Telugu Global
Others

టీడీపీ మౌన ముద్ర వెనుక..!

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా దేశంలోని అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, జగన్‌ వంటివారు స్వయంగా క్యాంపస్‌కు వెళ్లి వచ్చారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఆత్మహత్య జరిగిన 24 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నుంచి సంతాప ప్రకటన మాత్రమే వచ్చింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

టీడీపీ మౌన ముద్ర వెనుక..!
X

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా దేశంలోని అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి, జగన్‌ వంటివారు స్వయంగా క్యాంపస్‌కు వెళ్లి వచ్చారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. ఆత్మహత్య జరిగిన 24 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నుంచి సంతాప ప్రకటన మాత్రమే వచ్చింది.

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు. అయితే ఘటనకు బాధ్యులని ఆరోపణలు ఎదుర్కొంటున్న దత్తాత్రేయ, వీసీ అప్పారావుల పేర్లు మాత్రం టీడీపీ ప్రకటనలో లేవు. అందరూ ఖండిస్తున్నారు కాబట్టి మనమూ ఖండిస్తే ఓ పనైపోతుందన్నట్టుగానే టీడీపీ తీరు ఉంది. అయితే అందరూ టీడీపీ వైపు అనుమానంగా చూడడం మొదలుపెట్టడడంతో ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో కొందరు టీడీపీ నేతలు రోహిత్ ఇంటికి వెళ్లారు. 5 లక్షల పరిహారం ప్రకటించారు. కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. అంతకు మించి టీడీపీ నుంచి రోహిత్ మరణంపై టీడీపీ నేతలెవరూ స్పందించడం లేదు.

క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం కూడా తెలపలేదు. అసెంబ్లీలో రోజా, అనిత మధ్య వివాదం జరిగితే దళితులను వైసీపీ అవమానిస్తోందంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు అదే ఒక దళిత విద్యార్థి చనిపోతే మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై టీడీపీ సీనియర్ నేతలు కొన్ని విషయాలు చెబుతున్నారు. యూనివర్శిటీకి టీడీపీ నేతలు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. కేంద్రంలో బీజేపీతో తాము కలిసి ఉన్నందున క్యాంపస్‌కు వెళ్తే విద్యార్థులు భౌతిక దాడులకు దిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గతంలో టీడీపీ నేతలపై ఓయూలో జరిగిన దాడులను గుర్తు చేస్తున్నారు. అక్కడికి వెళ్తే తప్పనిసరిగా బండారు దత్తాత్రేయకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుందని అలా చేస్తే బీజేపీతో వైరం పెంచుకున్నట్టు అవుతుందని అంటున్నారు. రోహిత్ చనిపోవడం బాధాకరమేనని అయితే ప్రస్తుత పరిస్థితిలో టీడీపీ నుంచి తామేమీ చేయలేమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పైగా చంద్రబాబుకు దత్తాత్రేయపై సానుకూల వైఖరి ఉందంటున్నారు. అదన్న మాట రోహిత్ మరణంపై టీడీపీ మౌన ముద్ర వెనుక రహస్యం.

First Published:  21 Jan 2016 2:09 AM GMT
Next Story