‘కథకళి’ – రక్తి కట్టిన సస్పెన్స్‌

రేటింగ్‌ :3.5/5
తారాగణం: విశాల్‌, కేథరీన్‌, కరుణాస్‌, శ్రీజిత్‌ రవి, మధుసూదన్‌ రావు, మైమ్‌ గోపి, జయప్రకాష్‌ తదితరులు
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
ఛాయాగ్రహణం: బాలసుబ్రమణియం
నిర్మాత: విశాల్‌
రచన, దర్శకత్వం: పాండిరాజ్‌
విడుదల తేదీ: మార్చి 18, 2016

కమల్‌ (విశాల్‌) అమెరికాలో నాలుగేళ్ళు ఉండి, మరో వారంలో పెళ్ళి చేసుకోవడానికి ఇండియా రావడంతో కథ ప్రారంభం అవుతుంది. పెళ్ళి కార్డు ఇవ్వడానికి మిత్రుడి ఇంటికి వెళ్ళిన నేపధ్యంలో కమల్‌కి మల్లీశ్వరికి ఎలా పరిచయం అయిందీ, ఆ పరిచయం ప్రేమగా, చివరికి పెళ్ళికి ఎలా దారితీసిందీ ఎక్కడా బోరుకొట్టకుండా అరిగిపోయిన పాత పద్ధతుల్లో కాకుండా కాస్త కొత్తగా చెబుతాడు దర్శకుడు.

కమల్‌ మల్లీశ్వరిని కలవడానికి కాకినాడ నుంచి విశాఖ వెళతాడు. అప్పుడు కాకినాడలో ఉన్న విలన్‌ సాంబ హత్యకు గురవుతాడు. సాంబ వల్ల కమల్‌ కుటుంబం చాలా నష్టపోయి ఉంటుంది. ఇంకా అనేక మంది సాంబ వల్ల నష్టపోయి అతనిపై కసిపెంచుకుని ఉంటారు.  సాంబ దగ్గర పనిచేస్తున్న తన మిత్రుడికి కమల్‌ ఫోన్‌ చేసి “సాంబని ఎవరో చంపేశారట కదా! నిన్నుకూడా చంపుతారేమో జాగ్రత్త” అని చెబుతాడు. సాంబని చంపిన విషయం కమల్ కి వెంటనే  ఎలా తెలిసిపోయింది? కాబట్టి ఈ హత్య కమల్‌ చేయించాడని ఆ మిత్రుడు సాంబ బావమరుదులకు చెబుతాడు.

హంతకుణ్ణి అరెస్ట్‌ చేసే వరకు హత్యకు గురైన “సాంబ” మృత దేహాన్ని స్పాట్‌ నుంచి కదల నిచ్చేది లేదని సాంబ భార్య ధర్నా చేస్తుంటుంది. ఎవరో ఒకర్ని ఈ హత్యానేరం మీద అరెస్ట్‌ చేసి, ఆ శవాన్ని అక్కడి నుంచి కదిలించమని పోలీసు అధికారుల నుంచి ఒత్తిడి రావడంతో ఇన్‌ స్పెక్టర్‌ కమల్‌ని ఈ హత్యానేరంలో ఇరికిస్తాడు.

రెండు రోజుల్లో పెళ్ళి.

హత్యా నేరంపై అరెస్ట్‌.

ఈ నేపధ్యంలో హీరో ఎలా బయట పడ్డాడనేది సస్పెన్స్‌!
ఎడిటింగ్‌ చాలా బావుంది. ఎక్కడా ఒక్క అనవసరపు సన్నివేశం లేకుండా కథలో పట్టు సడలకుండా, ఉత్కంఠ భరితంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు.
సినిమాలో చిన్నచిన్న లోపాలున్నా మొత్తంగా మంచి సస్పెన్స్‌ సినిమా చూశామన్న అనుభూతి ప్రేక్షకుడికి మిగులుతుంది ఈ సినిమా చూశాక. సినిమా మొత్తంలో బోర్‌ కొట్టే సన్నివేశం ఒక్కటీ కనిపించదు. అసభ్య సన్నివేశాలు గాని, బూతు డైలాగులు కాని ఒక్కటికూడా లేకపోవడం వల్ల కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా రూపొందింది.