Telugu Global
Cinema & Entertainment

ఆ పేదింటి అమ్మాయిలు...అమీర్, సల్మాన్‌ల‌తో న‌టిస్తున్నారు!

జీవితం ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అప్ప‌టివ‌ర‌కు సాధార‌ణంగా జీవించిన‌వారు ఊహించని అవ‌కాశాల‌తో అంద‌లం ఎక్క‌డం సినిమాల్లోనే కాదు, నిజ‌జీవితంలోనూ జ‌రుగుతుంటుంది. అలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చింది ఈ అక్కాచెల్లెళ్ల‌కు. గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌కు చెందిన షాజాహా షేక్ (23), జ‌రీనా షేక్ (21) రెజ్ల‌ర్లు.  మ‌ల్ల‌యుద్ధంలో ఆరితేరిన‌వారు. హ‌ర్యానాకు చెందిన ప్ర‌ముఖ‌ రెజ్లింగ్ సిస్ట‌ర్స్ గీత బ‌బిత ఫోగ‌త్‌ల‌ బాట‌లో ముందుకు వెళుతున్న‌వారు. గ‌త ఏడాది డిసెంబ‌రులో ఢిల్లీలో జ‌రిగిన నేష‌న‌ల్ రెజ్లింగ్ పోటీల్లో గుజ‌రాత్ […]

ఆ పేదింటి అమ్మాయిలు...అమీర్, సల్మాన్‌ల‌తో న‌టిస్తున్నారు!
X

జీవితం ఎప్పుడు ఏ మ‌లుపు తిరుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. అప్ప‌టివ‌ర‌కు సాధార‌ణంగా జీవించిన‌వారు ఊహించని అవ‌కాశాల‌తో అంద‌లం ఎక్క‌డం సినిమాల్లోనే కాదు, నిజ‌జీవితంలోనూ జ‌రుగుతుంటుంది. అలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చింది ఈ అక్కాచెల్లెళ్ల‌కు. గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌కు చెందిన షాజాహా షేక్ (23), జ‌రీనా షేక్ (21) రెజ్ల‌ర్లు. మ‌ల్ల‌యుద్ధంలో ఆరితేరిన‌వారు. హ‌ర్యానాకు చెందిన ప్ర‌ముఖ‌ రెజ్లింగ్ సిస్ట‌ర్స్ గీత బ‌బిత ఫోగ‌త్‌ల‌ బాట‌లో ముందుకు వెళుతున్న‌వారు. గ‌త ఏడాది డిసెంబ‌రులో ఢిల్లీలో జ‌రిగిన నేష‌న‌ల్ రెజ్లింగ్ పోటీల్లో గుజ‌రాత్ త‌ర‌పున పాల్గొన్నారు. మెడ‌ల్ రాక‌పోయినా, మున్ముందు భ‌విష్య‌త్తు ఉన్న రెజ్లింగ్ సిస్ట‌ర్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అక్కాచెల్లెళ్లు అమీర్ ఖాన్ సినిమా దంగ‌ల్‌లో, స‌ల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్‌ల్లో న‌టించే జాక్‌పాట్ అవ‌కాశాలు కొట్టేశారు.

దంగ‌ల్… గీత, బ‌బితా ఫోగ‌త్ ల జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఇందులో అమీర్ ఖాన్ వారిద్ద‌రి తండ్రి మ‌ల్ల‌యుద్ధ యోధుడు మ‌హ‌వీర్ సింగ్ పాత్ర‌ని పోషిస్తున్నారు. సుల్తాన్‌లో స‌ల్మాన్ కూడా సుల్తాన్ అలీ ఖాన్ అనే నిజ‌జీవిత మ‌ల్ల‌యోధుడి పాత్ర‌ని పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల్లోనూ గుజ‌రాత్ సిస్ట‌ర్స్ న‌టిస్తున్నారు.

గాంధీన‌గ‌ర్ జిల్లాలోని వావోల్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో జ‌న్మించిన షాజ‌హా, జెరీనాల‌కు ఈ సినిమాల్లో వ‌చ్చిన అవ‌కాశాలు మంచి పేరునే కాక డ‌బ్బుని సైతం తెచ్చిపెడుతున్నాయి. అంతేకాక ఇద్ద‌రు ప్ర‌ముఖ న‌టులతో క‌లిసి న‌టిస్తుండ‌టంతో వారు ఆనందంతో త‌బ్బిబ్బ‌వుతున్నారు. ఐదుగురు స‌భ్యులు ఉన్న ఈ కుటుంబం రెండుగ‌దుల చిన్న ఇంట్లో నివ‌సిస్తోంది. సినీ అవ‌కాశాల‌తో వారి జీవ‌న శైలిలో మార్పులు వ‌స్తున్నాయి. ఇంటికోసం మొట్ట‌మొద‌టి సారిగా త‌మ సంపాద‌న‌లోంచి ఒక ఫ్రిజ్‌, ల్యాప్‌టాప్ కొన్నామ‌ని వీరు చెబుతున్నారు.

కూతుళ్ల‌కు వ‌చ్చిన అవ‌కాశాల ప‌ట్ల వారి తండ్రి కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఆయ‌న నెల‌కు ప‌దివేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

పుణెలో అమీర్‌తో, గుర్‌గావ్‌లో స‌ల్మాన్‌తో క‌లిసి షూటింగ్‌లో పాల్గొన్న అనుభ‌వాల‌ను ఇప్పుడు ఈ అక్కా చెల్లెళ్లు క‌థ‌లుగా చెబుతున్నారు. వారితోపాటు క‌లిసి భోంచేయ‌డం, సెల్ఫీలు దిగ‌డం వీరికి మ‌ర‌పురాని అనుభూతులుగా మిగులుతున్నాయి. వీరిలో జ‌రీనా స‌ల్మాన్‌ఖాన్‌కి వీరాభిమాని.

First Published:  26 Feb 2016 9:00 PM GMT
Next Story