Telugu Global
Health & Life Style

భార‌త్‌లో అమెరికా వైద్య అధ్య‌య‌ నాలు... మ‌ర‌ణించేవ‌ర‌కు ఆగి లెక్క‌లు వేశారు!

ఒక అనారోగ్యం వ‌చ్చే అవ‌కాశం ఉందా… అని తెలుసుకునే ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయించుకుంటే అలాంటివారికి దాన్ని నివారించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.  అలాంటి ప‌రీక్ష‌లు చేయించుకోని వారు ఆ అనారోగ్యం బారిన ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఎవ‌రికైనా అర్థ‌మ‌య్యే సాధార‌ణ విష‌యం. కానీ కొంత‌మంది వైద్య ప్రముఖుల‌కే ఈ విష‌యం అర్థం కాలేదు. దాంతో రెండువంద‌ల‌కు పైగా మ‌హిళ‌లు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. అంతేకాదు, ఈ ఉదంతం 21వ శ‌తాబ్దంలోనే అత్యంత నీతిమాలిన, […]

భార‌త్‌లో అమెరికా వైద్య అధ్య‌య‌ నాలు...  మ‌ర‌ణించేవ‌ర‌కు ఆగి లెక్క‌లు వేశారు!
X

ఒక అనారోగ్యం వ‌చ్చే అవ‌కాశం ఉందా… అని తెలుసుకునే ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయించుకుంటే అలాంటివారికి దాన్ని నివారించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలాంటి ప‌రీక్ష‌లు చేయించుకోని వారు ఆ అనారోగ్యం బారిన ప‌డే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ఎవ‌రికైనా అర్థ‌మ‌య్యే సాధార‌ణ విష‌యం. కానీ కొంత‌మంది వైద్య ప్రముఖుల‌కే ఈ విష‌యం అర్థం కాలేదు. దాంతో రెండువంద‌ల‌కు పైగా మ‌హిళ‌లు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవ‌ల‌సి వ‌చ్చింది. అంతేకాదు, ఈ ఉదంతం 21వ శ‌తాబ్దంలోనే అత్యంత నీతిమాలిన, అర్థ‌ర‌హిత‌మైన వైద్య ప‌రిశోధ‌న‌గా విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. వివ‌రాల్లోకి వెళితే-

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలకు సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మ‌ర‌ణాల‌ను ఆపే ఆశ‌యంతో భారీ అధ్య‌య‌నాల‌ను 1997లో చేప‌ట్టారు. వీటిని మ‌న‌దేశంలోనూ నిర్వ‌హించారు.

భారత్‌లో అత్యధికంగా మహిళలను పొట్టనబెట్టుకుంటున్న క్యాన్సర్లల్లో సర్వికల్ క్యాన్సర్ కూడా ఒకటి. ఏటా 72వేలమంది మహిళలు ఈ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే 1997-2012 మ‌ధ్య‌కాలంలో నిర్వ‌హించిన సర్వికల్ క్యాన్సర్ పరిశోధనా అధ్యయనాలే అన్యాయంగా 254మంది మహిళల మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌య్యాయి. అధ్య‌యాల‌కోసం వైద్యులు ఎంపిక చేసుకున్న విధానాల్లో వైద్య‌నీతి ఏమాత్రం లేద‌నే విమ‌ర్శ‌ల‌ను ఈ అధ్య‌య‌నాలు మూట‌క‌ట్టుకున్నాయి.

అమెరికాకు చెందిన పరిశోధకుడు, వైద్య నీతి విలువల ప్రతిపాదకుడు అయిన డాక్టర్ ఎరిక్ సుబా ఈ విషయాలను వెల్లడించారు. 1997-2012 మధ్యకాలంలో భారత్‌లో మూడు దీర్ఘకాలిక‌ సర్వికల్ క్యాన్సర్ అధ్యయనాలు జరిగాయి. వీటికి అమెరికాలోని యుఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ , బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చాయి. ఈ అధ్యయనాలను ముంబయిలోని టాటా మెమోరియల్ హాస్పటల్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా ఏజన్సీ నిర్వహించాయి. ఈ పరిశోధనలను వారు 3,63,553మంది మహిళలపై నిర్వహించారు. వీరంతా కూడా ముంబయి మురికి వాడ‌లకు, మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా, తమిళనాడులోని దిండిగల్ జిల్లాలకు చెందిన పేద మహిళలు. ఈ మూడు అధ్య‌య‌నాలు కూడా శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, వీటి నిర్వహణ వైద్య‌నీతి విలువలకు సైతం విరుద్ధంగా ఉందని అంతర్జాతీయంగా వైద్య సంస్థలు గగ్గోలు పెడుతున్నాయని, అయితే భారత్‌లో మాత్రం ఎలాంటి చలనం, స్పందనా లేవని డాక్టర్ సుబా అంటున్నారు.

వీటిపై డాక్టర్ సుబా తీవ్రమైన విమర్శలు చేశారు. సైన్స్ ప‌రిశోధ‌న‌లు, వైద్య‌నీతి విషయంలో 21 శతాబ్దంలోనే అత్యంత పెద్ద మోసంగా ఈ ప‌రిశోధ‌న‌ల ఉదంతాన్ని పరిగణించాల్సి ఉంటుందని ఆయ‌న అన్నారు. ముంబయిలోని కెఇఎమ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రజారోగ్య పరిశోధనల్లో నీతి విలువ‌లు అనే అంశంపై మాట్లాడిన సందర్భంలో సుబా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆ కార్య‌క్ర‌మంలో డాక్టర్ సుబా ఇండియాలో జరిగిన మూడు పరిశోధనలను విశ్లేషిస్తూ ప్రసంగించారు.

అయితే టాటా మెమోరియల్ హాస్పటల్ వైద్యులు మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చుతున్నారు. కానీ డాక్టర్ సుబా ఈ వైద్య పరిశోధనల్లో పేద‌మ‌హిళ‌లు ఎలా ప్రాణాలు కోల్పోయారో వివ‌రించి చెప్పారు. మూడు అధ్య‌య‌నాల‌కోసం ఎంపిక‌చేసిన 3,63,553 మంది మహిళలను రెండు విభాగాలుగా విడగొట్టి ఒక బృందానికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వారిలో సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు కనబడుతున్నాయా అనే విషయంపై పరీక్షలు చేశారు. మరొక బృందానికి ఎలాంటి పరీక్షలు చేయకుండా వదిలేశారు. వారి ఉద్దేశం ఏ బృందంలోని మహిళలు ఎక్కువగా సర్వికల్ క్యాన్సర్ బారిన పడతారో, ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతారో చూడాలని. కానీ అసలు ఇక్కడ ప‌రిశోధ‌న‌కోసం ఎంపిక చేసుకున్న విధాన‌మే పూర్తిగా అర్థరహితంగా ఉందని డాక్టర్ సుబా అంటున్నారు. ఒక భాగం మహిళలకు ఎలాంటి పరీక్షలు చేయకుండా, వారిలో పెల్విక్ కండరాల్లో నొప్పి, ర‌క్త‌స్రావం లాంటి స‌మ‌స్య‌లు క‌నిపించేవ‌ర‌కు వైద్యులు ఉపేక్షించారు. అలాంట‌పుడు స‌హ‌జంగానే ముంద‌స్తు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ని మ‌హిళ‌లు ఎక్కువ‌గా క్యాన్స‌ర్‌ బారిన ప‌డ‌తారు. దీనికోసం ప్ర‌త్యేకంగా అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న అంటున్నారు.

మొత్తం అధ్య‌య‌నంకోసం ఎంపిక చేసిన 3,63,553మందిలో ఎలాంటి ప‌రీక్ష‌లు చేయ‌కుండా వ‌దిలేసిన 1,38, 624మందిలో 254మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే స్క్రీనింగ్ పరీక్ష‌లు చేసిన 2,24,929మందిలో 208మంది క్యాన్స‌ర్‌తో మ‌ర‌ణించారు. త‌మ‌కు క్యాన్స‌ర్‌ని గుర్తించే ముంద‌స్తు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని, అది త‌మ ప్రాణాల‌కే ముప్ప‌ని ఈ అధ్య‌య‌నంలో పాల్గొన్న, వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ని మ‌హిళ‌ల‌కు తెలిస్తే వారు ఇందులో పాల్గొనే వారే కాద‌ని డాక్ట‌ర్ సుబా వాదించారు.

ముంబ‌యిలో ఈ అధ్య‌య‌నం నిర్వ‌హించిన టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ వైద్యుడు డాక్ట‌ర్ రాజేంద్ర‌ ప్ర‌సాద్ మాత్రం, తాము అభివృద్ధి చెందుతున్న‌, వెనుక‌బ‌డిన మ‌హిళ‌ల్లో స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ అధ్య‌య‌నాలు చేశామ‌ని చెబుతున్నారు.

కొంత‌మంది మ‌హిళ‌ల‌ను అస‌లు క్యాన్స‌ర్‌ని గుర్తించే ప‌రీక్ష‌ల‌కు దూరంగా ఉంచి మ‌ర‌ణాల రేటు త‌గ్గించ‌డం ఎలా సాధ్య‌మ‌ని డాక్ట‌ర్ సుబా ప్ర‌శ్నిస్తున్నారు. 2014నుండి ఆయ‌న ప‌లు వైద్య ప‌త్రిక‌ల్లో ఈ విష‌యంపై అనేక వ్యాసాలు ప్ర‌చురించారు. అధ్య‌య‌నాల‌కు నాయ‌క‌త్వం వ‌హించిన వైద్యులు, డాక్ట‌ర్ సుబా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తూ, ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ని బృందంలో ఉన్న మ‌హిళ‌ల‌కు సైతం తాము స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్‌ని గురించిన పూర్తి స‌మాచారం వివ‌రించామ‌ని, వారికి అనుమానం ఉంటే ప‌రీక్ష‌లు చేయించుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

అమెరికా నేష‌న‌ల్ క్యాన్స‌ర్ ఇన్‌స్టిట్యూట్ కూడా అదే స‌మాధానం చెబుతోంది. ఈ సంస్థ ముంబ‌యి అధ్య‌య‌నాల‌కోసం 1997-2014 మ‌ధ్య‌కాలంలో 2.6మిలియ‌న్ డాల‌ర్లను మంజూరు చేసింది.

ఇండియాలో స‌ర్విక‌ల్ క్యాన్స‌ర్ ముంద‌స్తు ప‌రీక్ష‌లు నిర్వ‌హించే జాగ్ర‌త్త చ‌ర్య‌లు లేవ‌ని క‌నుక త‌మ అధ్య‌య‌నంకోసం ఒక గ్రూపు మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డం అనేది నీతిమాలిన ప‌నేమీ కాద‌ని ముంబ‌యి అధ్య‌య‌న నిర్వాహ‌కుల్లో ఒక‌రైన డాక్ట‌ర్ సురేంద్ర శాస్త్రి అంటున్నారు. అయితే వైద్య‌శాస్త్ర నీతిప్ర‌మాణాల‌కు వారి వాద‌న విరుద్ధంగా ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెంద‌ని దేశంలో వైద్య ప్ర‌మాణాలు స‌రిగ్గా ఉండ‌వు కాబ‌ట్టి కొంత‌మంది మ‌హిళ‌ల‌కు క్యాన్స‌ర్ స్క్రీనింగ్ ప‌రీక్ష‌లు చేయ‌కుండా ఉంచ‌డం అనేది వైద్యనీతికే విరుద్ద‌మ‌ని, పేద‌దేశాల్లో వైద్యం స‌రిగ్గా ఉండ‌దు…అనే సూత్రాన్ని అనుస‌రించ‌డ‌మూ స‌రికాద‌ని వైద్య‌శాస్త్ర‌నీతిజ్ఞులు చెబుతున్నారు. వైద్య అధ్య‌యనం కోసం ఎంత‌మంది మ‌హిళ‌లు మ‌ర‌ణిస్తారో చూడ‌టాన్ని కొల‌బ‌ద్ద‌గా ఎంపిక‌చేసుకోవ‌డం ఎంత అర్థ ర‌హిత‌మో, ఎంత నీతిశాస్త్ర విరుద్ధ‌మో చెప్పాల్సిన ప‌నిలేద‌ని డాక్ట‌ర్ సుబా అంటున్నారు.

First Published:  21 March 2016 3:32 AM GMT
Next Story