Telugu Global
Others

"మేము ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం ఇదే మా జేఎన్ యూ ప్రత్యేకత"

( మార్చి 18న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖాలిద్‌ చేసిన ప్రసంగ పాఠం ఇది. ) మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మనలో కొద్ది మందిపై నేరారోపణలు చేసి, వేధించడం ద్వారా మనల్ని దెబ్బతీయొచ్చని, ఉద్యమాన్ని […]

మేము ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం ఇదే మా జేఎన్ యూ ప్రత్యేకత
X

( మార్చి 18న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖాలిద్‌ చేసిన ప్రసంగ పాఠం ఇది. )

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. మనలో కొద్ది మందిపై నేరారోపణలు చేసి, వేధించడం ద్వారా మనల్ని దెబ్బతీయొచ్చని, ఉద్యమాన్ని అణచివెయ్యొచ్చని, అంతకన్నా ముఖ్యంగా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొచ్చgని ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్న కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.

మిత్రులారా! మమ్మల్ని సెక్షన్‌ 124ఏ – సెడిషన్‌ కింద జైలులో పెట్టారు. 1860 నాటి చట్టాన్ని మాపై ప్రయోగించారు. అంటే మమ్మల్ని జైళ్లో వేయడానికి ఈ సోకాల్డ్‌ జాతీయవాదులు ఆంగ్లేయుల వద్దకు వెళ్లక తప్పలేదు! నల్ల ఆంగ్లేయులుగా భగత్‌సింగ్‌ ఆనాడే పేర్కొన్నది బహుశా వీళ్ల గురించే అయ్యుండాలి! అయితే ఇందులో బాధ పడాల్సింది గానీ, సిగ్గు పడాల్సింది గానీ ఏమీ లేదు. నిజానికి స్వాతంత్య్ర సమరయోధులపై, అధికారాన్ని ప్రశ్నించిన వారిపై మోపిన ఆరోపణలను మాపై మోపినందుకు గర్వంగా ఉంది. ప్రజా ఉద్యమాలతో కలిసి నడిచిన బినాయక్‌ సేన్‌, అరుంధతీరారు, ప్రొఫెసర్‌ షేఖ్‌ షౌకత్‌ వంటి గొప్ప వాళ్ల సరసన మా పేర్లు నమోదైనందుకు మేం గర్వపడుతున్నాం. సెడిషన్‌ అంటే అర్థం ‘దేశద్రోహం’ కాదు, ‘రాజద్రోహం’ అని అధ్యక్షుడు కామ్రేడ్‌ కన్నయ్య చాలా బాగా చెప్పారు. నేడున్న ఫాసిస్టు, ప్రజావ్యతిరేక రాజ్యంపై… దళిత, ఆదివాసీ, మైనారిటీ, మహిళా, రైతు, కార్మిక, మానవత్వ వ్యతిరేక రాజ్యంపై మా పోరాటం కొనసాగుతుందని గొంతెత్తి చెబుతున్నాను.

అసలైన నేరస్థులు నేడు అధికారంలో ఉన్నారు. అధికారాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు జైళ్లల్లో ఉన్నారు. జైళ్లల్లో ఉన్న ప్రజలెవ్వరో పరిశీలించండి. మారుతి ఉద్యోగులైతే యూనియన్‌ పెట్టుకుంటామన్నందుకు, ఛత్తీస్‌గఢ్‌ లేదా ఝార్ఖండ్‌కు చెందిన ఆదివాసులైతే జల్‌-జంగల్‌-జమీన్‌ గురించి మాట్లాడినందుకు, దళితులైతే రణవీర్‌సేనకు వ్యతిరేకంగా నిలబడ్డందుకు జైళ్లో పెడతారు. ఇక ముస్లింలైతే జైళ్లో వేయడానికి కారణం కూడా అవసరం లేదు. వీళ్ల పక్షాన నిలబడ్డ పౌరహక్కుల సంఘాల వాళ్లను కూడా జైళ్లలో వేస్తారు. ఆ క్రమంలోనే మమ్మల్నీ కొద్ది రోజులు జైళ్లో వేశారు. ఇప్పుడు బైటికి వచ్చేశాం కనుక అధికారాన్ని వ్యతిరేకిస్తూ జైలు పాలైన వారందరి పోరాటాన్ని ఇక మనం కొనసాగిద్దాం.

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని మనం అంటున్నాం. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. అధికారానికి మీరు ఏ వైపున్నారనే దానిపై ఆధారపడి మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఒకవేళ మీరు ప్రభుత్వానికి అనుకూలమైతే, మోడీ, తొగడియా, యోగీ ఆదిత్యనాథ్‌ వంటి వారి కోవకు చెందిన ఛోటా మోటా నేతలందరికీ కావాల్సినంత భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ప్రజాస్వామిక, పౌర హక్కుల కార్యకర్తలను స్టెన్‌గన్‌లతో కాల్చి చంపాలని బాలా సాహెబ్‌ ఠాక్రే బాహాటంగానే అన్నాడు. ముస్లింలను చంపెయ్యాలన్నాడు. ఆయనపై రాజద్రోహం సంగతి అటుంచి, చిన్న కేసైనా పెట్టలేదు.

నెలాపదిహేను రోజులుగా జరుగుతున్న సంఘటనల్లో మేమేమైనా తప్పు చేశామా అని నేను జైలులో ఉండగా చాలా సార్లు ఆలోచించాను. 9, 10, 11 తేదీల్లో ఏం జరిగిందో ఆలోచించినప్పుడు నాకో సినిమా గుర్తుకొచ్చింది. 1973లో చిలీలో జరిగిన ఫినోషిట్‌ ‘సైనిక కుట్ర’ ఆధారంగా రూపొందిన ‘మిస్సింగ్‌ కోస్తా గావ్రాస్‌’ సినిమాలోని ఒక సంభాషణ గుర్తుకొచ్చింది. ఆ సమయంలో చిలీలో నివసిస్తున్న ఒక అమెరికన్‌ వ్యక్తి కుమారుడు అదృశ్యమవుతాడు. ఆయన ‘నా కొడుకు ఏమీ చెయ్యలేదు కదా అతణ్నెందుకు మాయం చేశార’ని ఒక చిలీ దేశస్థుణ్ని అడుగుతాడు. ఆ వ్యక్తి ఇలా జవాబిస్తాడు, ‘మీ అమెరికన్లతో ఇదే చిక్కు. జైలుకు పోవాలంటే ఏదైనా చేసి తీరాలని మీరనుకుంటారు’. సరిగ్గా నేడు మన దేశం పరిస్థితి కూడా ఇలాగే తయారైంది!

నేను జైషే మహ్మద్‌కు చెందిన వాడినని మొదట నా గురించి ప్రచారం చేశారు. అది ఎక్కువ రోజులు సాగలేదు కానీ ప్రజల మనస్సుల్లో ఒక ముద్రనైతే వేసింది. అయితే ఈ మీడియా విచారణ, ప్రొఫైలింగ్‌ ఫిబ్రవరి 23న మేం సరెండర్‌ అయిన తర్వాత కూడా కొనసాగడం విచిత్రం! రోజుకో కొత్త కథనం సృష్టించసాగారు. ఉదాహరణకు 21న మేం జేఎన్‌యూకి తిరిగొచ్చిన తర్వాత 23న ‘హిందూస్తాన్‌’ అనే పత్రికలో ‘ఉమర్‌ ఖాలిద్‌ ఛత్తీస్‌గఢ్‌-ఒడిషా సరిహద్దు అడవుల్లో నక్సలైట్లతో ఉన్నాడు’ అని రాశారు. ఆ సమయంలో నేను అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ వద్ద కూర్చుని ఉన్నాను. అట్లాగే, కస్టడీలో ఒకరోజు ఒక పోలీసు అధికారి తన ఫోన్లో ఒక ఫోటో చూపించాడు. అందులో నాతో పాటు ఒక జేఎన్‌యూ పూర్వ విద్యార్థి ఉన్నాడు. ‘ఇది మాకు ఐబీ నుంచి వచ్చింది. నీకు నక్సలైట్లతో సంబంధాలున్నాయనడానికి ఇదే రుజువు’ అని ఆ అధికారి అన్నాడు. ఇది తప్పని నేనాయనకు చెప్పాను. మొదటి విషయం మీరు చూపిస్తున్న వ్యక్తి నక్సలైటు కాదు, జేఎన్‌యూ విద్యార్థి. రెండో విషయం ఇది నా ఫేస్‌బుక్‌ పేజీలోంచి తీసుకున్న ఫోటోనే. ఇక ఇంటలిజెన్స్‌ బ్యూరో వాళ్ల ఇంటలిజెన్స్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ మొత్తం వ్యవహారంలో మీడియా పోషించిన పాత్ర ప్రత్యేకించి చెప్పుకోదగినది. మీడియా స్వతంత్రంగా పని చేసిందని నేననుకోను. మీడియాలో ఒక వర్గానికి ఏం ప్రసారం చెయ్యాలనే విషయంలో కచ్చితమైన నిర్దేశాలున్నాయని నా నమ్మకం. ఈ నమ్మకానికి ఆధారాలున్నాయి. చాలా కేసుల్లో ఇలాగే జరిగింది. సాధారణంగా పోలీసులు విచారణ జరిపించి ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ వాస్తవంలో దానికి పూర్తిగా తలకిందులుగా జరుగుతున్నది. ముందు మీడియా విచారణ జరిపిస్తుంది. తర్వాత పోలీసులకు సమాచారం అందజేస్తుంది. దాని ఆధారంగా పోలీసులు ఇంటరాగేషన్‌ చేస్తారు. తర్వాత విచారణ చేపడతారు!

ఇంతకు ముందు నేనిక్కడ మాట్లాడినప్పుడు ఒక మాటన్నాను. గత ఏడేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా భావించలేదని చెప్పాను. కానీ మీడియాలో నన్నొక ఇస్లామిక్‌ టెర్రిరిస్టుగా చూపించారు. నాపై విచారణ మొత్తం ముస్లిం సముదాయంపై జరుగుతున్న విచారణలా అనిపించింది. నన్ను దేశభక్తి గల ముస్లింగా రుజువు చేసుకొమ్మని అడిగారు. కానీ, నేను మతాన్ని ఆచరిస్తున్న ముస్లింను కానంటూ ఇప్పటి దాకా చేసుకుంటున్న డిఫెన్స్‌ ఎదుటి పక్షానికే ఉపయోగపడుతోందని నాకనిపించింది. నేను మతాన్ని ఆచరించే ముస్లింను అయితే మాత్రం ఏమిటి? నేను ఆజంగఢ్‌ వాడినైతే ఏమిటి? మదర్సాలో చదువుకున్న వాడినే అయితే మాత్రం ఏమిటి సమస్య? నేను తలపై టోపీతో, గడ్డం కలిగి వుంటే మాత్రం ఏమిటి సమస్య? మేం జైలులో పోలీసుల భాషలో ‘ఖాలిద్‌ సాబ్‌, భట్టాచార్య జీ’లం! నేను నా పుట్టుక మూలంగానే (నేను మరో రకంగా రుజువు చేస్తే తప్ప) దేశద్రోహిని! కానీ అనిర్బాన్‌ మాత్రం మూడు రెట్లు ద్రోహి! ఆయన ఒక్క దేశానికే కాదు, తన మతానికీ, కులానికీ కూడా ద్రోహం చేసిన వాడు! ఒకసారి ఒక పోలీసు అధికారి అనిర్బాన్‌ను ఒక మూలకు తీసుకెళ్లి, నాకేమీ తెలియదు ఖాలిదే నన్ను ప్రేరేపించాడని చెప్పమని కూడా అన్నాడు.

అసలిదంతా ఎందుకు జరిగింది? ఇది ముఖ్యమైన ప్రశ్న. ఫిబ్రవరి 9న లేదా 10న ఏదో జరిగినందువల్లనే ఇది జరిగిందా? మీలో ఏ ఒక్కరికీ దీనిపై ఎలాంటి భ్రమలు లేవని నేననుకుంటున్నాను. సరిగ్గా చెప్పాలంటే, మనమంతా ఆలోచించే వ్యక్తులం కావడం వల్లనే మనపై ఈ దాడి! మనం ఏ విషయాన్నీ ఉన్నదున్నట్టుగా తీసుకోం. ప్రతి విషయంపైనా మనం తర్కిస్తాం, ప్రశ్నిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం. ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత. మమ్మల్ని జైళ్లో పెట్టడానికి ఇదే కారణం. జర్మనీలో దాదాపు ఇటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు బ్రెV్‌ా్త ఒక కవిత రాశాడు…. ”ఓ జనరల్‌! నీ ట్యాంకు చాలా శక్తిమంతమైందే. అది మనుషుల్ని చంపగలుగుతుంది. అయితే దాని నిర్మాణంలో ఒక లోపం ఉంది. దానికో డ్రైవర్‌, అంటే మనిషి కావాల్సి ఉంటుంది. కానీ మనుషుల్లోనూ ఒక లోపం ఉంది. వాళ్లు ఆలోచిస్తారు!” అవును, మనలో కూడా ఈ ‘లోపం’ ఉంది! కొందరు దీనిని ‘ఇన్‌ఫెక్షన్‌’, ‘రోగం’ అని కూడా అభివర్ణిస్తున్నారు! నిజానికి ఇదే మన బలం!

ఈరోజే ఒక వ్యాసం చదివాను. మన దేశంలో లాన్స్‌ నాయక్‌ హనుమంతప్ప వంటి వీరులు ఒకవైపుంటే, మరో వైపు ఉమర్‌, కన్నయ్య, అనిర్బాన్‌ వంటి వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లను జైళ్లో వేయాలి అని రాశారు. మరి కొందరైతే వీళ్లను ఉరి తీయాలని కూడా అన్నారు. ఈ విషయంపై కన్నయ్య చాలా చక్కగా చెప్పారు. ఇందులో మరొక్క విషయం నేను జోడిస్తాను. సైనికులు పని చేసే ప్రాంతాలు, చేసే యుద్ధాలకు సంబంధించిన నిర్ణయాలు అసలు సైనికులు తీసుకుంటారా? యుద్ధాలకు సంబంధించిన నిర్ణయాలు అధికారంలో ఉన్న కొద్ది మంది చేస్తారు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇంతే. పాలకులు తమ రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే యుద్ధాలకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు. సైనికులను ఆ యుద్ధాల్లో బలిపశువుల్ని చేస్తారు. ప్రపంచయుద్ధాల్లో దేశదేశాల్లో కోట్లాది మంది చనిపోయారని చరిత్రలో మనం చదువుకున్నాం. అంతటా జాతీయవాదం, దేశభక్తి పేరుతోనే వారితో యుద్ధాలు చేయించారు. యుద్ధాలతో ఎవరికీ ఉపాధి గానీ, తిండి గానీ ఏదీ దొరకలేదు. కొన్ని బడా కంపెనీలు మాత్రం దండిగా లాభాలు దండుకోగలిగాయి.

కొన్నేండ్ల క్రితం ప్రత్యేక ఆర్థిక మండళ్లు అనే చట్టం వచ్చింది. ఈ మండళ్లలో విదేశీ కంపెనీలకు మన దేశ కార్మిక చట్టాలు కూడా వర్తించకుండా చేసింది ఈ దేశభక్తులే! ఆదివాసులను జల్‌-జంగల్‌-జమీన్‌ నుంచి బేదఖలు చేయడం కోసం విదేశీ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నదీ వీళ్లే. ఈ సంఘర్షణలో సాయుధ బలగాలు అత్యాచారాలకు పాల్పడ్డాయని పౌరహక్కుల సంఘాలు, వ్యక్తులు విమర్శిస్తే సైనికులను తప్పు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి మేం తప్పు పడుతున్నది సైనికులను కాదు, ప్రభుత్వాన్ని. ఇవ్వాళ సైనికులు పాలక వర్గాల కోసం యుద్ధాలు చేస్తున్నారు కానీ వాస్తవానికి వాళ్ల శత్రువులు, మన శత్రువులు ఒక్కరే – అధికారంలో ఉన్నవారే మన ఉమ్మడి శత్రువులు. మా పోరాటంలో భాగం కావాలని మేం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.

మనపై ముందస్తుగా ఏర్పర్చుకున్న తప్పుడు అభిప్రాయాలు చాలా బలంగా పని చేస్తున్నాయి. జేఎన్‌యూ వాళ్లు బావిలోని కప్పలని మమ్మల్ని అన్నారు. మనం జేఎన్‌యూ నాలుగు గోడలనే ప్రపంచంగా భావిస్తామట! కానీ ఈ జేఎన్‌యూ నాలుగు గోడల మధ్యే నేను గత ఏడేండ్లలో వేర్వేరు ప్రజా ఉద్యమాల గురించి తెలుసుకోగలిగాను. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషాలలో నిర్మాణమవుతున్న పోలవరం డ్యాంతో 400 ఆదివాసీ గ్రామాలు ముంపుకు గురవుతాయని నేను తెలుసుకున్నది ఈ యూనివర్సిటీలోనే. నాకు సల్వాజుడుం గురించి, మైనారిటీలపై దాడుల గురించి, కుల సైన్యాల నరమేధాల గురించి తెలిసిందంటే అది ఈ విశ్వవిద్యాలయం వల్లనే. అంతేకాదు, దేశంలోని సమరశీల ప్రజలకు ఈ విశ్వవిద్యాలయం గేట్లు ఎప్పుడూ స్వాగతం పలికాయి. 1984లో సిఖ్కులను వేటాడి చంపుతుంటే ఈ క్యాంపస్‌ తన నాలుగు గోడల మధ్య వారికి రక్షణ కల్పించింది. ఇదీ ఈ క్యాంపస్‌, విద్యార్థి ఉద్యమాల చరిత్ర.

మిత్రులారా! దేశద్రోహులు, దేశద్రోహులంటూ అంటూ ఇల్లెక్కి అరుస్తున్న మీడియా దేశంలోని వివిధ రాష్ట్రాలలో, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలలో కార్మిక చట్టాలను కాలరాస్తుంటే దానిపై ఏనాడూ ప్రైమ్‌ టైం డిబేట్‌ నిర్వహించలేదు. ఆదివాసుల బతుకుల గురించి మీడియా ఏనాడూ ప్రైమ్‌ టైం డిబేట్‌ చెయ్యలేదు. విద్యార్థులు ఫెలోషిప్‌ కోల్పోతే ఏం జరుగుతుందనే అంశం కూడా ఏనాడూ ప్రైమ్‌ టైం చర్చకు నోచుకోలేదు.

ఈ దేశంలో నల్ల చట్టాలున్నాయి. యూఏపీఏ వాటిలో ముఖ్యమైంది. మాపై ఆ కేసు కూడా పెడతామని బెదిరించారు. అందులో కేవలం ఆలోచనను కలిగి ఉన్న కారణంగా కూడా జైలులో వేయవచ్చు. మీరు ఏ చర్యకు పాల్పడకపోయినప్పటికీ మీకు ఉద్దేశం ఉంటే చాలు జైలులో పెట్టొచ్చని ఈ చట్టం చెబుతుంది. ఉద్దేశాన్ని కొలిచే యంత్రాలైతే లేవు కానీ పోలీసులకు మాత్రం అది ముందే అర్థమవుతుంది! ఉదాహరణకు మీరు రేపు బాంబు పేల్చబోతుండగా ఈరోజే అరెస్టు చేశామని చెప్పవచ్చు… మేం కూడా ఇలాంటివి ఎదుర్కొన్నాం. మొదటి రోజు ప్రాసిక్యూషన్‌ వాళ్లు అఫ్జల్‌ గురూ, మక్బూల్‌ భట్‌లతో ఉమర్‌, అనిర్బాన్‌లకున్న సంబంధాన్ని శోధించాలని అన్నారు. ఒక బతికున్న వ్యక్తికి చనిపోయిన వ్యక్తులతో సంబంధం ఎలా ఉంటుందో వారికే తెలియాలి! పైగా మక్బూల్‌ భట్‌నైతే మేం పుట్టక ముందే ఉరితీశారు.

మనం జేఎన్‌యూలో ‘భారత్‌ కీ బర్బాదీ’ (భారతదేశ వినాశనం) నినాదాలు చేశామని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బాగా బాధపడ్డాయి. ఆ నినాదాన్ని మేం ఖండిస్తున్నాం. అది మా నినాదం కానే కాదు. అయితే ఇందులో బీజేపీ బాధపడాల్సిందేముంది? బహుశా ఈ పని చేయాల్సిన కాంట్రాక్టు తమది కాబట్టి వేరే వాళ్లెందుకు ఇందులోకి దిగారనేది బీజేపీ బాధ అయ్యుంటుంది! దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు ఉన్నంత కాలం ఈ దేశాన్ని వేరే ఎవ్వరూ నాశనం చేయలేరు! మేం ఈ దేశ వినాశనం కోసం కాదు, దేశ ప్రజల కోసం పోరాడుతున్నాం. మా పోరాటం ‘సంఫ్‌ు’ నాశనమయ్యే దాకా తప్పక కొనసాగుతుంది! ఎందుకంటే సంఫ్‌ు నాశనమైతే తప్ప దేశం బాగుపడదు.

నిన్న నరేంద్ర మోడీ ప్రపంచ సూఫీ ఫోరంలో మాట్లాడారు. మేం శాంతి కోసం నిలబడ్డామని అన్నారు. నిజమే, మీరు స్మశానశాంతి కోసం నిలబడ్డారు! మీరు అణచివేత చర్యలను కొనసాగిస్తుంటే ప్రజలు మౌనంగా భరించే శాంతి గురించే కదా మీరు చెబుతున్నారు? ఆదివాసులను వాళ్ల జల్‌-జంగల్‌-జమీన్‌ల నుంచి తన్ని తరిమేసినా వాళ్లు శాంతియుతంగా దాన్ని భరించాలి! మీరు దళిత బస్తీలను కాలబెట్టినా వాళ్లు నోళ్లు మూసుకొని ఉండిపోవాలి. మీరు ముస్లింలపై బూటకపు కేసులు పెట్టినా, అల్లర్లలో చంపేసినా వాళ్లు దీన్ని శాంతియుతంగా స్వీకరించాలి. అయితే మేమీ శాంతిని భంగం చేయాలనే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే న్యాయం లేకుండా శాంతి ఉండదు. మేం పోరాడుతున్నది ప్రజలందరికీ న్యాయంతో కూడిన శాంతి కావాలనే.

ఆంధ్రప్రదేశ్‌లో 1980లలో ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నించినందుకు పౌరహక్కుల కార్యకర్తలను హత్య చేశారు. షాహిద్‌ ఆజ్మీని ఆయన చేసిన పోరాటం కారణంగానే హత్య చేశారు. ఇంకా వేర్వేరు రకాల దాడుల్లో బలైన వందలాది మందిని మేం మర్చిపోలేదు. నోరు తెరిస్తే చంపేస్తామని వేర్వేరు రూపాల్లో మనల్ని బెదిరిస్తున్నారు. ‘జీవితం చనిపోనీ గాక, కానీ చావును మాత్రం చావనివ్వొద్దు’ అని మార్క్స్‌ అన్నాడు. ఇది నిజం! మనం ఇలా మాట్లాడితే దీని పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చు. కానీ మాట్లాడకుండా ఉండడమంటే అదొక వ్యర్థ జీవితం. మేం సంఫ్‌ు పరివార్‌ మొత్తానికి స్పష్టం చేస్తున్నాం. ఇకపై మేం పోరాటాల్ని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోతామని, బుద్ధిగా చదువుకుంటామని మీరు భావిస్తే పొరబడ్డట్టే. ప్రతి పోరాటంలో మేం ముందు వరుసలోనే నిలబడతాం. మీరు మమ్మల్ని 20-25 రోజులు జైలులో పెట్టడం ద్వారా మా భుజాలపై మరిన్ని బాధ్యతల్ని మోపారు. వాటిని నిర్వర్తిస్తాం. మనిషిని మరో మనిషి దోచుకునే వ్యవస్థ ఉన్నంత వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని భగత్‌సింగ్‌ చెప్పాడు. ఇక ‘ఈ దేశానికి అతి పెద్ద ప్రమాదం హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న వారితోనే’ అని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అన్నాడు.

మిత్రులారా! మనం ఇప్పటి వరకు ఎదుర్కొన్నది తక్కువే. దేశంలోని మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న వాటితో పోల్చితే ఇవి లెక్కలోకే రావు! మనల్ని బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపెయ్యలేదు. అక్రమ నిర్బంధంలో ఉంచలేదు. మనపై శారీరకంగా చిత్రహింసలకు పాల్పడలేదు. ఇండ్లను కాలబెట్టలేదు. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ‘సంక్షోభ సమయాలు ప్రజలను దెబ్బ తీస్తాయనేది నిజమే కానీ అవి కొన్నింటిని కొత్తగా సృష్టిస్తాయి’ అని లెనిన్‌ అన్నాడు. ఈరోజు ఆ బాధ్యత మనపై ఉంది. రానున్న రోజుల్లో మనం ‘హై లెవల్‌’ ఎంక్వైరీ కమిటీకి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. రాజద్రోహం ఆరోపణలను కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాడాలి. వీటితో పాటు హింసకు తావు లేని సమాజాన్ని నిర్మించే పోరాటాన్ని చివరకంటా కొనసాగిద్దాం… ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!

అనువాదం : జి.వి.కె.ప్రసాద్‌
(నవతెలంగాణ సౌజన్యంతో)

First Published:  22 March 2016 5:32 AM GMT
Next Story