Telugu Global
Cinema & Entertainment

తెర‌వెనుక కెమిస్ట్రీలు..!

తెర‌వెనుకా కెమిస్ట్రీలు…బాలివుడ్‌లో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు! ప్రేమ, పెళ్లి, క‌లిసుండ‌టం లేదా విడిపోవ‌డం…సాధార‌ణంగా ఇదొక క్ర‌మం. కానీ బాలివుడ్‌లో అలా ఉండ‌దు. చాలా వ‌ర‌కు  ప్రేమ‌, స‌హ‌జీవ‌నం, త‌రువాత పెళ్లి లేదా విడిపోవ‌డం…ఇలా ఉంటుంది. వ‌రుస‌. స‌హ‌జీవ‌నం త‌రువాత పెళ్లి, బ్రేక‌ప్ అనే రెండు ఆప్ష‌న్లు వారిముందు ఉంటున్నాయి. తాజాగా క‌త్రినాకైఫ్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌ల బ్రేక‌ప్ బాలివుడ్‌లో ఒక చిన్న‌పాటి కుదుపుకి కార‌ణ‌మైంది. బాలివుడ్ తార‌ల‌తో పాటు ఆ ఇద్ద‌రి అభిమానులు సైతం ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌త్రినా […]

తెర‌వెనుక కెమిస్ట్రీలు..!
X

తెర‌వెనుకా కెమిస్ట్రీలు…బాలివుడ్‌లో ప్రేమ‌లు, బ్రేక‌ప్‌లు!

ప్రేమ, పెళ్లి, క‌లిసుండ‌టం లేదా విడిపోవ‌డం…సాధార‌ణంగా ఇదొక క్ర‌మం. కానీ బాలివుడ్‌లో అలా ఉండ‌దు. చాలా వ‌ర‌కు ప్రేమ‌, స‌హ‌జీవ‌నం, త‌రువాత పెళ్లి లేదా విడిపోవ‌డం…ఇలా ఉంటుంది. వ‌రుస‌. స‌హ‌జీవ‌నం త‌రువాత పెళ్లి, బ్రేక‌ప్ అనే రెండు ఆప్ష‌న్లు వారిముందు ఉంటున్నాయి. తాజాగా క‌త్రినాకైఫ్‌, ర‌ణ‌బీర్ క‌పూర్‌ల బ్రేక‌ప్ బాలివుడ్‌లో ఒక చిన్న‌పాటి కుదుపుకి కార‌ణ‌మైంది. బాలివుడ్ తార‌ల‌తో పాటు ఆ ఇద్ద‌రి అభిమానులు సైతం ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. క‌త్రినా తీసుకున్న నిర్ణ‌యం వెనుక, ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న మాజీ ప్రేయ‌సి దీపిక‌కు తిరిగి ద‌గ్గ‌ర‌వుతున్నాడ‌న్న ఆనుమానం ప్ర‌ధాన‌మైన‌ద‌నే మాట‌లు విన‌బ‌డుతున్నాయి. ఆ అభ‌ద్ర‌తా భావ‌మే క‌త్రినా, ర‌ణ‌బీర్ బంధం నుండి బ‌య‌ట‌కు న‌డ‌వ‌డానికి కార‌ణ‌మైంద‌నేది బాలివుడ్ నుండి వినిపిస్తున్న క‌థ‌నం. క‌త్రినా మాట‌లు కూడా అందుకు నిద‌ర్శ‌నంలా ఉన్నాయి. నాతో బ‌తుకుతున్న వారు నాకు న‌చ్చిన‌ట్టుగానే ఉండాల‌ని నేను అనుకోలేను. ఎవ‌రి ఛాయిస్ లు వారికుంటాయి. నేను వారితో ఆనందంగా ఉండ‌లేక‌పోవ‌చ్చు. కానీ కాల‌నుగుణంగా వ‌చ్చే మార్పులు, ప‌రిణితితో తిరిగి వారి అభిప్రాయాల్లో మార్పు రావ‌చ్చు…. అంటూ క‌త్రినా వ్యాఖ్యానించింది. దీపిక ఈ మాట‌ల‌కు స‌మాధానం చెబుతూ మ‌నుషుల మాట‌ల్లో పెడార్థాలు, గూఢార్థాలూ తాను వెత‌క‌బోన‌ని చెప్పి త‌ప్పించుకుంది.

క‌త్రినా, క‌పూర్ల కుటుంబానికి చాలా స‌న్నిహితంగా ఉన్న సంద‌ర్భాల‌ను కూడా మీడియా చాలా సార్లు వెల్ల‌డించింది. కానీ ఇప్పుడు ఈ ప్ర‌హ‌స‌నంపై స్పందించాల్సిందిగా విలేక‌ర్లు ర‌ణ‌బీర్ తండ్రి రిషీ క‌పూర్‌ని కోరితే ఆయ‌న ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ర‌ణ‌బీర్, క‌త్రినాతో క‌లిసి ఉన్న ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసి విల్స‌న్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఇది అత‌ని త‌ల్లిదండ్రుల ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉంది.

ఒక ప‌క్క దీపిక ర‌ణ‌వీర్ సింగ్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి ఉండి, అత‌ని త‌ల్లిదండ్రుల‌తో కూడా ద‌గ్గ‌ర‌గా ఉంటున్న స‌మ‌యంలో క‌త్రినా, ర‌ణ‌బీర్ క‌పూర్లు ఆమె కార‌ణంగా విడిపోవ‌డం నిజ‌మైతే అది కాస్త విచిత్ర‌మే. నిజానికి ఇలాంటి సంక‌ట ప‌రిస్థితులు ర‌ణ‌వీర్ సింగ్‌కీ ఎదుర‌య్యాయి. దీపిక తెర‌పై త‌న‌తో హాట్‌గా, ర‌ణ‌బీర్‌తో క్యూట్‌గా ఉంటుంద‌ని చెప్పి అత‌ను త‌న మ‌న‌సులో ఎలాంటి అనుమానాలూ లేవ‌ని బాహాటంగానే ప్ర‌క‌టించాడు.

బాలివుడ్‌లోనే ఎందుకిలా…
బాలివుడ్ క‌ల్చ‌ర్‌, అక్క‌డి వారు పెరిగిన వాతావ‌ర‌ణం, స‌హ‌జంగానే ప్రాంతీయ భాషా చిత్రాలు బాలివుడ్ ధోర‌ణుల‌ను అనుక‌రిస్తుంటే వారి ఆలోచ‌న‌లు హాలివుడ్ పోక‌డ‌ల్లో ఉండ‌టం, హిందీ సినిమాల్లో ఉండే మోతాదు మించిన రొమాన్స్ …ఇవ‌న్నీ ఆయా తార‌ల నిజ‌జీవితాల్లోనూ కెమిస్ట్రీకి కార‌ణం కావ‌చ్చు. అయితే మ‌నిషి జీవించే ప‌రిస్థితుల్లో ఎంత‌టి భిన్న‌త్వం ఉన్నా ఈర్ష్యా అసూయ‌లు, కోప‌తాపాలు, ప్రేమాభిమానాలు లాంటి ప్రాథ‌మిక భావోద్వేగాల్లో మార్పు ఉండ‌ద‌ని ఇలాంటి బ్రేక‌ప్‌లు రుజువు చేస్తుంటాయి.

బాలివుడ్ తార‌ల్లో క‌నిపించినంత‌గా ప్రేమ‌గాథ‌లు, స‌హ‌జీవ‌నాలు, బ్రేక‌ప్‌లు మ‌న ప్రాంతీయ‌భాషా చిత్ర‌రంగాల్లో క‌నిపించ‌వు. ద‌క్షిణాదిలో హీరోయిన్లు ఎక్కువ‌శాతం బాలివుడ్ నుండి వ‌చ్చినా హీరోలంతా ఆయా ప్రాంతీయ భాష‌ల సాంప్ర‌దాయ కుటుంబాల‌కు చెందిన‌వారు కావ‌డ‌మే అందుకు కార‌ణం కావ‌చ్చు. ఇక్క‌డి సినిమాల్లో రొమాంటిక్ స‌న్నివేశాలు అక్క‌డితో పోలిస్తే త‌క్కువే. వాటి చిత్రీక‌ర‌ణ‌లోనూ తేడా ఉంటుంది. బాలివుడ్ చిత్రాల్లోలా ఒక రొమాంటిక్ సీన్‌ని కొన్ని నిముషాల పాటు క్యారీ చేయ‌డం ఇక్క‌డ చాలా అరుదు. అంత‌స‌మ‌యం అలాంటి స‌న్నివేశాల్లో మ‌న హీరోలు అంత స్టేబుల్‌గా ఉండ‌టం కూడా క‌ష్ట‌మే. బాల‌చంద‌ర్‌, మ‌ణిర‌త్నం, గౌత‌మ్ మీన‌న్ లాంటి వారి చిత్రాల్లో అప్పుడ‌ప్పుడు ఇవి క‌న‌బ‌డ‌తాయి. అందుకే ఎప్పుడ‌న్నా ఏం మాయ చేశావే… లాంటి సినిమా ఒక్క‌టి త‌గిలితే దాన్ని గురించి అరిగిపోయిన రికార్డులా మాట్లాడుతూనే ఉంటాం. ఇంకా చెప్పాలంటే అందుకే మ‌న ద‌గ్గ‌ర ఇంకా త‌ల్లి, తండ్రి, అన్న, అక్క, అత్త ఇలా కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌ భావోద్వేగాలు తెర‌మీద‌కు ఎక్కుతున్నాయి కానీ…ఒక అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య ఉన్న ఎమోష‌న్లు మాత్రం తెర‌కు ఎక్క‌డం లేదు. ఇదంతా క‌ల్చ‌ర్‌లో ఉన్న తేడానే. ఒక‌ర‌కంగా ఇది మంచి విష‌య‌మే. క‌ళ పేరుతో పూర్తి వ్య‌క్తిగ‌త‌మైన భావోద్వేగాల‌ను తెర‌మీద‌కు తేవ‌డం, తెల‌సీ తెలియ‌ని వ‌య‌సులో ఉన్న‌వారిని వాటికి ట్యూన్ అయ్యేలా చేయ‌డం కంటే అలాంటివి చిత్రీక‌రించ‌క‌పోవ‌డ‌మే మేలు.

కొన్నాళ్ల‌పాటు మ‌నవి కాని భావాల‌ను మ‌నం న‌టిస్తూ ఉంటే కాల‌క్ర‌మంలో అవి మ‌న నిజ వ్య‌క్తిత్వంగా మారిపోతాయి అనేది ఒక సైకాల‌జీ సూత్రం. సినిమాలు చూసేవారిమీద ప్ర‌భావం చూపుతాయా….అనేది ఎవ‌ర్‌గ్రీన్ టాపిక్‌…కానీ దానికంటే ముందు సినిమాలు చేసేవారి మీదే ఎక్కువ ప్ర‌భావం చూపుతాయ‌ని బాలివుడ్ నిజ‌జీవిత ప్రేమ‌క‌థ‌లు చెబుతున్నాయి.

– వ‌డ్ల‌మూడి దుర్గాంబ‌

First Published:  21 Jan 2016 2:04 AM GMT
Next Story