Telugu Global
Others

ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌?

(యువ జర్నలిస్టు విశ్వదీపక్ తన “జీ న్యూస్” ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమాన్యానికి రాసిన ఉత్తరమిది. మీడియా సంస్థలు ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఎలా అమ్ముడు పోయాయో, జర్నలిజం ఎంతగా దిగజారిపోయిందో వివరిస్తూ రాసిన రాజీనామా లేఖ ఇది. అనేకమంది నిజాయితీపరులైన జర్నలిస్టుల అంతరంగ దర్పణం ఈ ఉత్తరం. ) ప్రియమైన జీ న్యూస్‌, సంవత్సరం పైగా పని చేసిన తర్వాత మీ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేనీ పని ఇదివరకే చేయాల్సింది. ఇప్పటికైనా చేయకపోతే […]

ఇంత పతనం ఎందుకు జీ న్యూస్‌?
X

145617892818(యువ జర్నలిస్టు విశ్వదీపక్ తన “జీ న్యూస్” ఉద్యోగానికి రాజీనామా చేస్తూ యాజమాన్యానికి రాసిన ఉత్తరమిది. మీడియా సంస్థలు ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు ఎలా అమ్ముడు పోయాయో, జర్నలిజం ఎంతగా దిగజారిపోయిందో వివరిస్తూ రాసిన రాజీనామా లేఖ ఇది. అనేకమంది నిజాయితీపరులైన జర్నలిస్టుల అంతరంగ దర్పణం ఈ ఉత్తరం. )

ప్రియమైన జీ న్యూస్‌,

సంవత్సరం పైగా పని చేసిన తర్వాత మీ నుండి విడిపోవాల్సిన సమయం వచ్చేసింది. నేనీ పని ఇదివరకే చేయాల్సింది. ఇప్పటికైనా చేయకపోతే నన్ను నేను ఎన్నటికీ క్షమించుకోలేను. ఇప్పుడు నేను రాయబోతున్నది ఆవేశం, కోపం లేదా ఉక్రోశం ఫలితంగా ఏ మాత్రం కాదు. బాగా ఆలోచించి చేస్తున్న ప్రకటన ఇది. నేనొక పాత్రికేయుడినే కాకుండా, ప్రస్తుతం జాతీయ దురహంకారం అనే విషం ఎగజిమ్ముతున్న ఈ దేశంలో ఒక పౌరుణ్ని కూడా. పౌరుడిగా నా బాధ్యతలు, నా వృత్తి ధర్మం ఈ విషం ఇంకా వ్యాపించకుండా ఆడ్డుకోవాలని నాకు చెబుతున్నాయి. ఇది చిన్న పడవతో సముద్రాన్ని దాటెయ్యడం లాంటి ప్రయత్నమే అయినా ప్రారం భించాలనుకుంటున్నాను. అందుకే నేను జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ పేరిట మొదలైన జాతీయ దురహంకారం, దాన్ని ఎగదోయ డంలో మన సంస్థ పాత్రను వ్యతిరేకిస్తూ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను.

నిజానికి ఇది వృత్తిపరమైన బాధ్యతకు సంబంధించినది. సామాజిక బాధ్యత గ్రహింపునకు సంబంధించినది. ఇది దేశభక్తికి సంబంధించినది కూడా. ఈ మూడు ప్రమాణాల్లోనూ గత సంవత్సర కాలంగా మీతో కలిసి పని చేస్తున్న కాలంలో నేను ఒక పాత్రికేయుడిగా విఫలమయ్యాను.

2014 మే తర్వాత నుంచి, అంటే నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి, దాదాపు దేశంలోని ప్రతి న్యూస్‌ రూం మతతత్వ ప్రభావానికి లోనైంది. కానీ మన దగ్గరి పరిస్థితి మాత్రం మరింత భయంకరమైంది. ఇక్కడ ప్రతి వార్తను మోడీ కోణంలోనే, మోడీ ప్రభుత్వ అజెండాకు ఎంత ఊపు లభిస్తుందనే అంచనాతోనే రాయిస్తున్నారు.

అసలు మనం పాత్రికేయులమేనా అనే అనుమానం నాలో మొదలైంది. మనం ప్రభుత్వ ప్రతినిధుల లాగా లేదా ‘సుపారీ హంతకుల’ లాగా అనిపించసాగింది… ఒక పాత్రికేయుడిగా ఇంత ‘మోడీ భక్తి’ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా అంతరాత్మ నాపై తిరుగుబాటు చేయసాగింది.. ప్రతి వార్త వెనుక ఒక అజెండా. ప్రతి న్యూస్‌ షో వెనుక మోడీ ప్రభుత్వాన్ని గొప్పగా కీర్తించే ప్రయత్నం. ప్రతి చర్చ వెనుక మోడీ వ్యతిరేకులను ‘కాల్చి పడేసే’ ప్రయత్నం. ఇదంతా ఏమిటసలు?

అసలు మమ్మల్ని ఇంత దీనంగా, హీనంగా, అనైతికంగా, పతనశీలంగా ఎందుకు తయారు చేశారు? దేశంలోని అత్యున్నత మీడియా సంస్థలో చదువుకొని, ఆజ్‌ తక్‌, బీబీసీ, డాయిచే వెలే జర్మనీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పని చేసిన తర్వాత నేను ఆర్జించిన వృత్తిపరమైన గుర్తింపు ‘ఛీ’ న్యూస్‌ జర్నలిస్టు అనే ఛీదరింపే. మన నిజాయితీ బజారు పాలైంది. ఇందుకు ఎవరిది బాధ్యత?

ఎన్నని చెప్పాలి? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎడతెగని ప్రచారం ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎందుకు? కరెంటు, నీళ్లు, చదువు, సరి-బేసి వంటి ప్రజలకు ఉపయోగపడే మౌలిక విధానాలను సైతం దుమ్మెత్తి పోశాం. కేజ్రీవాల్‌తో విభేదించేం దుకు, విమర్శించేందుకు పూర్తి హక్కుంది. కానీ కేజ్రీవాల్‌ ‘సుపారీ హత్య’ హక్కు మాత్రం ఒక పాత్రికేయుడిగా ఎవరికీ ఉండదు. కేజ్రీవాల్‌పై చేసిన నెగెటివ్‌ స్టోరీల జాబితా తయారు చేస్తే పేజీలు నిండిపోతాయి. అసలు జర్నలిజం మౌలిక సిద్ధాంతమైన ‘తటస్థత’, పాఠకుల/వీక్షకుల పట్ల నిజాయితీ మనకు వర్తిస్తాయా, వర్తించవా?

దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల విషయంలోనూ ఇలాగే జరిగింది. మొదట్లో మనం దళిత స్కాలర్‌ అని రాశాం. ఆ తర్వాత దళిత విద్యార్థి అని రాయ సాగాం. సరే, కనీసం వార్తలైనా సరిగా రాయాలి కదా! రోహిత్‌ను ఆత్మహత్యకు పురికొల్పడం వెనుక ఏబీవీపీ, బీజేపీ మంత్రి బండారు దత్తాత్రేయల పాత్రలు స్పష్టంగా ముందుకొచ్చాయి. కానీ ఒక మీడి యా సంస్థగా మనం విషయాన్ని పలుచన చేసేలా, కారకులను కాపాడేలా వ్యవహరించాం.
అసహనం అంశంపై ఉదరు ప్రకాశ్‌తో మొదలై దేశంలోని అన్ని భాషలకు చెందిన ప్రఖ్యాత రచయితలు అకాడమీ పురస్కా రాలు వెనక్కి ఇచ్చెయ్యసాగారు. కానీ మనం మాత్రం వారినే ప్రశ్నించే వైఖరిని చేపట్టాం. కేవలం ఉదరు ప్రకాశ్‌నే తీసుకున్నా ఆయన సాహిత్యం లక్షల మంది చదువుతారు. మనం మాట్లాడే భాష, మనకు ఉపాధి మార్గంగా ఉన్న భాష (హిందీ)లో గౌరవప్రదమైన స్థానం ఆయనది. ఆయన రచనల్లో మన జీవితం, మన స్వప్నాలు, పోరాటాలు ప్రతిబింబిస్తాయి. కానీ మనం ఇవన్నీ ప్రాయోజితమై నవని రుజువు చేయడంలో నిమగమయ్యాం. అప్పుడు కూడా బాధ కలిగింది. కానీ భరించాను. కానీ ఎప్పటి దాకా భరించాలి? ఎందుకు భరించాలి?

నాకు అశాంతితో నిద్ర పట్టడం లేదు.. తప్పు చేశానన్న భావన నన్ను దహించివేయసాగింది. ఒక వ్యక్తి జీవితంలో అన్నింటికన్నా పెద్ద కళంకం దేశద్రోహం. కానీ పాత్రికేయులుగా మనకు ఎవరిపైనైనా దేశద్రోహి అనే ముద్రవేసే హక్కుందా? దీన్ని నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు కదా! కన్నయ్య సహా పలువురు విద్యార్థులను మనం ప్రజల దృష్టిలో ‘దేశద్రోహులు’గా నిలబెట్టాం. రేపు వీరిలో ఎవరైనా హత్యకు గురైతే బాధ్యత ఎవరిదవుతుంది? అల్లర్లు, అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితుల్ని మనం సృష్టించాం. ఇది ఏ రకమైన దేశభక్తి? ఏ రకమైన జర్నలిజం? మనం బీజేపీ/ఆర్‌ఎస్‌ఎస్‌ గొంతుకలమా? వాళ్లేది చెబితే అదే చేస్తామా? ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అనే నినాదమే లేని వీడియోను పదే పదే చూపించి మనం ఉన్మాదాన్ని వ్యాపింపజేశాం. చీకట్లో వినిపిస్తున్న గొంతుకలను మనం కన్నయ్య, ఆయన సహచరులవేనని ఎలా గుర్తించాం? కేవలం దురభిప్రాయాల కారణంగా ‘భారతీరు కోర్ట్‌ జిందాబాద్‌’ అన్న నినాదాన్ని ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’గా మార్చేసి ప్రచారం చేశాం. ప్రభుత్వం కనుసన్నల్లో పని చేస్తూ విద్యార్థుల కెరియర్‌ను, వారి ఆశలను, కుటుంబాలను వినాశనం వైపు నెట్టేశాం…

ఉమర్‌ ఖాలిద్‌ చెల్లెను రేప్‌ చేస్తామని, ఆమెపై యాసిడ్‌ దాడి చేస్తామని కొంత మంది బెదిరిస్తు న్నారు. ఆమెను దేశద్రోహి చెల్లెలు అని అంటున్నారు. కాస్త ఆలోచించండి. నిజంగానే అలాంటిదేమైనా జరిగితే ఇందుకు బాధ్యత మనది కాదా? తాను దేశ వ్యతిరేక నినాదాలను సమర్థించనని కన్నయ్య ఒకసారి కాదు, వెయ్యి సార్లన్నాడు. అయినా మనం ఆయన మాటను వినం. ఎందుకంటే మనం వ్యాపింపజేసిన ఉన్మాదం ఎన్‌డీయే ప్రభుత్వానికి అనుగుణమైంది. మనం అసలు కన్నయ్య ఇంటినైనా జాగ్రత్తగా చూశామా? అది ఇల్లు కాదు, దేశంలోని రైతుల, సామాన్యుల దుస్థితికి ప్రతీక! దేశంలో అనుక్షణం భూస్థాపితమవుతున్న ఆకాంక్షల స్మశానం అది. కానీ మనం గుడ్డివాళ్లమైపోయాం! భారతీయ గ్రామీణ జీవన యదార్థ చిత్రం ఇదే. ఆ కూలిపోయిన గోడలలో, చిక్కి శల్యమైన జీవితాల్లో మనం జాతీయవాదం అనే ఇంజ ెక్షన్‌ ఇచ్చాం. తుది ఫలితం ఏమవుతుందనే ఆలోచనే లేకుండానే. పక్షవాతంతో బాధపడుతున్న కన్నయ్య తండ్రి ఈ వేదన మూలంగా చనిపోతే దానికి బాధ్యు లెవరు? ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’లో స్టోరీ వచ్చే దాకా, అసలు కన్నయ్యకు పీడితుల పక్షంలో మాట్లా డేందుకు ప్రేరణ ఏమిటనేది దేశానికి తెలియనే లేదు.

రామా నాగా, తదితరులది కూడా ఇదే పరిస్థితి. చాలా బలహీనమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ యువతీయువకులు జేఎన్‌యూలో సబ్సి డీతో ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నారు. ముందుకు వెళ్లగలిగే ధైర్యాన్ని పొందుతున్నారు. కాని టీఆర్‌పీ అనే బజారు వాంఛ, అమ్ముడుపోయిన మన వివేకం వీరి కెరియర్‌లను దాదాపు నాశనం చేసేశాయి. మనం వీరి రాజకీయాలతో ఏకీభవించకపోవచ్చు. వీరి భావాల్లో అతివాదం ఉండొచ్చు. కానీ వీళ్లు దేశద్రోహులెట్లా అవుతారు? ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో జీ న్యూస్‌ను రిఫరెన్స్‌గా పేర్కొనడం కేవలం యాదృచ్ఛికమని అనగలరా? మనం ఢిల్లీ పోలీసులతో కుమ్మక్కయ్యామని అంటున్న వారికి ఏం జవాబు చెప్పాలో చెప్పండి.

అసలు జేఎన్‌యూతో గానీ, జేఎన్‌యూ విద్యార్థులతో గానీ మనకున్న వైరమేమిటి? నా అభిప్రాయంలో ఆధునిక జీవన విలువలకు, ప్రజాస్వామ్యానికి, వైవిధ్యానికి, పరస్పర విరుద్ధ భావాల సహ అస్తిత్వానికి దేశంలో ఉన్న అత్యంత సుందరమైన నందనవనం జేఎన్‌యూనే. కానీ దీన్నిప్పుడు చట్టవ్యతిరేక, దేశద్రోహ కార్యకలాపాలకు కేంద్రంగా వక్రీకరిస్తున్నారు.

అసలు చట్టాన్ని ఉల్లంఘించింది జేఎన్‌యూనా లేక కోర్టులోకి చొరబడి లెఫ్ట్‌ కార్యకర్తను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేనా? కింద పడ్డ సీపీఐ కార్యకర్త అమీక్‌ జమైను ఎమ్మెల్యే, అతని అనుచరులు బూట్లతో తొక్కు తుంటే పక్కనే ఉన్న పోలీసులు చూస్తూ ఉండి పోయారు. కొడుతున్న దృశ్యాలు తెరపై కనబడు తుంటే మనం మాత్రం ‘ఒ.పి. శర్మపై కొట్టారన్న ఆరో పణలు’ అని రాశాం. ‘ఆరోపణ’ ఎందుకు అని నేనడి గితే, పై నుంచి వచ్చిన ‘ఆదేశం’ అని మీరు చెప్పారు. కానీ మనం ఇంత కిందకు ఎలా దిగజారాం? మోడీ వరకైనా అర్థం చేసుకోవచ్చు కానీ స్టోరీ రాసేటప్పుడు ఒ.పి. శర్మ వంటి బీజేపీ నేతల, ఏబీవీపీ కార్యకర్తలను కూడా కాపాడడం ఏమిటి?

నాకు నా ఉనికిపై, వృత్తిపై అసహ్యం వేయసాగింది. ఇందుకేనా నేను మిగతా పనులన్నీ వదిలి పాత్రికేయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకుంది? బహుశా కాదు. ఇప్పుడు నా ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి జర్నలిజాన్ని వదిలెయ్యడం లేదా ఈ పరిస్థితులను నాకు దూరంగా నెట్టెయ్యడం. నేను రెండో మార్గం చేపడు తున్నాను. నేనేమీ తీర్పు చెప్పడం లేదు. నా వృత్తి, గుర్తింపులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు మాత్రమే లేవనెత్తాను. చిన్నదే అయినా నాకూ బాధ్యత ఉంది ఇందులో. నాకిప్పుడు వేరే చోట్లలో ఉద్యోగం లభించదని స్పష్టంగా తెలుసు. నేను ఇందులోనే కొనసాగితే రెండేండ్లలో లక్ష రూపాయల వేతన స్థాయికి చేరుకోగలుగుతాను. కానీ ఈ సౌలభ్యం నా నుంచి చాలా త్యాగాలు కోరుతోంది. నేను వాటికి సిద్ధంగా లేను. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, వేతనం లేకపోతే పడే కష్టాలేమిటో తెలుసు. అయినా నేను నా అంతరాత్మ ప్రబోధాన్ని అణచిపెట్ట దల్చుకోలేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏ ఫిర్యాదూ లేదని నేను మరోసారి చెబుతున్నాను. సంస్థాగతమైన, సంపాదకీయమైన వ్యవహారాలకు సంబంధిం చినది గానే దీనిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక మీడియా సంస్థకు తన మితవాద వైఖరులను, అభిరుచులను ప్రకటించే, ప్రశంసించే హక్కుంటే, వ్యక్తిగా మా లాంటి వాళ్లకు మా రాజకీయ వైఖరిని స్పష్టం చేసేందుకు పూర్తి హక్కుంది.

– విశ్వదీపక్‌
(నవతెలంగాణ సౌజన్యంతో)

Click on image to read:

chandrababu-naidu

chiru

jagan-press-meet in delhi

jagan-bhuma1

cbn

kcr-chandrababu-naidu

cbn ysrcp mlas

Gyan-Dev-Ahuja

jagan-cbn

ycp-leaders-join-to-tdp

jagan-ntv

rama-subba-reddy

basavaraju-saraiah

bhuma-nagi-reddy-life

bhuma-regin

Guvvala-Balaraju

chandrababu-skin-problems

jagan

chandrababu-naidu

nara-lokesh-naidu

First Published:  22 Feb 2016 1:03 PM GMT
Next Story