ఇక్కడ ఫ్లాప్ అయితే అక్కడ వర్కవుట్ అవుతుందా…?

సాధారణంగా ఒరిజినల్ వెర్షన్ లో ఫ్లాప్ అయిన సినిమాను మిగతా భాషల హీరోలు టచ్ చేయరు. ఒకవేళ కథ, కథనం నచ్చినప్పటికీ…. లోకల్ గానే సినిమా ఆడనప్పుడు రీమేక్ ఏం అడుతుందిలే అనే భయం ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ ఫ్లాప్ అయితే… ఆ సినిమాలు ఇక తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవ్వవు. కానీ ప్రకాష్ రాజ్ తెరకెక్కించిన ఉలవచారు బిర్యానీ మాత్రం దీనికి అతీతం. ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో అతను హీరోగా, స్నేహ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫ్లాప్ గా పేరుతెచ్చుకుంది. తెలుగులో అయితే రెండో రోజుకు సినిమా మళ్లీ కనిపించలేదు. అలాంటి మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి ప్రకాష్ రాజ్ రెడీ అయిపోతున్నాడు. తెలుగు, తమిళాల్లో హిట్టవ్వకపోయినా… బాలీవుడ్ లో కచ్చితంగా ఆడుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. హిందీ వెర్షన్ కు దర్శకుడు ప్రకాష్ రాజే అయినప్పటికీ…. తెరపై మాత్రం అతడి స్థానంలో నానాపటేకర్ కనిపించనున్నాడు. ఇక హీరోయిన్లుగా శ్రియ, తాప్సి నటించడానికి ఒప్పుకున్నారట. ప్రకాష్ రాజ్ బ్యానర్ తో పాటు.. జీ స్టుడియో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమౌతోంది.