సెన్సార్‌ బోర్డు ఏమైంది?

అభయ్‌ కిడ్నాప్‌, హత్యకేసులో నిందితులు “ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథా చిత్రం” సినిమా చూశాక, ఆ చిత్రం స్ఫూర్తితో ఈ నేరానికి పాల్పడ్డామని చెప్పారు. హైదరాబాద్‌ పోలీస్‌ ఇటీవల చాలా సమర్ధంగా పనిచేస్తోంది. ఎలాంటి నేరస్తులనయినా వారంరోజుల్లోపల పట్టేస్తున్నారు. అంత చక్కగా పనిచేస్తుండడంవల్లే ఈ నేరస్తులు రెండురోజుల్లో దొరికారు. వాళ్లను పూర్తి సాక్షాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టి, శిక్షపడేలా చేసేందుకు పోలీసులు నేరం తాలూకు పూర్వపరాలన్ని శోధించారు. ఆ క్రమంలోనే వాళ్లు “ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథా చిత్రం” సినిమా చూశాక, ఆ చిత్రం స్ఫూర్తితో ఈ నేరానికి పాల్పడ్డామని చెప్పారు.

కొన్ని నెలల క్రితం నెల్లూరులో ఒక నేరం జరిగింది. తెలంగాణ పోలీసులకు, ఆంధ్రా పోలీసులకు భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అందువల్లే నెల్లూరులో జరిగిన నేరం పూర్వపరాలు బయటకు రాలేదు. బహుశా వాళ్లకు సరియైన శిక్షలు కూడా పడకపోవచ్చు. అయితే అక్కడ నేరం చేసిన కుర్రాళ్లు కూడా చెప్పింది ఒక్కటే. తాము “దండుపాళ్యం” సినిమా చూశాక ఎవరినైనా ఒకళ్లను రేప్‌చేసి మర్డర్‌ చేయాలని బలంగా అనిపించిందని, అందుకే ఆ నేరం చేసినట్టు సమాచారం బయటకివచ్చింది.

ఇప్పడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “గుంటూరు టాకీస్‌” అనే సినిమా ఆడుతోంది. ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఇచ్చిన వాళ్లందరిని వాళ్ల కుటుంబ సభ్యులతో సహా అందరికి కలిపి ఆ సినిమా చూపించాలి. అదే వాళ్లకు శిక్ష.

మనకు మంచి రాజ్యాంగం వుంది. మంచి వ్యవస్థలు వున్నాయి. మంచి చట్టాలూ వున్నాయి. కానీ వాటిని అమలుచేసే యంత్రాంగంలోనే పెద్ద పెద్ద లోపాలున్నాయి. సెన్సార్‌బోర్డులో సభ్యులుగా సినిమా గురించి ఎ,బి,సి,డి లు కూడా తెలియని వాళ్లు ఎక్కువమంది వుంటారు. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవాళ్లలో కొందరికి ఇక ఏ పదవులు ఇవ్వలేక ఈ సెన్సార్‌బోర్డులో సభ్యులుగా వేస్తుంటారు. వీళ్లు ఎలాంటి సినిమాలకైనా సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటారు. అవి ప్రజలమీద ముఖ్యంగా యువతమీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే కనీస జ్ఞానం కూడా వీళ్లకు వుండదు.

ఇప్పుడు యువత వ్యక్తిత్వం పుస్తకాలు చదవడం నుంచి, మేధావుల సాంగత్యం నుంచి, పొలిటికల్‌ క్లాసులనుంచి, రాజకీయ శిక్షణా తరగతులనుంచి, ఫిలాసఫీలనుంచి రూపుదిద్దుకోవడం లేదు. సినిమాలనుంచే వాళ్ల వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాళ్ల జీవితాలకు చుక్కాని, మార్గదర్శకులు ఈ సినిమాలే. ఈ సినిమా హీరోలే. ఇలాంటి సమాజంలో సినిమాల సెన్సార్‌ విధానం చాలా మారాల్సివుంది. సెన్సార్‌బోర్డులో రాజకీయ ప్రమేయం తగ్గి సమాజం గురించి, సినిమాల గురించి అవగాహన వుండేవాళ్లను సెన్సార్‌ బోర్డు సభ్యులుగా నియమించాల్సిన అవసరం ఎంతైనా వుంది.