Telugu Global
CRIME

అప్పు ఇప్పిస్తామంటూ...అప్ప‌నంగా ప‌దిల‌క్ష‌లు దోచేశారు!

మోస‌పోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. అది లోక‌రీతి. మోసం చేయ‌డం అనేది మ‌న స‌మాజంలో ఇప్పుడు గొప్ప‌క‌ళ‌గా వ‌ర్దిల్లుతోంది. అంత సృజ‌నాత్మ‌కంగా వారి ఆలోచ‌న‌లు ఉంటున్నాయి మ‌రి. బెంగ‌లూరు లో ఒక మ‌హిళ‌ను ఐదుగురు దుండ‌గులు ఇలాగే మోసం చేశారు. రిటైర్డ్ టీచ‌ర్ అయిన అన్న‌పూర‌ణి (55) సొంతంగా ఒక స్కూలుని ప్రారంభించాల‌నుకుంది. అందుకు ఆమెకు 50ల‌క్ష‌ల రూపాయ‌లు కావాలి.  రుణం దొరికే మార్గాల‌కోసం అన్వేషిస్తుండ‌గా బెంగ‌లూరు నుండి ప్ర‌చురిత‌మ‌య్యే ఒక […]

మోస‌పోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటారు. అది లోక‌రీతి. మోసం చేయ‌డం అనేది మ‌న స‌మాజంలో ఇప్పుడు గొప్ప‌క‌ళ‌గా వ‌ర్దిల్లుతోంది. అంత సృజ‌నాత్మ‌కంగా వారి ఆలోచ‌న‌లు ఉంటున్నాయి మ‌రి.

బెంగ‌లూరు లో ఒక మ‌హిళ‌ను ఐదుగురు దుండ‌గులు ఇలాగే మోసం చేశారు. రిటైర్డ్ టీచ‌ర్ అయిన అన్న‌పూర‌ణి (55) సొంతంగా ఒక స్కూలుని ప్రారంభించాల‌నుకుంది. అందుకు ఆమెకు 50ల‌క్ష‌ల రూపాయ‌లు కావాలి. రుణం దొరికే మార్గాల‌కోసం అన్వేషిస్తుండ‌గా బెంగ‌లూరు నుండి ప్ర‌చురిత‌మ‌య్యే ఒక ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లోని ప్ర‌క‌ట‌న ఆమెను ఆక‌ర్షించింది. త‌క్కువ వ‌డ్డీకి రుణాలు ఇప్పిస్తామ‌నేది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. అందులో ఉన్న అడ్ర‌స్‌లో సంప్ర‌దించిన అన్న‌పూర‌ణికి ఐదుగురు వ్య‌క్తులు తామే ఆ ప్ర‌క‌ట‌న‌ని ఇచ్చిన‌ట్టుగా ప‌రిచ‌యం చేసుకున్నారు.

తాము లోను ఇప్పిస్తాము కానీ ముందుగా అడ్వాన్స్ క‌మిష‌న్ కింద ఆమె ప‌దిల‌క్ష‌లు త‌మ‌కు చెల్లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. అందుకు ఆమె అంగీక‌రించింది. చెన్నై ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌కు డబ్బుతో రావాల‌ని ఆమెకు చెప్పారు. ఆమె అలాగే డ‌బ్బుతో రాగా ఒక ల‌గ్జరీ హోట‌ల్‌కి స‌మీపంలో ఆమెనుండి ఆ డ‌బ్బుని దుండ‌గులు స్వాధీనం చేసుకున్నారు. త‌రువాత తాము తెచ్చిన ప్యాకెట్‌ని ఆమెకు ఇచ్చారు. లోను మొత్తాన్ని వెంట‌నే ఆమెకు అంద‌జేస్తామ‌ని ముందుగానే చెప్పారు క‌నుక ఆమె దృష్టిలో అది తాను అడిగిన లోన్ డబ్బు. బ‌హిరంగంగా అంత డ‌బ్బుని లెక్క‌పెట్ట‌వ‌ద్ద‌ని ఇంటికి తీసుకువెళ్లి లెక్క‌పెట్టుకోమ‌ని దుండ‌గులు స‌ల‌హా ఇచ్చారు. ఇంటికి వెళ్లి ప్యాకెట్ ఓపెన్ చేసి చూసిన అన్న‌పూరణికి ఒక్క‌సారిగా దిమ్మ‌తిరిగిపోయింది. అందులో అన్నీ తెల్ల‌కాగితాలే ఉన్నాయి. అన్న‌పూరణి చెన్నై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దాంతో దొంగ‌లు పోలీసుల చేతికి చిక్కారు. వారిలో ఒక్క‌రు త‌ప్ప అంతా 30ఏళ్ల లోపు వ‌య‌సున్న‌వారే. ఒక‌రు కొయింబ‌త్తూరుకి, మిగిలిన‌వారంతా కేర‌ళ‌కు చెందిన‌వారు. ఇందులో ష‌గుణ్, ఇంత‌కుముందు కూడా అన్న‌పూర‌ణి లాంటి ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను 12మందిని ఇలాగే మోసం చేశాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వారి నుండి పోలీసులు 13.6ల‌క్ష‌ల న‌గ‌దు, 17స‌వ‌ర్ల బంగారం, రెండు కార్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

First Published:  12 March 2016 3:51 AM GMT
Next Story