మోదీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

మెజారిటీప‌రంగా శ‌క్తివంతమైన ప్ర‌ధానిగా భావిస్తున్న మోదీకి ప‌ద‌వీభ‌యం ప‌ట్టుకుందా?. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కుట్ర‌సాగుతోందా?. స్వ‌యంగా ప్ర‌ధానే అవున‌ని అంటున్నారు. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కొన్ని శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాని స్థాయిలో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారెవ‌రో కూడా ఆయ‌న వెల్ల‌డించారు. ఎన్జీవోలు, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారే కుట్ర‌లు పన్నుతున్నార‌ని ఆరోపించారు. ఆదివారం ఒడిశాలోని బార్‌గ‌ఢ్‌లో జ‌రిగిన రైతు స‌భ‌లో ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నేమ‌న్నారంటే…

”ఒక ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యారన్న వాస్తవాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ప్రధానిని ప‌ద‌వి నుంచి దించడానికి నిరంతరం కుట్రలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు… నాపై వివిధ రూపాల్లో దాడి చేస్తూనే ఉన్నారు. కొంతమంది అదేపనిపై ఉన్నారు. మునుపటి మాదిరిగా రసాయన కర్మాగారాలకు యూరియా తరలిపోకుండా వేపపూత వేయిస్తున్నాం. ఇలాంటి చర్యవల్ల ఇంతకాలం దోచుకుంటున్న కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీల‌కు మోదీపై కోపం రాకుండా ఉంటుందా? మోదీకి వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే వారు సాయపడకుండా ఉంటారా? ప్రధానికి వ్యతిరేకంగా వారు కేకలు వేయకుండా ఉంటారా?” అని వ్యాఖ్యానించారు.

విదేశీ విరాళాలు సేకరిస్తున్న ఎన్జీవోలను లెక్కలు సమర్పించాలని అడిగితే.. వారంతా కలిసి ఒక్కటై తనపై కక్ష గట్టారని మోదీ ఆరోపించారు. కానీ వాటిని తాను భ‌య‌ప‌డ‌న‌ని … ధైర్యంగా ఎదుర్కోంటాన‌న్నారు. ప్ర‌జ‌లు అప్ప‌గించిన బాధ్య‌త నుంచి త‌ప్పుకోబోన‌న్నారు. ఎంతో గంభీరంగా కనిపించే ప్రధాని బేలగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూసి పౌరులు ఆశ్చర్యపోతున్నారు.