వేరుకాపురం గొడ‌వ‌…మూడుప్రాణాలు బ‌లి!

కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఒక త‌ల్లి, త‌న ఇద్ద‌రు పిల్ల‌ల ప్రాణాలు తీసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. హైద‌రాబాద్, హ‌య‌త్‌న‌గ‌ర్‌లో ఈ దారుణం జ‌రిగింది. మృతులు లావ‌ణ్య (28), ఆమె పిల్ల‌లు 8, 6 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న శ్రీహ‌ర్ష‌, జోషిక‌. లావ‌ణ్య మొద‌ట పిల్ల‌ల ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి, త‌రువాత తానూ అదే విధంగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. బెడ్‌రూముకి లోప‌ల బోల్టు పెట్టుకుని ఈ ప‌నిచేయ‌డంతో, అక్క‌డికి చేరిన‌వారు త‌లుపులు ప‌గుల‌కొట్టాల్సి వ‌చ్చింది. ఆ ఆల‌స్యం వ‌ల‌న వారిని ర‌క్షించే అవ‌కాశం లేక‌పోయింది. లావ‌ణ్య రోజువారీ కూలీగా ప‌నిచేస్తుండ‌గా, ఆమె భ‌ర్త ప‌ర్వ‌తాలు కూడా అదేప‌ని చేస్తున్నాడు. పోలీసులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లే ఈ దారుణానికి దారితీసిన‌ట్టుగా తెలుస్తోంది. లావ‌ణ్య తన‌ అత్త‌మామ‌ల‌కు దూరంగా వేరే ఇంటికి మారదామ‌ని గొడ‌వ‌పెడుతుండ‌గా, ఆమె భ‌ర్త అందుకు నిరాక‌రించాడు.  భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య ఉన్న ఆ విభేదాలే  తారాస్థాయికి చేరి, ఇలాంటి ఘోరానికి దారితీసి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు. లావ‌ణ్య భ‌ర్త, అత్తామామ‌ల మీద పోలీసులు 498- ఎ సెక్ష‌న్ కింద వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు న‌మోదు చేసే అవ‌కాశ‌మున్న‌ట్టుగా తెలుస్తోంది.