Telugu Global
Others

హత్యకు ఆత్మహత్య ముసుగు

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మ హత్య చేసుకునేంత బలహీనుడు కాడు. తనను తాను దళిత మార్క్సిస్టుగా నిర్వచించుకున్న వ్యక్తి. సైన్స్ అంటే అతనికి వల్లమాలిన అభిమానం. ప్రకృతి అన్నా నక్షత్రాలన్నా అపారమైన ప్రేమ. కాని విధిలేక చివరకు ఆ ప్రకృతిలోనే లీనమయ్యాడు. ఆ నక్షత్రాల కోవలో కలిసి పోయాడు.  మనుషులు ప్రకృతి నుంచి దూరమయ్యారని తెలియక మనుషులను అభిమానించానని గుండె నిండా వ్యధ నింపుకున్న పరిశోధకుడు. కార్ల్ సగాన్ లాగా గొప్ప రచయితను […]

హత్యకు ఆత్మహత్య ముసుగు
X

RV Ramaraoహైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మ హత్య చేసుకునేంత బలహీనుడు కాడు. తనను తాను దళిత మార్క్సిస్టుగా నిర్వచించుకున్న వ్యక్తి. సైన్స్ అంటే అతనికి వల్లమాలిన అభిమానం. ప్రకృతి అన్నా నక్షత్రాలన్నా అపారమైన ప్రేమ. కాని విధిలేక చివరకు ఆ ప్రకృతిలోనే లీనమయ్యాడు. ఆ నక్షత్రాల కోవలో కలిసి పోయాడు. మనుషులు ప్రకృతి నుంచి దూరమయ్యారని తెలియక మనుషులను అభిమానించానని గుండె నిండా వ్యధ నింపుకున్న పరిశోధకుడు. కార్ల్ సగాన్ లాగా గొప్ప రచయితను కావాలని కలలుగని అగ్రహారంగా మారిపోయిన హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హాస్టల్ నుంచి వెలేస్తే దాదాపు రెండు వారాలు చలిలో చెట్ల కిందే గడిపి చివరకు ఆత్మ హత్య చేసుకున్నాడు. అదీ బహుజనుల ఆత్మగౌరవానికి చిహ్నమైన నీల రంగు గుడ్డతో. అంబేద్కర్ విద్యార్థి సంఘం బానర్తో.

ఇంతకీ రోహిత్ చేసిన మహా పాపం ఏమిటంటే యాకూబ్ మెమన్ ను ఉరి తీయడం తప్పనడమే. ముజఫ్ఫర్ నగర్ బాకీ హై అన్న సినిమాను ప్రదర్శించి సంఘ్ పరివార్ వారికి కంట్లో నలుసుగా మారడమే.

ఇంతకీ వేముల రోహిత్ ప్రాణాలు ఎందుకు తీసుకున్నట్టు?… ఎందుకంటే

  • ప్రస్తుత ప్రభుత్వం ఆదివాసులను, దళితులను, ముస్లింలను బ్రాహ్మణాధిపత్య కొరడాతో ఝళిపించాలనుకుంటున్నందుకు…
  • దళితులను, ఆదివాసులను, ముస్లింలను అసమ్మతివాదులుగా జమ కడ్తున్నందుకు…
  • కీలకమైన సామాజిక, రాజకీయ అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని కట్టడి చేస్తున్నందుకు…
  • దళితులు గొంతు విప్పడం కులతత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా లెక్కగట్టినందుకు…
  • ప్రభుత్వం మీద, యాకూబ్ మెమన్ వంటి వారి విషయంలో న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడానికి సాహసించినందుకు…
  • యూనివర్సిటీలలో వికసిస్తున్న కుసుమాలకు తావు లేకుండా చేసి ఫాసిస్టు విధానాలను అనుసరిస్తున్నందుకు…
  • ఏడు నెలలుగా ఉపకార వేతనం విడుదల చేయనందుకు…
  • ఈ సమస్యలకు సమీప భవిష్యత్తులో పరిష్కారం కనిపించనందుకు…
  • సకల ఆశలు వమ్ము అయినందుకు…

ROHIT 1వేముల రోహిత్ ఆత్మ హత్యకు ఇన్ని కారణాలు కనిపిస్తుండగా దాన్ని ఆత్మహత్యగా పరిగణించడం దుర్మార్గం. హత్యగా పరిగణించకపోవడం యూనివర్సిటీలలో రాజ్యమేలుతున్న ఫాసిస్టు పోకడలను నిలవరించే అవకాశం బొత్తిగా లేకపోవడం వల్లే.

రోహిత్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు, ఆర్ ఎస్ ఎస్ కు, సంఘ పరివార్ వర్గాల వారికి కులతత్వంతో కూడినవిగా, జాతి వ్యతిరేకమైనవిగా కనిపించాయి. యూనివర్సిటీ విద్యార్థులలో వ్యక్తమవుతున్న ఈ అభిప్రాయాలవల్ల ఏర్పడుతున్న పరిస్థితిని “మార్చాలని” కోరుతూ దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ఆమె విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ కు పంపితే తనను నియమించిన ఏలిన వారి మాట కాదంటే ఏం తంటా వస్తుందోనని సంఘ్ పరివార్ కుదురుకు చెందిన వైస్ చాన్స్ లర్ ఆఘ మేఘాల మీద రోహిత్, దొంత ప్రశాంత్, విజయ్ కుమార్, చెముడుగుంట శేషు, సుంకన్న అనే విద్యార్థులను డిసెంబర్ ఆఖరులోనే హాస్టల్ నుంచి బహిష్కరించారు. వారు వెళ్లకుండా భీష్మిస్తే రెండు వారాల కింద వారిని వారుంటున్న గదుల నుంచి బలవంతంగా ఖాళీ చేయించి పెట్టె బేడా బయట పారేస్తే విధిలేక వారు యూనివర్సిటీ ప్రాంగణంలోనే కాలం వెళ్లబుచ్చాల్సి వచ్చింది. ఇదీ మన దేశంలో పరిఢవిల్లుతున్న “సహనశీలత”.

ఈ విద్యార్థులు తమ వాదన వినిపించే అవకాశమైనా వైస్ చాన్స్ లర్ ఇవ్వలేదు.

అది ఆయన వ్యవహార శైలి కావొచ్చు. కాని యాకూబ్ మెమన్ ను ఉరి తీయడానికి ముందు తెల్లవారు ఝామున మూడు గంటలకు సుప్రీం కోర్టు మళ్లీ విచారణ జరిపించిందంటే ఈ అంశానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో గుర్తించేపాటి ఓపిక కూడా వైస్ చాన్స్ లర్ కు లేక పోయింది. యాకూబ్ మెమన్ ను ఉరి తీయడాన్ని వ్యతిరేకించిన వారు తీవ్రవాదాన్ని సమర్థించే వారే కానక్కర లేదు. ఉరి శిక్ష అమలు చేయడం కసి తీర్చుకోవడానికి ఉపకరిస్తుందే తప్ప నేరాలను నిలువరించలేదన్న అభిప్రాయం ఉన్న వారే అన్ని సందర్భాలలోనూ ఉరి శిక్షలను వ్యతిరేకిస్తున్నారు. అరుదాతి అరుదైన సందర్భాలలో మాత్రమే ఉరి శిక్ష అమలు చేయాలని సాక్షాత్తు సుప్రీం కోర్టే చెప్పడం ఉరి శిక్ష లోని నిష్ప్రయోజకత్వాన్ని, శిక్షగా దానికున్న పరిమితిని గుర్తించినందువల్లే.

ROHIT 2నిజానికి హస్టల్ నుంచి వెళ్లి పొమ్మని ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత రోహిత్ వైస్ చాన్స్‌లర్‌కు రాసిన లేఖలో యూనివర్సిటీ పరిపాలనా విభాగం కావాలంటే తన ప్రాణాలైనా తీసుకోవడానికి సిద్ధమేనని తెలియజేశాడు. విద్యార్థుల “క్రమశిక్షణ”కు ప్రాధాన్యం ఇచ్చే ఆ వైస్ చాన్స్ లర్ కు రోహిత్ అన్నంత పని చేసే ప్రమాదం ఉందని తట్టకపోవడం కౄరాతి కౄరం.

రోహిత్ ప్రాతినిధ్యం వహించే అంబేద్కర్ విద్యార్థి సంఘం దళితులు, అణగారిన ముస్లిం వర్గాలను ఐక్యం చేయడానికి ప్రయత్నించింది. కొత్త సమీకరణలకు శ్రీకారం చుట్టాలనుకుంది. ఇది జాతి వ్యతిరేకమని ముద్ర వేయడానికి ఆస్కారం ఎక్కడుందో అలా వేసే వారికి ఆ అధికారం ఎవరిచ్చారో తెలియదు.

ఏమైతేనేమి రోహిత్ దళిత వర్గానికి చెందిన తనను తన మిత్రులను సామాజికంగా వెలి వేయడాన్ని సహించలేక పోయాడు. మథన పడ్డాడు. ఆత్మ బలిదానంతో సమాజంలో పెరిగిపోతున్న అసమానతలను, అసహనాన్ని, ఫాసిస్టు పోకడలను మరో సారి సమాజం దృష్టికి తీసుకొచ్చాడు. రోహిత్ వంటి వారు పూర్తి చేయలేక పోయిన ఎజెండాను పూర్తి చేయాల్సిన బాధ్యత సక్రమంగా ఆలోచిస్తున్నామనుకునే వారిదే.

-ఆర్వీ రామారావ్

First Published:  18 Jan 2016 7:20 AM GMT
Next Story