ఆ చిట్టిత‌ల్లికి ఏం క‌ష్ట‌మొచ్చిందో…కిరోసిన్‌తో త‌గుల‌బ‌డిపోయింది!

అనంత‌పురంలోని ఓబుళ‌దేవ‌రన‌గ‌ర్‌లో హ‌రిత అనే చిన్నారి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న హ‌రిత బ‌య‌టకు ఆడుకోవ‌డానికి వెళ్లి ఇంటికి తిరిగి వ‌చ్చింది. రాగానే వంటింట్లోకి వెళ్లి కిరోసిన్‌ని ఒంటిమీద పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లోంచి పొగ‌లు వ‌స్తుండ‌టంతో స్థానికులు వ‌చ్చి చూడ‌గా చిన్నారి కాలిన గాయాల‌తో క‌నిపించింది. ఆసుప‌త్రికి తీసుకువెళ్లినా ఫ‌లితం లేక‌పోయింది. అంత చిన్నపిల్ల‌కు అంత‌టి బాధ ఏం క‌లిగిందో అని చుట్టుప‌క్క‌ల వారు ఆవేదన, బాధ వ్య‌క్తం చేశారు. ఆడేపాడే చిన్నారి ఒక్క‌సారిగా బుగ్గి కావ‌డంతో త‌ల్లిదండ్రుల రోద‌న‌కు అంతేలేకుండా పోయింది. ఆ పాప‌ని ఎవ‌రూ ఏమీ అన‌లేద‌ని, ఏం జ‌రిగిందో తెలియ‌ద‌ని తండ్రి కిష్ట‌ప్ప వాపోయాడు.

ప‌ది ప‌న్నెండేళ్ల పిల్ల‌లు మ‌న క‌ళ్ల‌కి ప‌సివాళ్ల‌లాగే క‌న‌బ‌డ‌తారు. వారిలో ఇంత తీవ్ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునేంత ఆవేశం, ధైర్యం, శ‌క్తి…ఇవ‌న్నీ కాకుండా గాయ‌ప‌డే మ‌నసు… ఉండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న విష‌యం. ప‌రిష్కారాలేమిటో తెలియ‌ని, ఎలా భ‌రించాలో అర్థంకాని గాయాలను పిల్ల‌లు ఎదుర్కొంటున్నార‌ని ఈ సంఘ‌ట‌న రుజువు చేసింది. చిన్న‌పిల్ల‌ల మ‌న‌సుల్లో పెద్ద ఆలోచ‌న‌లు పెరుగుతున్నాయ‌ని, వారి మైండ్‌సెట్ మారుతున్న‌ద‌ని కూడా అర్థం చేసుకోవాల్సిన స్థితి.

వేగవంత‌మైన మార్పుల‌తో క్ష‌ణంకో ర‌కంగా క‌న‌బ‌డుతున్న ఈ ప్ర‌పంచంలో పిల్ల‌లు చిన్న వ‌య‌సులోనే చాలా విష‌యాల‌ను అర్థం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. పెద్ద‌వాళ్లలో పెరుగుతున్న మ‌నోవికారాల‌ను కూడా, త‌మ‌కే మాత్రం సంబంధం లేక‌పోయినా పిల్ల‌లు అనుభ‌వించాల్సిన దుస్థితి నేడు ఉంది.

పిల్ల‌లు ప్ర‌పంచాన్ని, జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు…అనే విష‌యాన్ని ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్ర‌భుత్వాలు, సామాజిక శాస్త్ర‌వేత్త‌లు, మ‌న‌స్త‌త్వ నిపుణులు అంద‌రూ ఈ విష‌యంపై దృష్టి సారించాలి. మొగ్గ‌ద‌శ‌లోనే ఇలాంటి ప‌రిణామాల‌పై స్పందించ‌క‌పోతే ప‌సిమొగ్గ‌లు ఇలా బ‌లి కావాల్సివ‌స్తుంది.