మొన్న బ్యాక్… ఇప్పుడు ఫ్రంట్…

త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అ..ఆ సినిమాకు సంబంధించి మొన్నటివరకు ఓ విమర్శ ఉండేది. నితిన్ ను హీరోగా పెట్టి… ఫస్ట్ లుక్ లో అతడ్ని చూపించకపోతే ఎలా అంటూ కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు నితిన్ ను బ్యాక్ నుంచి చూపించడంతో మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొందరు రచ్చ చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ అప్పుడు కావాలనే బ్యాక్ చూపించామని, ఇప్పుడు ఫ్రంట్ చూడండంటూ మరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. నితిన్ పుట్టినరోజు (మార్చి 30) సందర్భంగా ఈసారి ఫ్రంట్ నుంచి హీరోను చూపిస్తూ ఫస్ట్ లుక్ విడుదలైంది. విమర్శలు ఎందుకు అనుకున్నారో ఏమో… ఈసారి ఫస్ట్ లుక్ లో సమంత లేకుండా కేవలం నితిన్ నే చూపించారు. పైగా… సినిమా విడుదలపై కూడా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. మే 6న థియేటర్లలోకి వస్తామని ఫస్ట్ లుక్ సాక్షిగా ప్రకటించింది. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటల్ని… ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేస్తారు.