Telugu Global
Others

ఇది విద్యార్థుల వసంతం

(మార్చి 18న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నేత అనిర్బాన్‌ భట్టాచార్య చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఇది.) సహచరులారా! మేం జైలుకు వెళ్లడంతో ఇక్కడ జరిగిన చాలా సమావేశాలను మిస్సయ్యాం. జైలులో ఉన్నప్పుడు టీవీల్లో, పత్రికల్లో భారీ సంఖ్యలో మిమ్మల్ని చూస్తుంటే మేం కూడా ఉండి ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుండేది… కన్నయ్య విడుదల రోజైతే మరీ… మీ అందరికీ, దేశంలోని ప్రజాస్వామ్యవాదు లందరికీ, ప్రపంచవ్యాప్తంగా మనతో సంఘీభావం ప్రకటించిన వారందరికీ […]

ఇది విద్యార్థుల వసంతం
X

(మార్చి 18న మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నేత అనిర్బాన్‌ భట్టాచార్య చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఇది.)

సహచరులారా! మేం జైలుకు వెళ్లడంతో ఇక్కడ జరిగిన చాలా సమావేశాలను మిస్సయ్యాం. జైలులో ఉన్నప్పుడు టీవీల్లో, పత్రికల్లో భారీ సంఖ్యలో మిమ్మల్ని చూస్తుంటే మేం కూడా ఉండి ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుండేది… కన్నయ్య విడుదల రోజైతే మరీ… మీ అందరికీ, దేశంలోని ప్రజాస్వామ్యవాదు లందరికీ, ప్రపంచవ్యాప్తంగా మనతో సంఘీభావం ప్రకటించిన వారందరికీ నేను కేవలం కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టుకోవడం లేదు. అలా చెప్పి వాళ్ల పాత్రను తగ్గించలేను. వాళ్లు సత్యం వైపు, అసత్యానికి విరుద్ధంగా నిలబడ్డారు. న్యాయం వైపు, అన్యాయానికి విరుద్ధంగా నిలబడ్డారు. పోరాటం వైపు, ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ రాజకీయ బాధ్యతను భుజాల పైకెత్తుకున్న మీ సాహసానికి జై భీం, లాల్‌ సలాం చెబుతున్నాను.

ఉమర్‌ చెప్పినట్టుగా, ఈ నెలాపదిహేను రోజుల సమ యంలో జరిగిన సంఘటనల్లో వాస్తవమైనవేవీ, అధివాస్తవి కమైనవేవీ, కుళ్లువి ఏవీ అనే తేడాను గుర్తించడం కష్టమైంది…. ఉమర్‌ చెప్పినట్టుగా, అసలిది 9 ఫిబ్రవరికి సంబంధించిన విషయం కానే కాదు. 9న నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి 10 మంది ‘మాస్టర్‌మైండ్స్‌’ అని అన్నారు! మాస్టర్‌మైండ్స్‌ అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తారో మనందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ముస్లింలను వేధించడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇప్పటి వరకూ మనం ఈ పదాన్ని బాంబు పేలుళ్లు, టెర్రర్‌ కేసులు, ఏకే-47, ఆర్‌డీఎక్స్‌ వంటి వాటితో జోడించి ఉపయోగించడాన్ని చూశాం! కానీ ఒక సాంస్కృతిక కార్యక్రమానికి మాస్టర్‌మైండ్స్‌ ఉంటారని మొదటిసారి వింటు న్నాం. ‘ఎ కంట్రీ విదౌట్‌ ఎ పోస్ట్‌ ఆఫీస్‌’ వెనుక వీళ్లు మాస్టర ్‌మైండ్స్‌ అని మమ్మల్ని అన్నారు. పాటలతోనే బాంబుల్ని పేల్చుతా మని అనుకున్నారో ఏమో తెలియదు! ఎంత పిచ్చి మాటలివి! అయితే ఈ పిచ్చితనానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఈ అధివాస్తవిక విషయాల వెనుక కొంత వాస్తవికత కూడా ఉంది.

ముఖ్యంగా ఉమర్‌ ఖాలిద్‌ గురించి ఎన్ని ఆరోపణలు చేశారు! జైషే మహ్మద్‌… మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లాడు… గల్ఫ్‌కు ఫోన్‌ చేశాడు.. 800 కాల్స్‌ చేశారు. హవాలా ద్వారా డబ్బులు ముట్టాయి… ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్నాడు. ఇవన్నీ వింటుంటే ఒక్కోసారి నవ్వొచ్చేది. ఒక్కోసారి నిరాశ కలిగేది. కొన్ని సార్లు కోపమొచ్చేది. ఇంటరాగే షన్‌లోనూ, బైటా చాలా రకాలు గా మాట్లాడారు. ‘ఖాలిద్‌ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ మీరెందుకు ఇందులోకి దిగారు భట్టాచార్య గారూ’ అని పోలీసులు నన్నడిగారు. అతను ముస్లిం కావడం వల్లనే ఇట్లా మాట్లాడుతున్నారా అని అడిగితే, మేమా మాట అనలేదే అనే వాళ్లు. ఖాలిద్‌ మూడు సార్లు పాకిస్తాన్‌ వెళ్లాడనే స్టోరీ అమ్ముడుపోతుంది కానీ భట్టాచార్య పాకిస్తాన్‌కు మూడు సార్లు వెళ్లొచ్చాడనే స్టోరీని ఎవరూ కొనరు! వాళ్లకు కావాల్సింది కథనాలు అమ్ముడుపోవడం! అందుకే ఒకరిని మించి అబద్ధాలు ప్రసారం చేశారు.

కస్టడీలో మాపై శారీరకంగా ఎలాంటి హింస జరగలేదు. కానీ ఒకవేళ ఉమర్‌ మదర్సాలో చదువుకున్న వాడయి వుంటే, ఆజంగఢ్‌ వాసి అయి ఉంటే, ఒకవేళ మేమిద్దరం ఆజంగఢ్‌కు చెందిన వాళ్లం అయి ఉంటే మాతో స్పెషల్‌ సెల్‌ అధికారులు ఎలా వ్యవహరించే వాళ్లు? అప్పుడు మా పక్షాన ఎంత మంది నిలబడేవాళ్లు? ఇలా ప్రశ్నించుకుంటే ఆందోళన కలుగక తప్పదు. బహుశా మనందరం ఈ ప్రశ్నను ఎవరికి వాళ్లం వేసుకోవాలి. ఎందుకంటే రేపెప్పుడైనా ఆజంగఢ్‌కు చెందిన యువకుడిని పట్టుకెళ్లినా మనం ఈ ఐక్యతను ప్రదర్శించగలగాలి.

జాతీయవాదం, జాతివ్యతిరేకత గురించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. మేం రహస్యంగా ఉన్నప్పుడు, జైలులో ఉన్నప్పుడు దినపత్రికలు చదివేవాళ్లం, టీవీ చూసేవాళ్లం. కొన్ని విషయాలు చాలా బాధ కలిగించేవి. కొన్ని సార్లు నవ్వు కూడా వచ్చేది. ఎవరు జాతీయవాదం గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని జాతివ్యతిరేకులని అంటున్నారు? బుందేల్‌ఖండ్‌ సహా దేశంలోని 50 శాతం ప్రాంతాల్లో తీవ్రమైన కరవు నెలకొంది. ఈ కరవుకాటకాల మధ్యే బుందేల్‌ఖండ్‌లో బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్‌ పెట్టించారు. చానల్‌ మారిస్తే అన్నింటికన్నా చౌకైన మొబైల్‌ ఫోన్‌ 251 రూపాయలకే ఇస్తామన్న వార్త వస్తోంది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అని అంటున్నారు కానీ ఇది తయారయ్యేది చైనాలోనట! దానికి త్రివర్ణ పతాకం లోగోను జోడించి చైనా వాటిని విడుదల చేస్తోంది. ఇదీ జాతీయవాదం అంటే! బుందేల్‌ఖండ్‌ పిల్లల కడుపులు మాడ్చి 251 రూపాయలకు మొబైల్‌ ఫోన్లు అందించడం జాతీయవాదమైతే బహుశా మేం జాతివ్యతిరేకులమే! మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కరవు మూలంగా రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వాళ్ల కుటుంబాలు ఆకలి మంటలతో అలమటిస్తున్నాయి. చానల్‌ మారిస్తే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ స్టేజిపై మంటలు వ్యాపించాయన్న వార్త కనిపిస్తుంది.

కానీ ప్రభుత్వం ఈ మంటల గురించి మాత్రమే సిగ్గుపడుతోంది. మన దేశభక్తులు పేదల ఆకలి మంటలను సిగ్గు పడాల్సిన విషయంగా భావించడం లేదు. ఇదే జాతీయవాదానికి నిర్వచనమైతే బహుశా మేం జాతివిద్రోహులమే. మేం సరెండర్‌ అయిన రోజు రాత్రి ఒక ముస్లిం పోలీసు కానిస్టేబుల్‌ను బట్టలు చింపేసి నగంగా రోడ్లపై ఊరేగించారని మహారాష్ట్ర నుంచి ఒక వార్త వచ్చింది. ‘జై భవానీ’ అనాలంటూ ఆయనపై దౌర్జన్యం చేశారు. కొందరు దీనిని జాతీయవాదమని అంటున్నారు. నలుగురు క్రిశ్చియన్‌ సన్యాసినులను రేప్‌ చేసినప్పుడు వీహెచ్‌పీ వాళ్లు ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేసినట్టు మనం విని ఉన్నాం. కొంత మంది దృష్టిలో ఇదే జాతీయవాదం! రోహిత్‌ వేములపై జాతివ్యతిరేకి అనే ముద్ర వేసి, బూటకపు విచారణలు జరిపించి, మృత్యువు అంచుల్లోకి నెట్టేసి హత్య చేసిన సంఘటన కూడా జాతీయవాదం పేరుతోనే జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న దంపతులను పట్టుకొని పట్టపగలే హత్య చేసిన ఘోరం భారతీయ సంస్కృతి రక్షణ పేరుతోనే జరిగింది. ఇదంతా జాతీయవాదమే అయితే, మేమందరం జాతివ్యతిరేకులమే!

దేశంలో ఇప్పుడు ఓఎల్‌ఎక్స్‌ రాజ్యం నడుస్తోంది! అన్నీ అమ్మెయ్యండి! ఖనిజ సంపదను, విద్యను, భూముల్ని… ఆఖరుకు నిజాయితీని అమ్మెయ్యండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ అమ్ముడుపోతాయి. ఈ ఓఎల్‌ఎక్స్‌ రాజ్యం జాతీయవాదమైతే మేమంతా జాతి వ్యతిరేకులమే. వాడేసిన కండోమ్‌లను లెక్క బెట్టడం, గుర్రాన్ని చితకబాదికాలు విరగ్గొట్టడం జాతీయ వాదమైతే మేమందరం జాతి వ్యతిరేకులమే. మిత్రులారా! ఈ దేశంలో కొంత మంది తమ దేశభక్తిని ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అనే నినాదంతో చాటుకుంటారు. మరి కొందరు ‘జై భీం’ అంటారు. మరి కొందరు ‘జై హింద్‌’ అంటూ తమ దేశభక్తిని వెల్లడి చేస్తారు. కానీ కేవలం ‘భారత్‌ మాతా కీ జై’ అంటేనే దేశభక్తి, మిగతావన్నీ కాదని అంటే మేమొప్పుకోం.

దేశంలో జరుగుతున్న సంఘటనలపై రక్తం మరిగిపో తోందని అని మీడియాలో పదే పదే గగ్గోలు పెడుతున్నారు. అయితే వారికి మాదో ప్రశ్న. మీ రక్తం ఎప్పుడు మరుగుతుంది, ఎప్పుడు మరుగదు అనే విషయాల్ని నిర్ణయించేదెవ్వరు? గుజరాత్‌లో, హాషింపురాలో, ముజఫర్‌నగర్‌ లో ముస్లింలను ఊచకోత కోసినప్పుడు మీ రక్తం మరగలేదెం దుకు? శంకర్‌బిఘ హలో, బథానీటోలలో, చుండూరులో దళితులను ఊచకోత కేసినప్పుడు మీ రక్తం ఎందుకు మరగలేదు? సార్కిన్‌గూడ, ఎడస్‌మెట్టలో చీకటి వేళ 30-35 మంది ఆదివాసులను చుట్టుముట్టి కాల్చి చంపేస్తే మీ రక్తం మరగకపోవడానికి కారణమేమిటి? కునాన్‌ పాష్‌పోరా సంఘటనలు జరిగి నప్పుడు గానీ, ఇంఫాల్‌లో మహిళలు వివ స్త్రలుగా మారి ‘భారతీయ సైనికులారా మమ్మ ల్ని రేప్‌ చేయండి’ అనే బ్యానర్‌ను తమ దేహాలపై ఆచ్ఛాదనగా అడ్డం పెట్టుకున్నప్పుడు మీ రక్తం ఏ మాత్రం మరగలేదు కదా? పట్ట పగలే కల్బుర్గిని, పన్సారేను, దాభోల్క ర్‌ను, గంటి ప్రసాదాన్ని కాల్చి చంపేస్తే, కత్తులతో నరికేస్తే అప్పుడూ మీ రక్తం మరగలేదు. దేశంలో 77 శాతం మంది ప్రజలు రోజుకు 20 రూపాయలకన్నా తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తుంటే మీ రక్తం ఏనాడూ మరగలేదు. మహిళలకు గౌరవంగా బతికే హక్కు సంగతి అటుంచి, వాళ్లను ఇండ్లలోనే ఉండిపొమ్మని ఆర్‌ఎస్‌ఎస్‌ మాట్లాడుతుంటే వీళ్ల రక్తం అస్సలుకే మరగదు! రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కార్మికులు కనీసం యూనియన్‌ కూడా పెట్టుకోలేకపోతుంటే వీళ్ల రక్తం మరుగదు. దేశభక్తులారా! అసలు మీ రక్తం మరిగే స్థానం ఎంత? ఎంత ఉష్ణోగ్రత కావాలో చెప్పండి!

జేఎన్‌యూ వాళ్లు రాజ్యాంగానికి వ్యతిరేకులనేది మీడియాలో జరిగిన మరో ప్రచారం. రాజ్యాంగం వైపు ఉన్న వాళ్లెవరు? రాజ్యాంగానికి వ్యతిరేకులెవరు? అనేవి క్లిష్టమైన ప్రశ్నలు. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం, సార్వభౌమిక రిపబ్లిక్‌, లౌకికవాద రిపబ్లిక్‌ గురించి రాజ్యాంగం చెబుతుంది. హిందూత్వ పేరుతో నరమేధాలకు పాల్పడే వాళ్లు లౌకికవాదాన్ని పరిరక్షిస్తున్నారట! వాళ్లు రాజ్యాంగాన్ని కాపాడుతున్నారట! దేశంలోని ఖనిజ సంపదను విదేశాలకు తెగనమ్మే వాళ్లు సార్వభౌమత్వం గురించి మాట్లాడుతున్నారు! కాషాయ ధ్వజధారులైన ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లే ప్రజాస్వామ్యానికి అతి పెద్ద శత్రువులని అంబేద్కర్‌ ఆనాడే గుర్తించగా, తాము రాజ్యాంగ సమర్థకులమని వాళ్లు మాట్లాడుతున్నారు.

కేవలం పుస్తకాన్ని ముట్టుకొని ప్రమాణం చేస్తే దానికి కట్టుబడి ఉన్నట్టు కాదు.

రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, సోషలిజం, రిపబ్లిక్‌… ఇవన్నీ ఉత్త మాటలు కాదు, భావాలు! ఈ భావాల కోసం మనం పోరాడి తీరాలి. ప్రజాస్వామ్యం కోసం, లౌకికవాదాన్ని పటిష్టం చేయడం కోసం, సోషలిజం సాధన కోసం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం మనం పోరాడుతున్నాం. ఆదివాసుల, దళితుల, మైనారిటీల, కార్మికుల, రైతుల, దేశంలోని పీడిత ప్రజలందరి మౌలిక రాజ్యాంగ హక్కుల కోసం మనమే పోరాడుతున్నాం. అయితే, రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ అంబేద్కర్‌ పార్లమెంటు భవనంలో చెప్పినట్టుగా, మనమొక వైరుధ్యాల శకంలోకి ప్రవేశించాం. పుస్తకాల్లో పేర్కొన్న చట్టాల ప్రకారం అందరికీ రాజకీయ సమానత్వం ఉంది. కానీ సమాజంలో మాత్రం అది లేదు. ఈ వైరుధ్యాలున్నంత కాలం పోరాటం కొనసాగించాల్సి ఉంటుం ది. మనం చేసేది ఆ పోరాట మే. మనం ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నాం. మార్క్సిస్టు లుగా కేవలం రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల కోసం మాత్రమే కాదు, దాని పరిధిని దాటి కూడా మనం పోరాడుతున్నాం. ఎందుకంటే మార్క్సిస్టులుగా గెలిచేందుకు ఈ ప్రపంచం ఉందని మనం విశ్వసిస్తాం. కాబట్టి కేవలం పుస్తకంపై చేయి పెట్టి ప్రమాణం చేసినంత మాత్రాన కాషాయ దళం వారు రాజ్యాంగానికి బద్ధులై ఉన్నట్టు కాదు.

ఖనిజ సంపదను, విద్యను, భూముల్ని… ఆఖరుకు నిజాయితీని అమ్మెయ్యండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ అమ్ముడుపోతాయి. ఈ ఓఎల్‌ఎక్స్‌ రాజ్యం జాతీయవాదమైతే మేమంతా జాతి వ్యతిరేకులమే.

జేఎన్‌యూపై దాడి జరిగింది ఎందుకంటే మనం ఈ హక్కు లన్నింటి గురించి మాట్లాడతాం కాబట్టి. మనం ఆలోచిస్తాం.. మనం గొంతెత్తుతాం… మనం మార్పు గురించి మాట్లాడతాం… మెరుగైన సమాజం కావాలంటాం… అందుకే మనపై దాడి జరిగింది. జేఎన్‌యూలో మనం మొట్టమొదట నేర్చుకునే మౌలిక విషయం ప్రశ్నించడం. మనం విభేదాల్ని కలిగి ఉండటాన్ని నేర్చుకుంటాం. విభేదించడం నేర్చుకుంటాం. విమర్శనాత్మకతను నేర్చుకుంటాం. మనలో మనం చాలా ఘర్షణ పడతాం. మీడియా వాళ్లు మన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌కు వస్తే తెలుస్తుంది. ఇక్కడ పరస్పరం భుజం కలిపి నడుస్తున్న వాళ్లం ఎలా ఘర్షణ పడతామో కనిపిస్తుంది. మనం పరస్పరం చాలా తీవ్రంగా విభేదిస్తాం. అయితే ఇలా విభేదించడాన్ని సహించమని ఎవరైనా అంటే మాత్రం మనమంతా ఒక్కటిగా నిలబడతాం. 9 ఫిబ్రవరి తర్వాత పాలకులు ఇలాంటి దుస్సాహసానికే పాల్పడ్డారు.

మనం ఈ విమర్శనాత్మకతను మన అధ్యాపకుల నుంచి, తోటి విద్యార్థుల నుంచి, సమాజం నుంచి నేర్చుకున్నాం. ఈ విమర్శనాత్మకతే మమ్మల్ని మీ యంత్రంలో విడిభాగాలుగా మారిపోకుండా నిరోధిస్తుంది. మీ గోడల్లో ఇటుకల్లో మారకుండా, మీ కల్లబొల్లి మాటలకు మోసపోకుండా కాపాడుతుంది. ఈ విమర్శనాత్మకతే మమ్మల్ని యదాతథ స్థితిని బద్దలు కొట్టే చైతన్యమూర్తులుగా మలుస్తుంది. ఇదే మనకు మెరుగైన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడాన్ని నేర్పిస్తుంది.

ఈ విమర్శనాత్మకత వల్లనే ఈ విశ్వవిద్యాలయం ఒక వినూత్నమైన, విలక్షణమైన, సమ్మిళితత్వ ప్రవేశ విధానాన్ని కలిగి ఉంది. దేశంలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల నుంచి, సముదాయాల నుంచి విద్యార్థులు రాగలుగుతున్నారంటే దీనికి కారణం ఈ విధానమే. ఇది మనం పోరాడి సాధించుకున్న విధానం. ప్రభుత్వం దయతో ఇచ్చింది కాదు. ఇక్కడి విద్యార్థులం, అధ్యాకులం కలిసి నిర్ణయించిన విధానం ఇది. ఇక్కడ ఫీజులు తక్కువ. అందుకే ఇక్కడికి పేద, దళిత, ఆదివాసీ విద్యార్థినీవిద్యార్థులు రాగలుగుతున్నారు. మహిళలకు ఇక్కడ ప్రవేశానికి అదనపు పాయింట్లు ఉంటాయి. అందుకే ఇక్కడి విద్యార్థులలో 60 శాతం మహిళలున్నారు. వాళ్లు రాత్రి 3 గంటలకు కూడా ఇక్కడి రోడ్లపై తిరుగుతారు, చర్చిస్తారు. వీరిని మీరు జాతి వ్యతిరేకులంటారా? విమర్శనాత్మకతతో మేం సాధించిన విజయాలను మీరు జాతి వ్యతిరేకత అంటారా? ఈ విమర్శనాత్మకత వల్లనే మేం ఎమర్జెన్సీ నాటి నుంచి 16 డిసెంబర్‌ (నిర్భయ సంఘటన) దాకా మేం న్యాయం కోసం పోరాడాం, పోరాడుతున్నాం. కాశ్మీర్‌ నుంచి పాలస్తీనా దాకా అన్ని అంశాలపై మాట్లాడుతున్నాం. స్వయంనిర్ణయాధికార హక్కు గురించి మాట్లాడుతున్నాం. దీని వల్లనే మేం రోహిత్‌ హత్యను వ్యతిరేకించాం. ఖైర్లాంజీకి, బథానీటోలకు వ్యతిరేకంగా నిలబడ్డాం. ఈ విమర్శనాత్మకత వల్లనే మేం పాలకుల ముఖం మీదే నిజాలు మాట్లాడడానికి భయపడం. దీన్ని మేం కొనసాగిస్తాం.

విమర్శనాత్మకతే మమ్మల్ని మీ యంత్రంలో విడిభాగాలుగా మారిపోకుండా నిరోధిస్తుంది. మీ గోడల్లో ఇటుకల్లో మారకుండా, మీ కల్లబొల్లి మాటలకు మోసపోకుండా కాపాడుతుంది. ఈ విమర్శనాత్మకతే మమ్మల్ని యదాతథ స్థితిని బద్దలు కొట్టే చైతన్యమూర్తులుగా మలుస్తుంది. ఇదే మనకు మెరుగైన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించడాన్ని నేర్పిస్తుంది.

ఇది కేవలం జేఎన్‌యూకు సంబంధించిన విషయం కాదని మనందరికీ తెలిసిందే. ఈరోజు పార్లమెంటులో విపక్ష నేతలకు సైతం విద్యార్థులం వివిధ అంశాలను అందిస్తున్నాం. రోహిత్‌ వేముల, జేఎన్‌యూ, ఎఫ్‌టీఐఐ, అలహాబాద్‌, జాదవ్‌పూర్‌… విద్యార్థులమే నిజమైన ప్రతిపక్షంగా ఉన్నాం నేడు. ఇది విద్యార్థి వసంతమని నేనంటాను! మనందరం ఇలాగే అనాలి. ఇది దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈరోజు దళిత, ఆదివాసీ, మైనారిటీ, పీడిత జాతుల, కార్మిక, కర్షకుల పక్షాన నిలబడింది విద్యార్థి శక్తి. అధికారానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడింది విద్యార్థి శక్తి. ఈ గొంతుకల్ని గుర్తు పట్టండి. ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ఒ.పి. శర్మ, విక్రం చౌహాన్‌లకు వ్యతిరేకంగా, అర్నాబ్‌ గోస్వామికి వ్యతిరేకంగా, జీ (ఛీ) న్యూస్‌కు వ్యతిరేకంగా, దీపక్‌ చౌరాసి యాకు వ్యతిరేకంగా, బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా, రోహిత్‌ హత్యకు వ్యతిరేకంగా… జేఎన్‌యూ నిలబడింది. జేఎన్‌యూ ఒంటరిగా లేదని కూడా మీ అందరికీ తెలుసు! రోహిత్‌ వేముల మనకు తన జీవితంలోనే కాదు, మరణంలో కూడా నేర్పి వెళ్లిన పోరాటాన్ని మనం కొనసాగిస్తున్నాం. ఏ కారణాల వల్ల రోహి త్‌ను జాతివ్యతిరేకి అని అన్నారో, అవే కారణాలతో జేఎన్‌యూను కూడా నిందిస్తే మనం పోరాటం ద్వారా ఐక్యంగా ఎదుర్కొన్నాం. ‘స్టాండ్‌ విత్‌ జేఎన్‌యూ’, ‘జస్టిస్‌ ఫర్‌ రోహిత్‌’ రెండు నినాదాలు ఒక్కటిగా ప్రతిధ్వనించాయి. ఇది మన ఐక్యతకున్న శక్తి. ఇది కొనసాగుతుంది!.

అనువాదం – జి.వి.కె. ప్రసాద్‌
(నవతెలంగాణ సౌజన్యంతో)

First Published:  23 March 2016 1:22 AM GMT
Next Story