విస్కీ బాటిల్…  హంత‌కుల‌ను ప‌ట్టించింది!

ఒక వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసిన కేసులో భివాండీ పోలీసులు చాలా తెలివిగా ఆలోచించి, ఇద్ద‌రు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. అయితే వారికి ఆ నిందితుల‌ను  క‌నుగొన‌డంలో స‌హాయం చేసింది ఓ విస్కీబాటిల్‌. దాని మీద ఉన్న బ్యాచ్ నెంబ‌ర్ ఆధారంగా పోలీసులు ఈ కేసుని ఛేదించారు. వివ‌రాల్లోకి వెళితే-

గ‌త‌నెల‌లో ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌యిన‌ట్టుగా భివాండీ పోలీసుల దృష్టికి వ‌చ్చింది.  హ‌త్య‌కు గుర‌యిన వ్య‌క్తి శ‌రీరం త‌ప్ప పోలీసుల‌కు మ‌రే క్లూ ల‌భించ‌లేదు. అయితే అత‌నితోపాటు ఒక విస్కీ బాటిల్ ఉంది. మెడ‌లో ఒక లాకెట్‌ ఉంది.

విస్కీ బాటిల్ మీద ఉన్న‌బ్యాచ్ నెంబ‌ర్‌ని బ‌ట్టి పోలీసులు భివాండీలోని మోనికా హోట‌ల్‌కి వెళ్లారు. అక్క‌డి సిసిటివి ఫుటేజిని ప‌రిశీలించారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా హోట‌ల్ ఫుటేజిలో,  హ‌త్య‌కు గుర‌యిన వ్య‌క్తి వేసుకున్న ష‌ర్టు, బూట్లు లాంటివే ఓ వ్య‌క్తి ధ‌రించి ఉన్న‌ట్టుగా గుర్తించారు. అత‌ను మ‌రొక ఇద్ద‌రితో క‌లిసి డ్రింక్ తాగ‌టం సిసిటివి ఫుటేజిలో ఉంది.

లాకెట్‌మీద ఉన్న శ్రీ విశ్వేశ్వ‌రి గ్రూపు వార‌ణాసిలో ఉంద‌ని తెలుసుకుని మృతుని ఫొటోలను తీసి అక్క‌డి మీడియాలో వ‌చ్చేలా చేశారు. ఆ వివ‌రాలు చూసి మృతుడి త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను క‌లిశారు. మృతుడి పేరు ర‌జ‌నీష్ అలియాస్ రాహుల్ శివ చ‌ర‌ణ్ సింగ్‌గా పోలీసులకు అర్థ‌మైంది.  అత‌ని వివ‌రాల‌ను బ‌ట్టి,  నిందితుల ఆచూకీని పోలీసులు తెలుసుకోగ‌లిగారు.  సిసిటివి ఫుటేజిలో మృతుడితో ఉన్న‌ది అల‌హాబాద్‌కి చెందిన అనుజ్‌కుమార్ పాండే, అంకిత్ చంద్ర‌శేఖ‌ర్ పాండేగా గుర్తించారు. పోలీసులు వ‌లేసి వీరిద్ద‌రినీ ప‌ట్టుకున్నారు. అస‌లు విష‌యం ఏమిటంటే మృతుడు ర‌జనీష్, అనుజ్ కుమార్ పాండే సోద‌రిని ప్రేమించాడు. ఇది ఆ అమ్మాయి కుటుంబానికి న‌చ్చ‌లేదు. దాంతో నిందితులు ఇద్దరూ మంచి మాట‌లతో అత‌డితో క‌లిసి స‌ర‌దాగా హోట‌ల్‌కి వెళ్లారు. త‌రువాత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి మ‌రింత‌గా తాగించి త‌రువాత అతడిని హ‌త్య‌చేశారు. త‌మ‌ను ప‌ట్టుకోవ‌డానికి ఎలాంటి రుజువులు లేవ‌ని వారనుకున్నారు కానీ తాము తాగిన విస్కీబాటిలే త‌మ‌ని ప‌ట్టించేస్తుంద‌ని వారు ఊహించ‌లేదు.