Telugu Global
National

భార‌త‌మాత‌...బిజెపికి మేలుచేయ‌లేదు!

భార‌త్‌మాతాకీ జై …నినాదం అనేక వివాదాల‌కు తావిచ్చిన నేప‌థ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ దీనిపై వెనక్కు త‌గ్గిన విష‌యం తెలిసిందే. భార‌త్‌మాతాకీ జై అనే నినాదాన్ని త‌ప్ప‌నిస‌రి… అని చెప్ప‌డం లేద‌ని, దాన్ని స్వ‌చ్ఛందంగానే పాటించాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఇప్పుడు మాట మార్చారు. మ‌నం ప్ర‌పంచానికే దారి చూపే స్థాయిలో ఉన్నామ‌ని, ప్ర‌పంచ‌మంతా భార‌త్‌మాతాకీ జై అనేలా దోపిడీ లేని దేశంగా భార‌త్ ఎద‌గాల‌న్న భ‌గ‌వ‌త్, తాము ఎవ‌రిమీదా ఈ నినాదాన్ని రుద్ద‌డం లేద‌న్నారు. జెఎన్‌యులో […]

భార‌త‌మాత‌...బిజెపికి మేలుచేయ‌లేదు!
X

భార‌త్‌మాతాకీ జై …నినాదం అనేక వివాదాల‌కు తావిచ్చిన నేప‌థ్యంలో ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ దీనిపై వెనక్కు త‌గ్గిన విష‌యం తెలిసిందే. భార‌త్‌మాతాకీ జై అనే నినాదాన్ని త‌ప్ప‌నిస‌రి… అని చెప్ప‌డం లేద‌ని, దాన్ని స్వ‌చ్ఛందంగానే పాటించాల‌ని మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఇప్పుడు మాట మార్చారు. మ‌నం ప్ర‌పంచానికే దారి చూపే స్థాయిలో ఉన్నామ‌ని, ప్ర‌పంచ‌మంతా భార‌త్‌మాతాకీ జై అనేలా దోపిడీ లేని దేశంగా భార‌త్ ఎద‌గాల‌న్న భ‌గ‌వ‌త్, తాము ఎవ‌రిమీదా ఈ నినాదాన్ని రుద్ద‌డం లేద‌న్నారు. జెఎన్‌యులో అఫ్జ‌ల్ గురుకి విద్యార్థులు అనుకూల నినాదాలు చేశారనే అభియోగంతో మొద‌లైన భార‌త్‌మాతాకీ జై నినాదం…ఇప్పుడు నిదానంగా తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి. నిజానికి ఈ నినాదం ద్వారా బిజెపి ఆశించిన‌ది పూర్తిగా నెర‌వేర‌క‌పోగా అది ఎదురు తిరిగే ప‌రిస్థితి రావ‌డంతోనే మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌న మాట మార్చార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

ముందు దేశ‌వ్యాప్తంగా జాతి వ్య‌తిరేక‌త అనే విష‌యాన్ని చ‌ర్చ‌నీయాంశం చేసి, కొన్ని వ‌ర్గాల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేయాల‌ని బిజెపి ఆశించింది. అయితే భార‌త్‌మాతాకీ జై అని ఎందుకు అనాలో ఆరెస్సెస్‌, బిజెపి చెప్పిన కార‌ణాల‌కంటే, ఎందుకు అనాల్సిన ప‌నిలేదో తెలిపే కార‌ణాలు అంత‌కంటే బ‌లంగా వినిపించాయి. దేశ‌భ‌క్తికి బిజెపి ఇస్తున్న నిర్వ‌చ‌నంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా బిజెపి స‌హ‌కారంతో జ‌మ్ము క‌శ్మీర్‌లో ఏప్రిల్ 4న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న పీడీపీ అధినాయకురాలు, ఎంపీ మెహబూబా ముఫ్తీ భార‌త్‌మాతాకీ జై అన‌ను… అంటే బిజెపి ఏం చేస్తుంది అనే ప్ర‌శ్న‌లను ఆ పార్టీపై ప్ర‌తిప‌క్షాల సంధిస్తున్నాయి. అంతేకాదు, ఈ నినాదాన్ని త‌ప్ప‌నిస‌రి చేసినా ఇంకా ముందుకు తీసుకువెళ్లినా, జ‌మ్ముకాశ్మీర్‌ పాల‌న‌లో పాలుపంచుకుంటున్న బిజెపి, ఒక జాతీయ పార్టీగా కాకుండా, ఒక‌ మ‌త‌ప‌ర‌మైన పార్టీలా క‌నిపించే అవకాశం ఉంది.

జెఎన్‌యు, హెచ్‌సియు విద్యార్థులు, ముస్లింల‌ను టార్గెట్ చేసి బ‌య‌ట‌కు తెచ్చిన ఈ నినాదాన్ని వారు పెద్దగా ప‌ట్టించుకున్న‌ట్టుగా క‌న‌బ‌డ‌టం లేదు. నిజానికి ఈ నినాదం పుణ్య‌మా అని వారంతా దేశం ప‌ట్ల త‌మ‌కున్న‌బాధ్య‌త‌ల‌ను త‌మ‌దైన శైలిలో మ‌రింత బాగా వెల్ల‌డించే అవ‌కాశం ల‌భించింది కూడా. అలాంటి వేదిక‌ని, సంద‌ర్భాల‌ను బిజెపియే క‌ల్పించిన‌ట్ట‌యింది. ఇవ‌న్నీ కాకుండా అనూహ్యంగా బిజెపి టార్గెట్ చేయ‌ని వారినుండి వ్య‌తిరేక‌త ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. శిరోమ‌ణి అకాలీద‌ళ్ అధ్య‌క్షుడు సిమ్రాన్‌జిత్ సింగ్ మాన్, సిక్కులు ఏ రూపంలో అయినా మ‌హిళ‌ల‌ను పూజించ‌రు… అంటూ త‌మ‌కు అనుకూల‌మైన మ‌రొక నినాదాన్ని తెర‌మీద‌కు తెచ్చారు. పంజాబ్‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ వివాదాన్ని పొడిగిస్తే బిజెపికే న‌ష్టం. అలాగే ద‌ళిత నేతలు భీమ్ భూమీకి జై… అనే మ‌రొక నినాదాన్ని ఎంపిక చేసుకున్నారు. మొత్తానికి ఆరెస్సెస్‌, బిజెపిల వ్యూహం వారికి మేలు చేయ‌క‌పోగా అలా బెడిసికొట్టింది. దేశాన్ని క‌లిపి ఉంచాల‌నే ఆశ‌యం కాస్తా, ఎన్ని చీలిక‌లు ఉన్నాయో స్ప‌ష్టం చేసేందుకు మార్గంలా మారింది. దాంతో మోహ‌న్ భ‌గ‌వ‌త్ మాట‌మారింది.

First Published:  31 March 2016 4:02 AM GMT
Next Story