Telugu Global
International

ఆత్మాహుతి దాడి చేసింది అన్న‌ద‌మ్ములు...మ‌రో ఉగ్ర‌వాది అరెస్టు!

బెల్జియం బాంబుదాడుల కేసులో పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న‌వారిని గుర్తించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న‌వారు  ఖ‌లీద్, బ్ర‌హీం ఎల్ బ‌క్రాయ్ అనీ, వీరిద్ద‌రూ సోద‌రుల‌ని అక్క‌డి మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి.  వీరిద్ద‌రికీ గ‌త న‌వంబ‌రులో పారిస్ దాడుల్లో పాల్గొన్న ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదుల‌తో నేరుగా సంబంధాలున్న‌ట్టుగా తెలుస్తోంది. వీరిద్ద‌రూ బ్ర‌స్సెల్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రికీ సాధార‌ణ నేర‌చ‌రిత్ర ఉంది కానీ వీరిపై ఇంత‌కుముందు ఐఎస్ ఉగ్ర‌వాదుల‌నే అనుమానం లేదు.  ఇక ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న మూడో వ్య‌క్తి […]

ఆత్మాహుతి దాడి చేసింది అన్న‌ద‌మ్ములు...మ‌రో ఉగ్ర‌వాది అరెస్టు!
X

బెల్జియం బాంబుదాడుల కేసులో పోలీసులు ప్రధాన నిందితులుగా అనుమానిస్తున్న‌వారిని గుర్తించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న‌వారు ఖ‌లీద్, బ్ర‌హీం ఎల్ బ‌క్రాయ్ అనీ, వీరిద్ద‌రూ సోద‌రుల‌ని అక్క‌డి మీడియా సంస్థ‌లు వెల్ల‌డించాయి. వీరిద్ద‌రికీ గ‌త న‌వంబ‌రులో పారిస్ దాడుల్లో పాల్గొన్న ఇస్లామిక్ స్టేట్ తీవ్ర‌వాదుల‌తో నేరుగా సంబంధాలున్న‌ట్టుగా తెలుస్తోంది. వీరిద్ద‌రూ బ్ర‌స్సెల్స్‌లోనే నివాసం ఉంటున్నారు. ఇద్ద‌రికీ సాధార‌ణ నేర‌చ‌రిత్ర ఉంది కానీ వీరిపై ఇంత‌కుముందు ఐఎస్ ఉగ్ర‌వాదుల‌నే అనుమానం లేదు. ఇక ప్ర‌ధాన నిందితుడిగా భావిస్తున్న మూడో వ్య‌క్తి న‌జీమ్ లాచ్‌రాయ్ (25)కి ఇంత‌కుముందు పారిస్ దాడుల్లో పాల్గొన్న స‌లాం అబ్దెస్లాంకి సంబంధాలు ఉన్నాయి. ఇత‌నిని పోలీసులు అరెస్టు చేసిన‌ట్టుగా అక్క‌డి మీడియా పేర్కొంది.

వీరిలో ఖ‌లీద్, బెల్జియం రాజ‌ధాని బ్ర‌స్సెల్‌లో మారుపేరుతో ఒక ఫ్లాట్‌ని అద్దెకు తీసుకున్నాడు. వారం క్రిత‌మే ఇత‌ను నివాసం ఉంటున్న ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వ‌హించి ఆయుధాలతో ఉన్న ఒక వ్య‌క్తిని చంపారు. ఆ త‌రువాత ఆ వ్య‌క్తి వ‌ద్ద ఇస్లామిక్ స్టేట్ జెండా, ఆయుధాలు గుర్తించారు. ఇక్క‌డే గ‌తంలో పారిస్ దాడుల్లో పాల్గొన్న ప్ర‌ధాన నిందితుడు స‌లాం అబ్దెస్లాం ఫింగ‌ర్ ప్రింట్స్‌ని గుర్తించిన పోలీసులు మూడురోజుల త‌రువాత అత‌డిని అరెస్టు చేశారు. అత‌డిని అరెస్టు చేసిన త‌రువాతే ఈ దాడులు జ‌రిగాయి.

నజీమ్ లాచ్‌రాయ్ బ్యాగుల ట్రాలీని తోసుకుంటూ వ‌చ్చి ఆత్మాహుతి దాడికి పాల్ప‌డిన వారి ప‌క్క‌కు తెచ్చి ఉంచి ఎయిర్‌పోర్టు టెర్మిన‌ల్ బ‌య‌ట‌కు ప‌రిగెత్తుకు వెళ్లిపోయిన‌ట్టుగా సిసిటివి ఫుటేజిలో గుర్తించారు. అయితే పోలీసులు కానీ, ప్రాసిక్యూట‌ర్లు కానీ దీనిపై ఇంకా స్పందించ‌లేదు. విమానాశ్ర‌యంలోని సిసిటివి ఫుటేజిలో క‌నిపిస్తున్న‌ది బ్ర‌హిం బ‌క్రాయ్ అని, అత‌ని సోద‌రుడు ఖ‌లీద్ మెట్రో ట్రైన్‌లో త‌న‌ని తాను పేల్చుకున్నాడ‌ని అక్క‌డి మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వీరిద్ద‌రికీ నేర‌చ‌రిత్ర ఉన్నా ఇస్లామిక్ స్టేట్‌తో అనుబంధ‌మున్న‌ట్టుగా ఇంత‌కుముందు గుర్తించ‌లేదు. అయితే న‌జీం లాచ్‌రాయ్‌ని మాత్రం గ‌త పారిస్ దాడుల నుండి పోలీసులు వెతుకుతున్నారు.

పారిస్‌లో గ‌తంలో జ‌రిగిన పేలుళ్ల‌లో వినియోగించిన బెల్టుల్లోనూ, గ‌త‌వారం స‌లాం అబ్దెస్లాంని ప‌ట్టుకున్న నివాసంలోనూ న‌జీం లాచ్‌రాయ్‌కి చెందిన డిఎన్ఎని పోలీసులు ఇంత‌కుముందే గుర్తించారు. ఇత‌నికోసం గాలిస్తున్నారు. ఈ లోప‌లే అత‌ను ఈ మార‌ణ హోమానికి పాల్ప‌డ్డాడు. దాడికి పాల్ప‌డిన వారి గురించి ఒక టాక్సీ డ్రైవ‌ర్ పోలీసుల‌కు స‌మాచారం అందించాడ‌ని, అత‌నే వారిని ఎయిర్‌పోర్టుకి తీసుకువ‌చ్చాడ‌ని స్థానిక మీడియా తెలిపింది.

సిరియాలోని ఇస్లామిస్ట్ గ్రూపు మంగ‌ళ‌వారం దాడుల‌కు తామే బాధ్యుల‌మ‌ని ప్ర‌క‌టించింది. సిరియా ఇరాక్‌ల్లో త‌మ‌తో పోరాటం చేస్తున్న‌వారికి చెడ్డ‌రోజులు మొద‌ల‌య్యాయ‌ని వారు హెచ్చ‌రించారు. మ‌ధ్య‌తూర్పు దేశాల‌తో పాటు బెల్జియం కూడా అక్క‌డ ఉగ్ర‌వాదుల‌మీద పోరాటం చేస్తోంది. మంగ‌ళ‌వారం నాటి దాడులు యూర‌ప్ దేశాల‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు క‌లిగించాయి. బ్ర‌స్సెల్స్ దాడుల్లో 31మందికి పైగా మ‌ర‌ణించార‌ని, దాదాపు 260మంది గాయ‌ప‌డ్డార‌ని బెల్జియం ఆరోగ్య‌శాఖా మంత్రి వెల్ల‌డించాడు. మేల్‌బీక్ మెట్రో స్టేష‌న్లో మృతి చెందిన‌వారి శ‌రీరాలు విచ్ఛిన్న‌మ‌వ‌డం వ‌ల‌న వారిని గుర్తించ‌డం క‌ష్టంగా ఉంద‌ని, అందుకే మృతుల సంఖ్య త‌రువాత పెర‌గ‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపాడు.

First Published:  23 March 2016 4:02 AM GMT
Next Story