ అధిక ర‌క్త‌పోటు గుండె జ‌బ్బుల‌ను తెచ్చిపెడుతుంది. అందుకే ఆరునెల‌ల‌కు ఒక‌సారి బిపిని చెక్ చేయించుకోవాలి. మ‌ధుమేహం, హై కొలెస్ట్రాల్‌, గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇంకా త‌ర‌చుగా బిపి ఎంత […]

వాటికి చెక్‌... చెకప్‌లతోనే !
X

రెగ్యుల‌ర్‌గా హెల్త్ చెక‌ప్‌లు చేయించుకోండి…అనే డాక్ట‌రు స‌ల‌హాని త‌ర‌చుగా వింటూ ఉంటాం. అస‌లు మ‌నం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామా లేదా ఏద‌న్నా అనారోగ్య ముప్పుకి చేరువ‌లో ఉన్నామా అనే విష‌యాన్ని తెలియ‌చేసే హెల్త్ చెక‌ప్‌లు ఏంటి…ఎన్నాళ్ల‌కో సారి వాటిని చేయించుకోవాలి…. ఆ వివ‌రాలు మీకోసం-

బిపి ప‌రీక్ష‌
అధిక ర‌క్త‌పోటు గుండె జ‌బ్బుల‌ను తెచ్చిపెడుతుంది. అందుకే ఆరునెల‌ల‌కు ఒక‌సారి బిపిని చెక్ చేయించుకోవాలి. మ‌ధుమేహం, హై కొలెస్ట్రాల్‌, గుండె స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇంకా త‌ర‌చుగా బిపి ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి.

కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌
ఇండియాలో కొలెస్ట్రాల్ పెర‌గ‌టం అనే స‌మస్య చాలా ఎక్కువ‌గా ఉంది. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలి లేక‌పోవ‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య వ‌స్తుంది. ఇది మ‌ధుమేహం, గుండె స‌మ‌స్య‌లు లాంటి అనేక ర‌కాల అనారోగ్యాల‌కు కార‌ణం అవుతుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఇలాంటి అనారోగ్యాల ముప్పుని త‌ప్పించుకోవ‌చ్చు.

బోన్ మిన‌ర‌ల్ డెన్సిటీ టెస్ట్
ఇది ఎముక‌ల ఆరోగ్యాన్ని వెల్ల‌డించే ప‌రీక్ష‌. ఎముక‌ల్లో క్యాల్షియం, ఇత‌ర ఖ‌నిజాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ ప‌రీక్ష‌తో తెలుసుకోవ‌చ్చు. ఇది ఆస్టియోపోరోసిస్ వ్యాధి నిర్దార‌ణ‌కు, ఎముక‌లు విరిగిపోయే ప్ర‌మాదం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌ల్లో ఖ‌నిజాల లోపం ఏర్ప‌డితే వ‌చ్చే అనారోగ్యాల‌ను త‌ప్పించుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ ప‌రీక్ష చేయించుకోవాలి.

బాడీ మాస్ ఇండెక్స్‌
బిఎమ్ఐ స‌రిప‌డా ఉంటే అది మంచి ఆరోగ్యానికి సూచ‌న‌గా చెప్ప‌వ‌చ్చు. ఇది మ‌న శ‌రీరం ఉండాల్సిన బ‌రువుని చెబుతుంది. బిఎమ్ఐ 20-25కి మ‌ధ్య‌లో ఉంటే అది ఆరోగ్య‌క‌రంగా భావించాలి. మ‌ధుమేహం, కీళ్ల నొప్పులు, గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే మ‌న బాడీ మాస్ ఇండెక్స్ స‌రిప‌డా ఉండాలి.

ఇసిజి (ఎల‌క్ట్రోకార్డియోగ్రామ్‌)
గుండె ప‌రంగా ఏవైనా అప‌స‌వ్య‌త‌లు ఉంటే ఈ ప‌రీక్ష‌లో తెలుస్తుంది. 2నుండి 5ఏళ్ల‌కు ఒక‌సారి ఈ ప‌రీక్షని చేయించుకోవ‌డం అవ‌సరం. అయితే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు, త‌మ సాధార‌ణ ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ కాల‌వ్య‌వ‌ధిని డాక్ట‌రు స‌ల‌హాపై నిర్ణ‌యించుకోవాలి.

షుగ‌ర్ టెస్ట్‌
ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిని తెలుసుకునే ఈ ప‌రీక్ష‌తో మ‌ధుమేహం రిస్క్ గురించి తెలుసుకోవ‌చ్చు. సంవ‌త్స‌రానికి ఒక‌టి లేదా రెండుసార్లు ఈ ప‌రీక్ష‌ని చేయించుకోవాలి. అయితే ఇది కూడా వ్య‌క్తి వ‌య‌సు, బ‌రువు, జీవ‌న‌శైలి, సాధార‌ణ ఆరోగ్య ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఎంత త‌ర‌చుగా చేయించుకోవాలి అనేది డాక్ట‌రు స‌ల‌హాపై నిర్ణ‌యించుకోవాలి.

క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు
భార‌త్‌లో క్యాన‌ర్స్‌ వ్యాధి ముప్పు ఎక్కువ‌గా ఉంది. అందుకే త‌ర‌చుగా క్యాన్స‌ర్ స్క్రీనింగ్ చేయించుకోవ‌డం అవ‌స‌రం.

  • 40 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారు కొలెరెక్టాల్ క్యాన్స‌ర్ గురించి తెలియ‌జేసే ప‌రీక్ష‌లు త‌ర‌చుగా చేయించుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న పెద్ద‌పేగు, రెక్ట‌మ్ ప్రాంతాల్లో అసాధార‌ణ పెరుగుద‌లను గుర్తించ‌వ‌చ్చు. ట్యూమ‌ర్లుగా మార‌క‌ముందే వాటిని తొల‌గించే అవ‌కాశం ఉంటుంది.
  • భార‌త మ‌హిళ‌లు బ్రెస్ట్ క్యాన్స‌ర్ ముప్పుని ఎక్కువ‌గా ఎదుర్కొంటున్నారు. దీనిబారిన ప‌డ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ప్ర‌తి రెండేళ్ల‌కు ఒక‌సారి మ‌మ్మోగ్రామ్ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవ‌రికైనా ఈ వ్యాధి ఉంటే మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
  • అలాగే 18-70 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సున్న ప్ర‌తి స్త్రీ రెండేళ్ల‌కు ఒక‌సారి పాప్‌స్మియ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి. దీని వ‌ల‌న స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్‌ని ముందుగా గుర్తించే అవ‌కాశం ఉంటుంది.
First Published:  13 Jan 2016 7:02 PM GMT
Next Story