Telugu Global
Others

ఇలా చేస్తే... మొదటికే మోసం..!

నడుస్తూ, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడ‌టం, మీటింగ్‌లో ఉండి మెయిల్స్ చెక్ చేసుకోవ‌డం, వంట‌చేస్తూ ఫోన్‌లో చాట్ చేయ‌డం…ఇలా ఒకే స‌మ‌యంలో రెండుమూడు ప‌నులు మ‌న‌లో చాలామంది చేస్తుంటారు. ఇక ఉద‌యం పూట మ‌హిళ‌ల‌ను చూస్తే వారికి నిజంగా ప‌దిచేతులు ఉన్నాయేమో అనే భ్ర‌మ క‌లుగుతుంది. ఒకేసారి మూడునాలుగు ప‌నుల‌మీద దృష్టి పెట్టి ఉరుకులు ప‌రుగులు పెడుతుంటారు. నిజానికి ఈ మ‌ల్టీ టాస్కింగ్‌ని గురించి మ‌నం కాస్త గొప్ప‌గా చెప్పుకుంటాం కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు […]

ఇలా చేస్తే... మొదటికే మోసం..!
X

నడుస్తూ, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడ‌టం, మీటింగ్‌లో ఉండి మెయిల్స్ చెక్ చేసుకోవ‌డం, వంట‌చేస్తూ ఫోన్‌లో చాట్ చేయ‌డం…ఇలా ఒకే స‌మ‌యంలో రెండుమూడు ప‌నులు మ‌న‌లో చాలామంది చేస్తుంటారు. ఇక ఉద‌యం పూట మ‌హిళ‌ల‌ను చూస్తే వారికి నిజంగా ప‌దిచేతులు ఉన్నాయేమో అనే భ్ర‌మ క‌లుగుతుంది. ఒకేసారి మూడునాలుగు ప‌నుల‌మీద దృష్టి పెట్టి ఉరుకులు ప‌రుగులు పెడుతుంటారు. నిజానికి ఈ మ‌ల్టీ టాస్కింగ్‌ని గురించి మ‌నం కాస్త గొప్ప‌గా చెప్పుకుంటాం కానీ, ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్య నిపుణులు. ఇలాంటి డ‌బుల్‌రోల్స్‌, త్రిబుల్‌రోల్స్‌ని నిరంత‌రం చేస్తే ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఆ వివ‌రాల్లోకి వెళితే-

  • మీరు రెండుమూడు ప‌నుల‌ను ఒకేసారి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ నిజానికి అది, ఒక ప‌నినుండి మ‌రొక ప‌నికి మార‌డం అవుతుంద‌ని ఎమోష‌న‌ల్ ఫ‌స్ట్ ఎయిడ్ అనే పుస్త‌కాన్ని రాసిన గే వించ్ అనే మాన‌సిక నిపుణుడు చెబుతున్నారు. మ‌నం ఒక ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టిన‌పుడు మ‌న ఏకాగ్ర‌త పూర్తిగా దానిమీదే ఉంటుంద‌ని, దాని నుండి మారి మ‌రొక ప‌నిలోకి మార‌డం వ‌ల‌న చేస్తున్న ప‌నిలో ఉత్పాద‌క‌త త‌గ్గుతుంద‌ని, ప‌నుల నుండి మార‌డానికి మ‌న‌శ‌క్తిని వృథాగా వినియోగించాల్సి ఉంటుంద‌ని వించ్ అంటున్నారు.
  • రెండు ప‌నులు ఒకేసారి చేయ‌డం వ‌ల‌న త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని అనుకుంటారు గానీ, అది నిజం కాద‌ని, ఇలా చేయ‌డం వ‌ల‌న ఇంకా ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని అధ్య‌నాల ద్వారా నిపుణులు తేల్చారు. రెండు ప‌నులు చేయ‌డానికి రెండుర‌కాల మైండ్ సెట్‌లు ఉండాల‌ని, ఒక మాన‌సిక స్థిర‌త్వంలో ఎంతోకొంత స‌మ‌యం లేన‌పుడు ఏ ప‌నీ త్వ‌ర‌గా కాద‌ని వారు చెబుతున్నారు.
  • రెండుప‌నుల్లోకి మారుతుంటే మ‌న‌లోని 40శాతం ఉత్పాద‌క శ‌క్తి అన‌స‌రంగా వృథా అవుతుంద‌ట‌. రెండుకి మించి ప‌నుల‌ను ముఖ్యంగా ఆలోచించి చేయాల్సిన‌వాటిని ఒకేసారి చేస్తే అన్నింట్లో త‌ప్పులు దొర్లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. 2010లో జ‌రిగిన ఒక ఫ్రెంచ్ స్ట‌డీలో మ‌నిషి మెద‌డు ఒకేసారి రెండు ప‌నుల‌ను మాత్రం కాస్త స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌ద‌ని, అంత‌కుమించి చేస్తే మాత్రం మెద‌డులోని ముందుభాగం ఫ్రంట‌ల్ కార్ట‌క్స్ మీద ప్ర‌భావం ప‌డి త‌ప్పులు ఎక్కువ‌గా దొర్లే అవ‌కాశం ఉంటుంద‌ని తేలింది.
  • కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీవారు చేసిన ప‌రిశోధ‌న‌లో మ‌ల్టీ టాస్కింగ్ మ‌నుషుల్లో ఒత్తిడిని బాగా పెంచుతుంద‌ని తేలింది. అంతేకాదు, ఒక్కోసారి ఇది ఆత్మ‌విశ్వాసాన్ని త‌గ్గించి, డిప్రెష‌న్‌కి కూడా దారితీస్తుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. టివిలో క్రికెట్ చూస్తూ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అయిన విద్యార్థి స‌రిగ్గా చ‌ద‌వక‌, ప‌రీక్ష బాగా రాయ‌లేక‌పోతే, త‌ప్పుచేసిన భావ‌న‌తో మాన‌సికంగా కుంగిపోతాడ‌ని నిపుణులు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు.
  • రెండుప‌నులు ఒకేసారి చేసేవారు క‌ళ్ల‌ముందున్న చాలా ముఖ్య‌మైన విష‌యాల‌ను కూడా గుర్తించ‌లేని ప‌రిస్థితుల్లో ఉంటార‌ని ప‌శ్చిమ వాషింగ్ట‌న్ యూనివ‌ర్శిటీలో 2009లో నిర్వ‌హించిన ఒక ప‌రిశోధ‌న‌లో తేలింది. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన విద్యార్థుల్లో 75శాతం మంది త‌మ ప‌క్క‌న ఎవ‌రున్నారు, ఏం జ‌రిగింది అనే విష‌యాల‌ను గుర్తించ‌లేక‌పోయారు. రెండుప‌నులు చేస్తున్న‌పుడు మ‌న క‌ళ్లు చూస్తున్నట్టే ఉన్నా మెద‌డు వ‌ర‌కు అవి చేర‌వ‌ని, దీన్ని ఏకాగ్ర‌తా లోపం వ‌ల‌న త‌లెత్తిన అంధ‌త్వంగా భావించ‌వ‌చ్చ‌ని ఈ ప‌రిశోధ‌నా నిర్వాహ‌కులు చెబుతున్నారు.
  • రెండుప‌నుల‌ను ఒకేసారి చేసిన‌పుడు జ్ఞాప‌క‌శ‌క్తి మంద‌గిస్తుంద‌ని కూడా అధ్య‌య‌నంలో తేలింది. ఎంపిక చేసిన కొంత‌మంది చేత ఒక స‌న్నివేశాన్ని చ‌దివించి మ‌రొక దృశ్యాన్ని వారికి చూపించిన‌పుడు, వారిలో చాలామంది చ‌దివిన దాంట్లో ఉన్న వివ‌రాలు గుర్తుంచుకున్నారు కానీ, త‌రువాత చూసిన బొమ్మ‌లోని వివ‌రాల‌ను గుర్తుపెట్టుకోలేక పోయారు.
  • మ‌ల్టీ టాస్కింగ్ మ‌నుషుల మ‌ధ్య అనుబంధాల‌ను కూల‌దోస్తుంద‌ని మ‌రొక అధ్య‌య‌నంలో తేలింది. భార్యాభ‌ర్త‌లు లేదా ఇత‌ర అనుబంధాల్లో ఉన్న‌వారు ముఖాముఖి మాట్లాడుకుంటున్న‌పుడు మ‌ధ్య‌లో ఇత‌రుల‌తో ఫోన్‌లో మాట్లాడ‌టం, మెసెజ్ చేయ‌డం లాంటివి చేస్తే తప్ప‌నిస‌రిగా ఆ అనుబంధంలోని గాఢ‌త‌, న‌మ్మ‌కం త‌గ్గిపోతాయ‌ని దీనిపై అధ్య‌య‌నం నిర్వ‌హించిన వారు చెబుతున్నారు.
  • టివి చూస్తూ, ఆహారం తీసుకుంటూ, మాట్లాడుతూ …ఇలా మూడునాలుగు ప‌నుల్లో ఉంటే ఆహారం ఎక్కువ‌గా తీసుకోవ‌డం జ‌రుగుతుంది.
  • మ‌రొక అధ్య‌య‌నంలో ప్ర‌తిరోజూ డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్లో మాట్లాడుతూ తాము గొప్ప మ‌ల్టీ టాస్క‌ర్ల‌మ‌ని చెప్పుకుంటున్న‌వారికంటే, అప్పుడ‌ప్పుడు అలాచేసే వారు స‌మ‌ర్ధ‌వంతంగా రెండుప‌నులూ నిర్వ‌ర్తించారు. దీన్నిబ‌ట్టి మెద‌డుని ఉప‌యోగించి చేయాల్సిన ప‌నుల‌ను, మ‌ల్టీ టాస్కింగ్‌గా ఎన్ని రోజులు చేసినా అందులో నైపుణ్యం పెర‌గ‌ద‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది.
  • మ‌ల్టీ టాస్క‌ర్లలో రానురాను సృజనాత్మ‌క‌త‌, స‌మ‌య‌స్ఫూర్తి త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని కూడా కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో రుజువైంది. క‌నుక మ‌ల్టీ టాస్కింగ్ అనేది ప్ర‌కృతి సిద్ధ‌మైన మ‌న స్వ‌భావానికి విరుద్ధ‌మ‌ని గుర్తించి తీరాలి.
First Published:  23 Jan 2016 8:21 AM GMT
Next Story