ప‌దిమందిపై సామూహిక అత్యాచారం…స‌ర్దుకుపొమ్మ‌న్న పోలీసులు!

హ‌ర్యానా, ముర్త‌ల్ హైవేమీద అత్యంత ఘోరంగా ప‌దిమంది మ‌హిళ‌ల‌పై సామూహిక అత్యాచారాలు జ‌రిగిన‌ట్టుగా తెలుస్తోంది. ది ట్రిబ్యూట్ ప‌త్రిక అందిస్తున్న  స‌మాచారం ప్ర‌కారం రోడ్ల‌మీద వెళుతున్న వాహ‌నాల‌ను ఆపి (మ‌రో క‌థ‌నం ప్ర‌కారం రైల్లోంచి కిందికి లాగి) వాటిలోని మ‌హిళ‌ల‌ను ద‌గ్గ‌ర్లో ఉన్న పొద‌ల్లోకి తీసుకువెళ్లి దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అయితే పోలీసులు ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌లేదంటూ ఖండిస్తున్నారు.  కానీ సంఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి స‌మీపాన ఉన్న‌వారు మాత్రం పోలీసు అధికారులు కావాల‌నే జ‌రిగిన దారుణాన్ని జ‌ర‌గ‌లేదంటున్నార‌ని చెబుతున్నారు.

ముగ్గురు బాధితుల‌ను ఆ చేరువలో ఉన్న‌ అమ్రిక్ దాబా వద్ద పోలీసుల ముందే వారి కుటుంబాల‌కు అప్ప‌గించామ‌ని సాక్ష్యులు అంటున్నారు.  అత్యంత ద‌య‌నీయంగా ఉన్న బాధితుల‌కు స‌మీపంలో ఉన్న హ‌స్సాన్ పూర్‌, కురాద్‌ల‌ నివాసితులు వ‌చ్చి దుప్ప‌ట్లు, బ‌ట్ట‌లు ఇచ్చార‌ని అక్క‌డ ఉన్న‌వారు అంటున్నారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చిన సీనియ‌ర్ పోలీస్ అధికారులు కేసులు పెట్ట‌వ‌ద్ద‌ని, ఇంటికి వెళ్లిపొమ్మ‌ని చెప్పిన‌ట్టుగా స‌మాచారం. దుండ‌గులు వాహానాల‌కు నిప్పుపెట్టి అందులో ఉన్న‌వారిని భ‌య‌భ్రాంతుల‌ను చేశార‌ని, త‌రువాత మ‌హిళ‌ల‌ను ద‌గ్గ‌ర‌లో ఉన్న పొద‌ల్లోకి ఈడ్చుకు వెళ్లార‌ని సాక్ష్యులు చెబుతున్న క‌థ‌నం.