బాబు ఇంటి గేటుకు చట్టాన్ని కట్టేశారు!

చంద్రబాబు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కానిదంటూ ఏమీ లేదనిపిస్తోంది. నో రూల్స్ ఓన్లీ ఆర్డర్స్ అన్నట్టుగా సాగుతోంది. తాజాగా చంద్రబాబు ఇంటి కోసం చట్టానికి కాసేపు కాళ్లు చేతులు కట్టేసేందుకు రంగం సిద్ధమైంది. అసలు సంగతేంటంటే…. రాష్ట్ర విభజన ఉద్యమం నడుస్తున్న సమయంలో అదే అదనుగా కొందరు బడాబాబులు కృష్ణా నది వరద కట్టపై భారీ భవంతులు కట్టేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అక్రమకట్టడాలపై హడావుడి చేశారు. కూల్చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పీకలేకపోయారు.

అక్రమ నిర్మాణాలపై వివాదం నడుస్తుండగానే గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద కృష్ణానది వరద కట్టపై ఎకరం 25 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన ఒక బంగ్లాను చంద్రబాబు స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎయిర్‌కోస్తా విమాన సంస్థ అధినేత లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించారు. అదే అక్రమ నిర్మాణాన్ని ప్రస్తుతం చంద్రబాబు అధికార నివాసంగా వాడుతున్నారు. అక్రమ కట్టడాన్ని సీఎం అధికారనివాసంగా మార్చుకోవడంపై పెద్దెత్తున విమర్శలు వచ్చాయి. అయినా బాబు లెక్కచేయలేదు.

వరదకట్టపై అక్రమనిర్మాణాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నదికి 200 మీటర్ల పరిధిలోనే వరదకట్టపై నిర్మాణాలు చేపట్టడంపై మండిపడింది. వెంటనే వాటిని కూల్చివేయాలని ఆదేశించింది. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేస్తే చంద్రబాబు అధికార నివాసాన్ని కూల్చివేయాల్సి ఉంటుంది. అందుకే ఏకంగా చట్టాన్నే మార్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 200 మీటర్ల వరదకట్ట నిబంధనను చంద్రబాబు నివాసానికి మినహాయిస్తున్నారు. చంద్రబాబు నివాసానికి ఇబ్బంది లేకుండా మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని కోసం వరదకట్ట నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నామని మంత్రి నారాయణ కూడా స్వయంగా ప్రకటించారు. అయితే ఈ మార్పులు చేస్తున్నది రాజధాని కోసం కాదు చంద్రబాబు కోసమని తేలింది. చంద్రబాబు నివాసం కోసమే ఈ మార్పులు చేస్తున్నారా అని ప్రశ్నిస్తే నారాయణ మాత్రం సమాధానం దాటవేశారు. అది చంద్రబాబుకున్న పవర్.