Telugu Global
National

అటు ప‌రుగులు...ఇటు ప్ర‌శంస‌లు!

ఎంత గొప్ప‌వాళ్ల‌యినా కొన్నాళ్ల‌కు చ‌రిత్ర‌గా మార‌తారు…వ‌ర్త‌మానంలోకి అంత‌కంటే గొప్ప‌వాళ్లు వ‌చ్చి నిలుస్తుంటారు. ఇదొక జీవిత స‌త్యం. బార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్క‌ర్‌ని మ‌ర‌పించే ఆట‌గాడు ఇంత త్వ‌ర‌గా మ‌న‌ముందుకు వ‌చ్చేస్తాడ‌ని క్రికెట్ క్రీడా అభిమానులే కాదు,  నిపుణులు కూడా ఊహించి ఉండ‌రు. అవును విరాట్ కోహ్లీ ఎవ‌రి ఊహ‌ల‌కు అందనంత‌గా క్రికెట్ క్రీడ‌లో విజ‌యాల  ప‌రుగులు పెడుతున్నాడు. మైదానంలో ఆట‌తో ఆటాడుకుంటున్న విరాట్‌పై ప్ర‌త్య‌ర్థులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఓడితే ఓడాం…ఓ గొప్ప క్రీడాకారుడిని చూశామ‌నే […]

అటు ప‌రుగులు...ఇటు ప్ర‌శంస‌లు!
X

ఎంత గొప్ప‌వాళ్ల‌యినా కొన్నాళ్ల‌కు చ‌రిత్ర‌గా మార‌తారు…వ‌ర్త‌మానంలోకి అంత‌కంటే గొప్ప‌వాళ్లు వ‌చ్చి నిలుస్తుంటారు. ఇదొక జీవిత స‌త్యం. బార‌త క్రికెట్ దేవుడు స‌చిన్ టెండుల్క‌ర్‌ని మ‌ర‌పించే ఆట‌గాడు ఇంత త్వ‌ర‌గా మ‌న‌ముందుకు వ‌చ్చేస్తాడ‌ని క్రికెట్ క్రీడా అభిమానులే కాదు, నిపుణులు కూడా ఊహించి ఉండ‌రు. అవును విరాట్ కోహ్లీ ఎవ‌రి ఊహ‌ల‌కు అందనంత‌గా క్రికెట్ క్రీడ‌లో విజ‌యాల ప‌రుగులు పెడుతున్నాడు. మైదానంలో ఆట‌తో ఆటాడుకుంటున్న విరాట్‌పై ప్ర‌త్య‌ర్థులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఓడితే ఓడాం…ఓ గొప్ప క్రీడాకారుడిని చూశామ‌నే అనుభూతిని పొందుతున్నారు.

విజ‌యం మాత్ర‌మే చేసే మేజిక్ ఇది. దాన్ని విరాట్ కోహ్లీ ఇప్పుడు సంపూర్ణంగా అనుభ‌విస్తున్నాడు. ఎక్క‌డైనా విజయం అనేది ఆ సాధించిన వ్య‌క్తికి మాత్ర‌మే ఆనందాన్ని ఇస్తుంది. కానీ క‌ళా, క్రీడారంగాల్లో మాత్రం…వ్య‌క్తుల విజ‌యాలు దేశ‌వ్యాప్తంగా అభిమానుల్లో ఓ వెన్నెల‌లా వ్యాపిస్తాయి. విరాట్ ఇప్పుడు అలాంటి ఓ స‌క్సెస్‌ ఫ్లేవ‌ర్‌ని భార‌త్ మొత్తం వ్యాపించేలా చేశాడు.

కొమ్ములు తిరిగిన క్రికెట్ దిగ్గ‌జాలే అత‌ని ఆట‌ని మైమ‌ర‌చి చూస్తున్నారు. అందుకే గ‌వాస్క‌ర్, విరాట్‌ది దిమ్మ‌తిరిగి పోయే ప్ర‌ద‌ర్శ‌న అన్నాడు. త‌న త‌ల‌మీద ఉన్న కాస్త జుట్టు కూడా విరాట్ ఆట చూస్తున్న‌ప్పుడు నిక్క‌బొడుచుకుంద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం నిర్ణీత ఓవ‌ర్ల మ్యాచ్‌ల్లో అత‌నే ప్ర‌పంచ అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్ అని గ‌వాస్క‌ర్ కితాబునిచ్చారు. బంతిని ఖాళీలు చూసి ఆడ‌టంలో ఇప్ప‌టి ఆట‌గాళ్ల‌లో బ్ర‌యాన్ లారానే ముందుండేవాడ‌ని, ఇప్పుడు కోహ్లీ కార‌ణంగా అత‌ను రెండో స్థానానికి వెళ్లిపోయాడ‌ని ఇయాన్ ఛాపెల్ అన్నారు. లారా కూడా ఆ విష‌యాన్ని అంగీక‌రించాడు. బంతిని కొట్ట‌డంలో కోహ్లీకంటే టైమింగ్ ఉన్న ఆట‌గాడు మ‌రొక‌రు లేర‌ని, అస‌లు న‌మ్మ‌డానికి కూడా వీలులేని విధంగా ఆడుతున్నాడ‌ని ప్ర‌శంసించాడు. మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ అయితే ఛేజింగ్‌లో స‌చిన్ కంటే కోహ్లీనే ఉత్త‌మ ఆట‌గాడ‌ని పేర్కొన్నాడు. కోహ్లీ నిజ‌మైన క్రికెట‌ర్ అని ఆయ‌న అభివ‌ర్ణించాడు.

కోహ్లీ ప్ర‌తిభ‌ని ఆస్ట్రేలియా మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఆసిస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌, మ్యాచ్‌ని విరాట్‌ షో…గా పేర్కొన‌డం స‌రైన‌దేన‌ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. ఇక డెయిలీ టెలీగ్రాఫ్ అనే ప‌త్రిక అయితే ఒకేవ్య‌క్తి గెలిపించాడు…అంటూ రాసింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ మ్యాక్స్‌వెల్, విరాట్‌ని క్రికెట్ మేధావిగా వ‌ర్ణించాడు. ఓడినందుకు బాధ‌గా ఉన్నా ఒక క్రికెట్ మేధావి చేతిలో ఓడిపోవ‌డం ఓ మంచి అనుభూతినిచ్చిందన్నాడు.

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ ఫ్లింటాఫ్‌, కోహ్లీ కూడా ఏదో ఒక‌రోజు జో రూట్ కంటే గొప్ప క్రికెట‌ర్ అవుతాడంటూ ట్విట్ట‌ర్లో కామెంట్ చేయ‌గా, అమితాబ్ బ‌చ్చ‌న్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అస‌లు ఆ రూట్ ఎవ‌రు, ఆ రూట్‌ని కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించి వేస్తాం… అంటూ ఆయ‌న ఘాటుగా స్పందించారు. ఏదిఏమైనా విరాట్‌కు ద‌క్కుతున్న విజ‌యాలు, భార‌త్‌లో క్రికెట్ ఆశ‌ల‌ను స‌జీవంగా నిలుపుతున్నాయి. ఒక వ్య‌క్తి గెలుపు దేశం గెలుపుగా మారిపోయిన ఈ విజ‌య‌ త‌రుణం…విరాట్‌కి దేశ‌మే రుణ‌ప‌డేలా చేసింద‌డం అతిశ‌యోక్తి కాదు.

First Published:  28 March 2016 7:02 PM GMT
Next Story