Telugu Global
Others

బుద్ధి చెప్పే మంత్రి నోట ఎన్ని అబద్ధాలో!

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ తనకున్న డిగ్రీల గురించే కాదు తాన మంత్రిత్వ శాఖ నిర్వహించే విధుల విషయంలో కూడా బెరుకు లేకుండా, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడగలరు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వేముల రోహిత్ వ్యవహారంలో తన మంత్రిత్వ శాఖ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదని స్మృతి ఇరానీ ఓ జాతీయ టీవీ ఛానల్ లో నిర్భయంగా చెప్పిన మాట పచ్చి బూటకమని తేలిపోయింది. బీఫ్ జనతా పార్టీ ఫేస్ బుక్ […]

బుద్ధి చెప్పే మంత్రి నోట ఎన్ని అబద్ధాలో!
X

RV Ramaraoకేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ తనకున్న డిగ్రీల గురించే కాదు తాన మంత్రిత్వ శాఖ నిర్వహించే విధుల విషయంలో కూడా బెరుకు లేకుండా, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడగలరు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వేముల రోహిత్ వ్యవహారంలో తన మంత్రిత్వ శాఖ ఏ మాత్రం జోక్యం చేసుకోలేదని స్మృతి ఇరానీ ఓ జాతీయ టీవీ ఛానల్ లో నిర్భయంగా చెప్పిన మాట పచ్చి బూటకమని తేలిపోయింది.

బీఫ్ జనతా పార్టీ ఫేస్ బుక్ లో కేంద్ర మానవ వనరుల శాఖ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కు, వై చాన్స్ లర్ కు ఆరు వారాల వ్యవధిలో రాసిన లేఖల ప్రతులన్నింటినీ ఉంచింది.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏబీవీపి విభాగం ఉపాధ్యక్షుడు నందం దివాకర్, రోహిత్ ప్రాతినిధ్యం వహించే అంబేద్కర్ విద్యార్థి సంఘం (ఏఎసే) అనుసరిస్తున్న “అభ్యంతరకరమైన” “జాతి వ్యతిరేక” విధానాలను ఏకరువు పెడుతూ 2015 ఆగస్టు 10న కేంద్ర కార్మిక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయకు సుధీర్ఘమైన లేఖ రాశారు.

దివాకర్ ఈ లేఖ దిల్లీ నుంచి రాశారు. ఆయన ఇచ్చిన చిరునామా మాత్రం ఇక్కడిదే. ఈ లేఖ ఆధారంగానే బండారు దత్తాత్రేయ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 2015 ఆగస్టు 17న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖాస్త్రం సంధించారు. అందులో హైదరాబాద్ విశ్వవిద్యాలయం “జాతి వ్యతిరేక”, “కులతత్వ”, “తీవ్రవాద” కార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని సూచించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఇంత జరుగుతున్నా విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగం మౌన ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చాలి” అన్నారు. రోహిత్ ఆత్మ హత్యతో పరిస్థితి మారినట్టేగా!

స్మృతి ఇరానీ నాయకత్వంలోని మంత్రిత్వ శాఖ ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా దత్తాత్రేయ లేఖలో ప్రస్తావించిన అంశాలను గుర్తు చేస్తూ మొదట యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు, ఆ తర్వాత వైస్ చాన్స్ లర్ కు లేఖలు సంధించింది. ఇందులో మొదటి లేఖ ఆ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రెటరీ రామ్ జీ పాండే 2015 సెప్టెంబర్ 3న రాశారు. దత్తాత్రేయ లేఖలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి వాస్తవాలు తెలియజేస్తే ఆ విషయం సదరు మంత్రికి నివేదిస్తామని విన్నవించుకున్నారు.

అయినా యూనివర్సిటీ రిజిస్ట్రార్ చలించినట్టు లేరు. ఆ తర్వాత 2015 సెప్టెంబర్ 24న కేంద్ర మానవ వనరుల శాఖ డిప్యూటీ సెక్రెటరీ సుబోధ్ కుమార్ గిల్దియాల్ రిజిస్ట్రార్ కు మళ్లీ అండర్ సెక్రెటరీ రాసిన లేఖ విషయం గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. అండర్ సెక్రెటరీ లేఖలో “విషయం” కింద దత్తాత్రేయ లేఖలో ప్రస్తావించిన అంశాలు మాత్రమే చేరిస్తే డిప్యూటీ సెక్రెటరీ రాసిన లేఖలో పేర్కొన్న “విషయం” లో నేరుగా హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయంలో జరుగుతున్న “జాతి వ్యతిరేక కార్యకలాపాలు”, ఏబీవీపి నాయకుడు నందనం సుశీల్ కుమార్ మీద దాడిని నేరుగా ప్రస్తావించారు. దత్తాత్రేయ లేఖ గురించి రిజిస్ట్రార్ కు గుర్తు చేశారు. అయినా రిజిస్ట్రార్ లో చలనం కనిపించినట్టు లేదు.

అదే డిప్యూటీ సెక్రెటరీ 2015 అక్టోబర్ 6న వైస్ చాన్స్ లర్ కు ఈ విషయమై లేఖ రాశారు. ఈ వ్యవహారాన్ని స్వయంగా పరిశీలించాలని వైస్ చాన్స్ లర్ పొదిలె అప్పా రావును కోరారు.

ఆ తర్వాత 2015 అక్టోబర్ 20న డిప్యూటీ సెక్రెటరీ వైస్ చాన్స్ లర్ కు మరో లేఖ రాశారు. చివరగా 2015 నవంబర్ 19న అండర్ సెక్రెటరీ వైస్ చాన్స్ లర్ కు మునుపటి లేఖల విషయం గుర్తు చేస్తూ మళ్లీ లేఖ రాశారు.

ఇన్ని లేఖలు అందుకున్న విశ్వవిద్యాలయల అధిపతులు ఇక తాత్సారం చేయడం “అవిధేయత” గా భావించి డిసెంబర్ ఆఖరులో రోహిత్ తో సహా మరో నలుగురు దళిత విద్యార్థులను హాస్టళ్ల నుంచి బయటకు తోసేశారు. గత 18వ తేదీన రోహిత్ ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు.

నిజం నిప్పులాంటిదంటారు. ఆ నిప్పే రహస్యంగా రోహిత్ మృత దేహాన్ని దహనం చేసేసింది. ఆ చితి మంటల సెగ ఇప్పటికైనా అగ్రహారాల నిర్వాహకులకు, సంఘ్ పరివార్ వారికీ తగిలేనా!

-ఆర్వీ రామారావ్

1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (9)

First Published:  20 Jan 2016 6:55 AM GMT
Next Story