కాల్‌మనీ  …నిజాయితీప‌రుల‌పైనా కేసులు! 

కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ్డాక పోలీసులు అప్ర‌మ‌త్త‌మై పెద్ద ఎత్తున చ‌ర్య‌లు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నేప‌థ్యంలో ఎలాంటి పీడించే స్వ‌భావం లేకుండా రెండురూపాయ‌లు మాత్ర‌మే వ‌డ్డీ తీసుకుంటున్న కాల్‌మ‌నీ వ్యాపారులు సైతం చిక్కులు ఎదుర్కొంటున్న‌ట్టుగా తెలుస్తోంది. అప్పులు తీసుకున్న వారు కాల్‌మ‌నీ అవినీతి దందా బ‌య‌ట‌కు రాగానే ఇదే అద‌నుగా త‌మ‌ను పీడించ‌ని నిజాయితీగ‌ల‌ బుణ‌దాత‌ల మీద కూడా కేసులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా కాల్‌మ‌నీ వ్యాపారంలో ఉన్న‌వారంతా క‌లిసి హైకోర్టుకి వెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నారు. అన్ని నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ వ్యాపారం చేస్తున్న‌తాము శిక్ష‌లు ఎందుకు అనుభ‌వించాలి…అని వీరు కోర్టుని అడ‌గ‌ద‌ల‌చుకున్నారు.

 పోలీసుల‌కు ఇప్ప‌టికీ కాల్‌మ‌నీ అప్పులు తీసుకున్న వారినుండి ఫిర్యాదులు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో రాజకీయ పార్టీల ప్ర‌మేయం ఉండ‌టంతో నిజానిజాలు విచారించే అవ‌కాశం లేకుండా పోలీసులు వారంద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అవినీతి లేకుండా ఉదారంగా ఈ వ్యాపారంలో ఉన్న‌వారిపై కూడా అప్పు తీసుకున్న‌వారు కాల్‌మ‌నీ కేసులు పెట్టేస్తున్నారు. ఈ ప‌రిస్థితి, త‌మ‌కు అవ‌స‌రంలో డ‌బ్బిచ్చి ఆదుకునే వారిని లేకుండా చేసింద‌ని, ఎప్పుడుకావాలంటే అప్పుడు త‌క్కువ వ‌డ్డీకి డబ్బు ఇచ్చే వ్యాపారుల‌ను సైతం పోలీసులు అరెస్టులు చేయ‌డం అన్యాయ‌మ‌ని  కాల‌మ‌నీ ద్వారా అప్పులు పొందుతున్న వారు వాపోతున్నారు. ఇక‌నైనా రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఈ కేసుల విష‌యంలో నిజానిజాల‌ను స్ప‌ష్టంగా తేల్చాల‌ని వారు కోరుతున్నారు.