జైలు అంటే జగన్‌కు అంత చిన్నచూపా?

కరిచేందుకు కోరలు లేకపోయినా దగ్గరకొస్తే కరిచేస్తా.. అన్నట్టు బుసగొట్టి బిల్డప్ ఇమ్మన్నారు పెద్దలు. అలా చేయకుంటే ప్రతి ఒక్కరూ తోక తొక్కాలని చూస్తారు. కానీ ఏపీలో వైసీపీకి కోరలనే అధికారం లేకపోయినా కనీసం ప్రతిపక్ష హోదాలో బుస కొట్టడం కూడా లేదు. వరుసపెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తుంటే జగన్‌ మాత్రం ఎక్కడా స్పందించడం లేదు.  పత్రికా ప్రకటన వదిలి సరిపెట్టుకుంటున్నారు. ఒక ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలను రెండు రోజుల వ్యవధిలోనే అరెస్ట్ చేసినా జగన్ స్పందించకపోవడం ఆశ్చర్యమే. మాట్లాడేందుకు మాకూ ఉన్నారు అధికార ప్రతినిధులన్నట్టు అంబటి, వాసిరెడ్డి పద్మ లాంటి వారితో ప్రెస్‌మీట్‌ పెట్టడం మినహా పార్టీ అధ్యక్షుడిగా జగన్‌ మాత్రం మాట్లాడడం లేదు.

ఏదో ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తే ఓకే అనుకోవచ్చు. కానీ వరుసపెట్టి అరెస్ట్‌లు జరుగుతున్నాయి…సొంతపత్రిక కూడా ఇదేమీ రాజ్యం అంటూ గర్జిస్తోంది. జగన్‌ మాత్రం బజ్జున్నారు. సాక్షి మాట్లాడితే తాను మాట్లాడినట్టే అనుకుంటున్నారు కాబోలు జగన్. లేకుంటే ఎంపీ, ఎమ్మెల్యేలు జైలుకెళ్లడం చాలా చిన్న విషయం అనుకుంటున్నారేమో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులకు ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిపై మరింత ఎక్కువ ఉంటుంది. ఫోన్‌ చేసి సదరు నేతలకు ధైర్యం చెప్పాడేమో కానీ ఆ విషయం బయటకు కూడా తెలియాలి. అప్పుడు కేడర్‌కు కూడా నాయకత్వంపై నమ్మకం ఉంటుంది. అలా కాకుండా ఎవరి ”జోలి” వాడిదే అన్నట్టు వదిలేయడం కొత్త రాజకీయ సిద్ధాంతమే కావచ్చు. చివరకు రైతుల పక్షాన పోరాడిన ఎమ్మెల్యే గోపిరెడ్డి అరెస్టయ్యారు.

ఎప్పుడో సమైక్యాంధ్ర ఉద్యమ కేసులు ఇప్పుడు బయటకు తీసి చెవిరెడ్డిని లోపలేశారు. కానీ అధినేత నుంచి స్పందన లేదు.  నిజానికి  సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో  కొన్ని వేల మంది మీద కేసులు నమోదయ్యాయి. కానీ వారెవరూ అరెస్ట్ కాలేదు. ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి మాత్రమే అరెస్ట్ కావాల్సి వచ్చింది. బహుశా వైసీపీ ఎమ్మెల్యే కావడమే చెవిరెడ్డి చేసుకున్న పాపం కాబోలు. లేకుంటే జగన్‌లాంటి ప్రతిపక్ష నాయకుడిని చూసుకుని ప్రభుత్వానికి కలిగిన ధైర్యం కావచ్చు.  సమైక్యాంధ్ర కోసం పోరాడిన వ్యక్తిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తే కనీసం ఆ విషయాన్ని ప్రజల్లోకి  తీసుకెళ్లి  మద్దతు పొందాలన్న ఆలోచన కూడా వైసీపీకి రాకపోవడం ఆ పార్టీ ఖర్మ. 

Click on Image to Read:

kavuri-sambasivarao

lokesh

ramcharan-chiru