ఇక సోష‌ల్ మీడియా నుండి… ఫోన్ కాల్స్‌!

టెలికాం సంస్థ‌లు ఇంట‌ర్నెట్ వాడకం దారుల‌ను త‌మ‌ ప్ర‌త్య‌క్ష వినియోగ‌దారుల ఖాతాలోకి వేసుకునే క్రమంలో ఓ కొత్త విధానానికి రూప‌క‌ల్ప‌న చేశాయి. ఫోన్లో బ్యాల‌న్స్ అయిపోయినా నెట్ లో వివిధ అంశాల‌కు వినియోగించుకునే డేటా బ్యాల‌న్స్ ఉంటే చాలు….దాంతోనే మొబైల్‌కి, ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.  అంటే స్కైప్‌, వాట్సాప్‌, వైబ‌ర్ లాంటి సోష‌ల్‌మీడియా విభాగాల‌ నుండి  మొబైల్ ఫోనుకి, ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేసుకునే అవ‌కాశం క‌ల‌గ‌నుంది.  హ‌ఠాత్తుగా మెయిన్ బ్యాల‌న్స్ అయిపోతే ఇక‌పై కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌న్న‌మాట‌. డేటా బ్యాల‌న్స్ ఉంటే చాలు ప‌న‌యిపోతుంది. ఫోన్ కాల్స్ ఛార్జీలు చాలావ‌ర‌కు త‌గ్గిపోయిన నేప‌థ్యంలో టెలికాం సంస్థ‌లు నెట్‌ బ్యాలన్స్‌ని మెయిన్ బ్యాల‌న్స్‌కి అనుసంధానించ‌డానికి నిర్ణ‌యించుకున్నాయి. వినియోగ‌దారుల‌కు కూడా ఇది మ‌రింత సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇంట‌ర్నెట్ అందిస్తున్న సంస్థ‌ల‌కు టెలికాం ఆప‌రేట‌ర్ల‌కు  మ‌ధ్య కుదిరిన అంత‌ర్గ‌త ఒప్పందంతో ఈ సౌక‌ర్యం అందుబాటుకి రానుంది.