తండ్రి అత్యాచారం చేశాడు…గ్రామ పెద్ద‌లు శుద్ది పేరుతో కొట్టారు!

ఎప్ప‌టిక‌ప్పుడు మ‌నం నాగ‌రిక స‌మాజంలోనే ఉన్నామా అనే సందేహాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌లు మన క‌ళ్ల‌ముందుకు వ‌స్తూనే ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లోని స‌తారా జిల్లాలో అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. కొల్హాపూర్‌కి 140 కిలోమీట‌ర్ల‌దూరంలో ఉన్న పాచ్‌వాద్ గ్రామంలో ఈ దారుణం జ‌రిగింది. 55 సంవ‌త్స‌రాల  తండ్రి 13 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.  జ‌రిగిన‌ ఘోరం  బ‌య‌ట‌కు రాగా గ్రామంలోని గోపాల్ కమ్యునిటీకి చెందిన పెద్ద‌లు గురువారం జాట్ పంచాయితీ నిర్వ‌హించారు. ఇందులో తండ్రికి 25 దెబ్బ‌లు, 7వేల రూపాయ‌లు జ‌రిమానాగా విధించారు. ఆ బాలిక‌ని కూడా శుద్ధిచేసే సంప్ర‌దాయం పేరుతో దారుణంగా కొట్టారు. ఈ క్ర‌మంలో నిందితుల చేతుల్లో మూడు క‌ర్ర‌లు విరిగిపోయిన‌ట్టుగా ఈ ఉదంతం మొత్తాన్ని చిత్రించిన వీడియోలో క‌న‌బ‌డుతోంది.

ఓ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కార్య‌క‌ర్త ఈ దృశ్యాల‌ను త‌న సెల్‌ఫోన్‌ల్లో చిత్రీక‌రించాడు. ఆధారంతో స‌హా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చేరిన పోలీసులు కుల‌పెద్ద‌లు, పంచాయితీ స‌భ్యులు,  గ్రామ‌స్తుల నుండి వివ‌రాలు సేక‌రించారు. న‌లుగురు పంచాయితీ స‌భ్యుల‌మీద‌, బాలిక తండ్రిమీద కేసులు న‌మోదు చేశారు. ఆ తండ్రి ప‌చ్చి తాగుబోత‌ని, అత‌ని భార్య ఆరునెల‌ల క్రితం చ‌నిపోయింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.