“జేఎన్‌యూ తలవంచదు”

(జేఎన్‌యూ వివాదంలో కొన్నిరోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిన ఉమర్‌ ఖాలిద్‌ అతని అనుచరులతో పాటు సోమవారం తెల్లవారు జామున జేఎన్‌యూ విద్యార్థుల ముందు ప్రత్యక్షమై ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇది ఆ ప్రసంగం పూర్తి పాఠం.)

మిత్రులారా! నా పేరు ఉమర్‌ ఖాలిద్‌ నిజమే కానీ నేను టెర్రిరిస్టును కాను. మొట్టమొదటగా, ఈ ఉద్యమంలో దృఢంగా నిలబడ్డ విద్యార్థులకు, అధ్యాపకులకు నా అభినందనలు. ఈ పోరాటం కేవలం ఐదారుగురు వ్యక్తుల కోసం సాగుతున్నది కాదనేది మనకు తెలుసు. ఇది మనందరి పోరాటం. ఇది ఈ విశ్వవిద్యాలయం పోరాటం. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటి పోరాటం. ఇది మన సమాజ మార్పునకు సంబంధించిన పోరాటం.

గత పది రోజుల్లో నా గురించి నాకే తెలియని చాలా విషయాలు తెలిశాయి. నేను రెండు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లొచ్చానట! నా దగ్గర పాస్‌పోర్టే లేదు కానీ రెండు సార్లు వెళ్లానట! ఈ ఆరోపణ బెడిసికొట్టడంతో మరొకటి పుట్టించారు. నేను ‘మాస్టర్‌ మైండ్‌’నట! జేఎన్‌యూ విద్యార్థులందరికీ అద్భుతమైన ‘మైండ్‌’ ఉంటుందనేది నిజమే కానీ ఈ మొత్తం కార్యక్రమానికి పథకం రచించిన ‘మాస్టర్‌ మైండ్‌’గా నన్ను చిత్రించారు! అంతేకాదు, నేను ఈ ప్రోగ్రాంను 17-18 విశ్వవిద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్‌ చేసినట్టుగా కూడా చెప్పారు. నా ప్రభావం ఇంత విస్తృతంగా ఉందని నాకే తెలియదు! నేను గత 2-3 నెలలుగా ఆ సమావేశం కోసం పథకం రూపొందించానని వారు చెప్పారు. ఇది కూడా కౌంటర్‌ కావడంతో, నేను గత కొద్ది రోజులలో 800 ఫోన్‌కాల్స్‌ చేశానని అన్నారు.. ఏ సాక్ష్యం అవసరం లేదు మీడియాకు! ‘ఎలెజెడ్లీ’ (కథనం) అని చెప్పాల్సిన అవసరం కూడా లేదిప్పుడు! ఎక్కడెక్కడికి కాల్స్‌ చేశానట? గల్ఫ్‌కు చేశానట! కాశ్మీర్‌కు చేశానట! మరి సాక్ష్యం తీసుకురావచ్చుగా! ఫోన్‌ చేసినంత మాత్రాన నేరం కాదనేది మొదటి విషయం. ఒకవేళ చేసినా దానికి సాక్ష్యాలైతే ఉండాలి కదా! వీళ్లకు ఇంతలా అబద్ధాలాడేందుకు సిగ్గుగా కూడా అనిపించడం లేదు. జరిగినదంతా ‘మీడియా ట్రయలే’. మన నేరాల చిట్టా (ప్రొఫైలింగ్‌) కూడా తయారు చేసింది. ఆఖరుకు ఐబీ, ప్రభుత్వం సైతం జైషేమహ్మద్‌తో వీళ్లకు సంబంధాలు లేవని చెప్పినా, మీడియా మాత్రం క్షమాపణ చెప్పడం గానీ, డిస్‌క్లెయిమర్‌ గానీ ఏదీ ఉండదు.

మొదట ఇవన్నీ వింటుంటే నవ్వొచ్చింది. ఇన్ని అబద్ధాలతో, ఇన్ని ఆరోపణలు ప్రచారంలో పెట్టి తప్పుకోవచ్చనిమీడియా వాళ్లు అనుకుంటున్నారేమో కానీ అలా జరగదు.
వ్యక్తిగతంగా నేనెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు. మీరంతా వేల సంఖ్యలో నాకు మద్దతుగా నిలబడతారని. కానీ నేను నా చెల్లెండ్ల ప్రకటనలు, మా తండ్రి ప్రకటన చూశాక ఆందోళన చెందాను. నా చెల్లెండ్లను రేప్‌ చేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆందోళన కలిగింది. నాకప్పుడు కంధమాల్‌ (ఒడిషా) గుర్తుకొచ్చింది. క్రైస్తవ సన్యాసినిపై బజరంగ్‌దళ్‌ గూండాలు సామూహిక అత్యాచారం జరిపినప్పుడు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశారు. ఫిబ్రవరి 11న కామ్రేడ్‌ కన్నయ్య అన్నట్టుగా, ‘ఇదే మీ భారత్‌ మాత అయితే మాకీ భారత్‌ మాత వద్దు’. దీనికి మేం సిగ్గుపడం కూడా! మా తండ్రిని టీవీ స్టూడియోల్లో ప్రశ్నలతో వేధించారు. ఎక్కడెక్కడి వివరాలో తవ్వి తీసి వాటిని దీనితో జోడించే ప్రయత్నం చేశారు. జీ న్యూస్‌, టైమ్స్‌ నౌ (దాన్ని నడిపిస్తున్న వ్యక్తి పేరు నేను చెప్పదల్చుకోలేదు) వంటి చానెళ్లకు ఇంత ద్వేషం, ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తోంది? ఇంత ద్వేషాన్ని ఎలా పెంచుకోగలుగుతారో అర్థం కావడం లేదు.

గత ఏడేండ్లుగా ఈ నేనీ క్యాంపస్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. కానీ ఇన్నేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక ‘ముస్లిం’గా భావించలేదు. నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే పీడన కేవలం ముస్లింల పైననే జరగడం లేదు. సమాజంలోని వివిధ పీడిత సెక్షన్లన్నీ బాధిత సమూహాలే. ఆదివాసులపై, దళితులపై పీడన కొనసాగుతోంది. మా లాంటి బాధిత సమూహాల నుంచి వచ్చే వాళ్లం మా తక్షణ గుర్తింపుల పరిధి లోంచి బైటికి వచ్చి సమస్యలను సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ఏడేండ్లలో నాకు మొదటిసారిగా గత పది రోజుల్లోనే నేను ముస్లింనని తోచింది. రోహిత్‌ వేముల మాటల్లో చెప్పాలంటే, నన్ను నా తక్షణ గుర్తింపుకు కుదించి వేశారు. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.

వీళ్లు నన్ను పాకిస్తాన్‌ ఏజెంట్‌ అంటున్నారు. నేను పాకిస్తాన్‌కు చెందిన ఒక కవి రాసిన రెండు మాటలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ‘అరే భారు! హిందూస్తాన్‌ నాదే… పాకిస్తాన్‌ నాదే.. కానీ ఈ రెండింటిపైనా ఉన్నది అమెరికా పెత్తనమే. ఆ అమెరికాకు మీరు దళారులు!’ మీ ప్రభుత్వానికి దళారీతనం తప్ప మరొకటి రానే రాదు. మీరే అమెరికా పాదాలు నాకుతున్నారు. ఈ దేశ సంపదలను, వనరులను అమెరికాకు దోచిపెడుతున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్‌సీలు ఇక్కడి శ్రమశక్తిని దోచుకుంటున్నాయి. విద్యారంగాన్ని కూడా తాకట్టు పెట్టింది. డబ్ల్యూటీవోలో ప్రభుత్వం ఎలా మోకరిల్లిందో మనం చూశాం. వీళ్లు మాకు దేశభక్తి గురించి చెబుతున్నారు! నా తోటి దేశద్రోహులారా! ‘ప్రపంచ దేశద్రోహులారా, ఏకం కండి’ అని అనాలిప్పుడు. మేం ప్రజలను ప్రేమిస్తాం. మా పోరాటానికి హద్దులు, సరిహద్దులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మనమంతా ఏకమవుతార. ప్రజలను పీడించే ఏ దేశ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా ఏకమవుతాం.

ఈ తరహా హేయమైన ఎత్తుగడలతో వాళ్లు మనల్ని భయపెట్టలేరు. వాళ్లు మన నోళ్లను మూయించలేరు. మిత్రులారా! మనం వీళ్లకు భయపడాల్సిన అవసరం లేదని మీకు చెప్పాల్సిన పనే లేదు. వీళ్లకు మెజారిటీ ఉండొచ్చు. వీళ్లకు చాలా సీట్లు ఉండొచ్చు. వీళ్ల దగ్గర బలమైన మీడియా ఉండొచ్చు. రాజ్య యంత్రానికి సంబంధించిన చాలా విభాగాలు, పోలీసులు వగైరా ఉండొచ్చు. అయినా వీళ్లు భయపడతున్నారు. మన పోరాటాలకు భయపడుతున్నారు. మనం ఆలోచిస్తున్నం దుకు వాళ్లు భయపడుతున్నారు. నా సహచరుడు అనిర్బాన్‌ ఫిబ్రవరి 10న ఒక మాట చెప్పాడు. దేశద్రోహి కావడం చాలా సులువని. ఆలోచించడం మొదలు పెడితే చాలు వెంటనే దేశద్రోహి అయిపోతారు. కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టగలమని అనుకుంటే మీరు చాలా పెద్ద భ్రమలో ఉన్నట్టే. ముందే చెప్పినట్టుగా, మీరీ విశ్వవిద్యాలయంతో తలపడి పొరపాటు చేశారు. చాలా విశ్వవిద్యాలయాలతో ఇదివరకే మీరు తలపడ్డారు. ఎఫ్‌టిఐఐలో జరిగింది గానీ, హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల హత్య జరిగిన తీరు గానీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సందీప్‌ పాండేకు జరిగింది గానీ… ఈ అన్ని పోరాటాలతో మేం భుజం భుజం కలిపి నడిచాం. ప్రతి పోరాటాన్ని మేం ఇక్కడ వీధుల్లోకి తీసుకెళ్లాం. ఇది మా బాధ్యతని మేం భావిస్తాం.

అయితే మీకు జేఎన్‌యూనే పెద్ద అడ్డంకిగా ఉంది కాబట్టి దీనినే అణచివేస్తామని అనుకుంటే మీకు చెప్పేదొకటే. ఈ తరహా విఫల ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. బహుశా మీరు మర్చిపోవచ్చు గానీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తే ఆమెను అడ్డుకున్నారు. మునుపటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇక్కడికి వచ్చినప్పుడు యూపీఏ దేశాన్ని తాకట్టు పెడుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ అతనికి నల్ల జెండా చూపించాం. చిదంబరం ఇక్కడికి వచ్చినప్పుడు, తనకు ఘన స్వాగతం లభిస్తుందని ఆశించి ఆశాభంగం పొందిన విషయం గుర్తుండాలి. విద్యార్థులు తాము ఈ దేశ పీడిత ప్రజల వైపున్నామని చిదంబరంకు తెలియజెప్పారు. కాబట్టి ఇలాంటి తాటాకు చప్పుళ్లతో బెదిరిపోయే కుందేళ్లం కాదు మేం. ఇవి కేవలం మైండ్‌గేమ్స్‌ మాత్రమే! మనం భయపడతామా లేదా అని వాళ్లు పరీక్ష పెడుతున్నారు. కానీ మనం భయపడమని చాటి చెబుదాం. సవాలును స్వీకరిద్దాం. ప్రతి రంగంలోనూ ఎదురు నిలిచి పోరాడుదాం. ప్రతి అంశంపైనా, క్యాంపస్‌లోని ప్రతి విద్యార్థికీ ఎలాంటి జంకు లేకుండా తన అభిప్రాయాన్ని చర్చించే హక్కుంది.

వీళ్లకో విద్యార్థి విభాగం ఉంది – ఏబీవీపీ. ఇది ఈ క్యాంపస్‌లో వాళ్ల వానర సేన. ఏ అంశం వచ్చినా వీళ్లు అల్లరి మూకలా వ్యవహరిస్తారు. పోలీసులు, క్యాంపస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మంత్రులు అందరూ వీళ్లకు అండగా ఉంటారు. రోహిత్‌ను ఇట్లాగే అందరూ కుమ్మక్కై చంపేశారు. కానీ ఇక్కడ ఎవ్వరూ మరో రోహిత్‌ కాబోరని నేను ప్రకటిస్తున్నాను. ఈ క్యాంపస్‌ విలువేమిటో మనకు తెలుసు. దీన్ని మనమే తీర్చిదిద్దుకున్నాం. దీన్ని నాశనం చేయాలనే వీళ్ల ప్రయత్నాలను ఓడిద్దాం. ఇందులో ఒక్క అంగుళం స్థలం కూడా వారికి వదిలెయ్యం. ఏబీవీపీకి అసలు ప్రజల్లో బలం లేదు. ప్రజలను సమీకరించలేరు వీళ్లు. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని తోడుగా తెచ్చుకుంటారు. ఈ పది రోజుల్లో ఇంత మీడియా ప్రచారం, ఇన్ని మీడియా ట్రయల్స్‌, దేశభక్తి పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు ఇన్ని జరిగినా వీళ్ల కార్యక్రమాలకు హాజరవుతున్నది కేవలం వేళ్ల మీద లెక్కించేంత మందే. ఇక్కడ మనం 15 వేల మంది దాకా సమీకరించగలిగాం. విద్యార్థి ఉద్యమంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, ‘అసమ్మతిని అనుమతించని విశ్వవిద్యాలయం జైలుగా మారిపోతుంది’. వారి అజెండా స్పష్టమే! విశ్వవిద్యాలయాలను జైళ్లుగా మార్చాలనేదే వాళ్ల లక్ష్యం. దీన్ని మనం ఓడించాలి. ఐక్యంగా ఉండాలి. చీలి పోవద్దు. మనలో మనకు విభేదాలున్నాయని మనకు తెలుసు. అయితే వాటిని ఎలా చర్చించుకోవాలో కూడా మనకు తెలుసు. చివరగా, గత పదిరోజుల్లో ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా లెక్క లేనన్ని దాడులు జరిగాయి. హౌండా కార్మికులపై దాడి జరిగింది. జగ్దల్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో లీగల్‌ ఎయిడ్‌ గ్రూపుపై దాడి జరిగింది. సోని సోరిపై దాడి జరిగింది. ఈ పోరాటాలన్నింటికీ సంఘీభావం తెలపాలి. ఈ పోరాటాలతో అనుసంధానం చేసుకోవాలి. ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా వారికి అండగా నిలబడే జేఎన్‌యూ సంప్రదాయాన్ని సజీవంగా నిలుపుకోవాలి. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!

-ఉమర్‌ ఖాలిద్‌
(నవతెలంగాణ సౌజన్యంతో)