Telugu Global
Family

రూపాలి

పూర్వం రోజుల్లో అన్ని ప్రాంతాల్లోలాగే గుజరాత్‌లోనూ రవాణా సౌకర్యాలు వుండేవి కావు. ఎడ్లబండ్లపైనో, ఒంటెలులాగే బండ్ల మీదో ప్రయాణం చేసేవాళ్ళు. ప్రయాణాలు చాలా నెమ్మదిగా సాగేవి. కారణం సరయిన రోడ్లు వుండేవి కావు. పక్కగ్రామానికి వెళ్ళాలన్నా జనం ఎవర్నయినా తోడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. కారణం దొంగల భయం. అందుని ఆ రోజుల్లో రక్షక దళాలు వుండేవి. ఒక ప్రాంతం నించి యింకో ప్రాంతం వెళ్ళే పెళ్లి జనాలకు, పుట్టింటికో, అత్తగారింటికో వెళ్ళే స్త్రీలకు ఈ రక్షకదళం వాళ్ళు […]

పూర్వం రోజుల్లో అన్ని ప్రాంతాల్లోలాగే గుజరాత్‌లోనూ రవాణా సౌకర్యాలు వుండేవి కావు. ఎడ్లబండ్లపైనో, ఒంటెలులాగే బండ్ల మీదో ప్రయాణం చేసేవాళ్ళు. ప్రయాణాలు చాలా నెమ్మదిగా సాగేవి. కారణం సరయిన రోడ్లు వుండేవి కావు. పక్కగ్రామానికి వెళ్ళాలన్నా జనం ఎవర్నయినా తోడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. కారణం దొంగల భయం.

అందుని ఆ రోజుల్లో రక్షక దళాలు వుండేవి. ఒక ప్రాంతం నించి యింకో ప్రాంతం వెళ్ళే పెళ్లి జనాలకు, పుట్టింటికో, అత్తగారింటికో వెళ్ళే స్త్రీలకు ఈ రక్షకదళం వాళ్ళు అండగా వెళ్ళేవాళ్ళు, వీళ్ళంటే దొంగలకు భయం ఆ రక్షక దళంలో ‘గామా’ అన్న అతను వుండేవాడు. అతనంటే దొంగలకు హడల్‌, అతని పేరు వింటేనే పారిపోయే వాళ్ళు.

అతను నేనెవరో తెలుసా! ‘గామా’ని రక్షక దళంలో నాయకుణ్ణి, దొంగలు నా పేరు వింటే వణికిపోతారు’ అని అర్భాటాలు పోయ్యేవాడు.

అతను ఒక రోజు ఒక రాజపుత్రస్త్రీకి రక్షకుడుగా వెళ్ళాడు ఆ రాజపుత్ర స్త్రీ పేరు ‘రూపాలి’. ఆమె తొలికాన్పుకోసం పుట్టింటికి వెళుతోంది.

ఆమె అత్తగారింట్లో వైభవంగా పూజలు నిర్వహించి ఆమె ఒంటి నిండా నగల్తో పుట్టింటికి పంపుతున్నారు. మార్గమంతా ఎడారి. దారిలో అక్కడక్కడ ముళ్ళపొదలు తప్ప చెట్లు లేవు. ఎడ్లబండిలో రెండు నీటిసంచులు రూపాలి, గామా, బండినడిపేవాడు.

బండి కదుల్తూ వుంటే గామా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. బండినడిపేవాడు ‘గామాని లేపి నిద్రపోకు చీకటిపడుతోంది. ఈ ప్రాంతం ప్రమాదకరమైంది. జాగ్రత్తగా వుండాలి’ అన్నాడు.

గామా ‘ఎందుకు భయపడతావు నేను గామాని ఏమీ జరగదు. నువ్వు మాట్లాడకుండా బండినడుపు’ అన్నాడు.

బండిలో తెరవెనుక కూచున్న రూపాలి ‘గామా? నిద్రపోకు, నువ్వు చుట్టు పట్ల చూస్తూ వుండు. చీకటిగావుంది’ అంది.

గామా ఆమె మాటల్ని పట్టించుకోకుండా గురకపెట్టి నిద్రపోయాడు. బండితోలేవాడు హఠాత్తుగా గామాని నిద్రలేపి ‘దూరంగా దీపాల వెలుగుకనిపిస్తోంది నువ్వు అమ్మగారి సంరక్షణ గురించి ఆలోచించు’ అన్నాడు గామా మళ్ళీ నిద్రలోకి జారుకుని ‘నేను గామాని! నేను గామాని’ అన్నాడు.

దీపాలు దగ్గరికొచ్చాయి. కాగడాలు పట్టుకున్న పన్నెండుమంది బండిని చుట్టు ముట్టారు. వాళ్ళు మెదట గామాని కాళ్ళు చేతులూ కట్టి అతన్ని బంతిలా చుట్టి ఎడారిలో దొర్లించారు. అతను బంతిలా దొర్లుకుంటూ ఒక పొదలోకి వెళ్ళాడు. తరువాత దొంగల నాయకుడు రూపాలి దగ్గరకు వచ్చి ఒంటిమీద ఉన్న నగలన్నిటినీ వొలిచి యివ్వమన్నాడు.

రూపాలి తను ఒక పెట్టెలో నగల్ని తీసుకుపోతోంది. ఆ పెట్టను ఆమె దొంగల నాయకుడికి యిచ్చింది. మర్యాదను బట్టి దొంగలయినా స్త్రీ శరీరం మీద నగల్ని తాకడం ధర్మం కాదు. పద్ధతికాదు.

కానీ దొంగ ఆ పద్ధతుల్ని లక్ష్యపెట్టలేదు.

అతను రూపాలితో నీ చెవుల దుద్దుల్ని, మెడలోని హారాల్ని, వడ్డాణాన్ని, చివరకు కాళ్ళకు వున్న వెండి కడియాల్ని అన్నిటిని మర్యాదగా తీసియివ్వు’ అని హుకుం జారీ చేశాడు.

రూపాలి తన శరీరంపై వున్న ఆభరణాలన్నిటిని వొలిచి దొంగల నాయకుడికి యిచ్చింది. ఐతే కాళ్ళకున్న వెండి కడియాల్ని తియ్యలేకపోయింది. ‘నేను కాళ్ళకు వేసుకున్న కడియాలు నా చిన్నప్పటివి. అవి తియ్యడం నాకు వీలు పడడం లేదు. కావాలంటే నువ్వే వాటిని తీసుకో’ అంది.

అంటూ తెరనించి బయటకు తన రెండు కాళ్ళను చాపింది. యిద్దరు దొంగలు ముందుకు వచ్చి ఆ కడియాల్ని లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ కడియాలు రాలేదు. ఈ మధ్యలో రూపాలి బండిలో అటూ యిటూ వెతికింది. రెండు బలమైన ఇనుప చువ్వలు కనిపించాయి. అవి చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా వున్నాయి. కొద్దిగా తెరతీసి చూసింది. దొంగలిద్దరూ ఆమె కాలికున్న కడియాల్ని లాగే పనిలో వున్నారు.

అ ఇనుప చువ్వలు ఒక్కొక్కటి ఐదడుగులు వున్నాయి. వాటిని బలంగా ఒక్కోదాన్ని ఒక్కో చేతితో పట్టుకుని ఒక్క దెబ్బతో ఆ దొంగల బుర్రలు పగలగొట్టింది. ఆ దొంగలిద్దరూ తలలుపగిలి అక్కడే చనిపోయారు.

రూపాలి తను స్త్రీననే విషయం మరచి పోయింది. రాజపుత్ర శౌర్యం ఆమెలో రగులుతోంది. బండిపైకి ఎక్కియినుపచువ్వతో తనమీదకు వస్తున్న దొంగలతో తలపడింది. ఆ దొంగను చేయి విరిగేటట్లు కొట్టింది. ఆమెకు పద్దెనిమిదేళ్ళు. పైగా గర్భవతి. కానీ రాజపుత్రరక్తం ఆమెలో ఆవేశం రగిలించింది. రుద్రకాళిలా విజృంభించింది.

ఆమెధాటికి తాళలేక దొంగల నాయకుడు మిగిలిన తన అనుచరులతో కాలికి బుద్ధి చెప్పాడు.

ఈ మధ్యలో గామా తనకు కట్టిన తాళ్ళను విప్పుకుని సిగ్గుతో తనూ పారిపోయాడు.

రూపాలి దొంగలు వదిలిపారిపోయిన ఒక కత్తిని తీసుకుని ప్రయాణించి తన పుట్టింటికి చేరింది. కానీ ఆమె శరీరమంతా రక్తం ఓడుతోంది. కొన్నాళ్ళకి ఆమె కన్నుమూసింది.

ఇప్పటికీ గ్రామస్థులు ఆమె సాహసం గురించి కథలుగా చెప్పుకుంటారు.

– సౌభాగ్య

First Published:  6 April 2016 5:02 AM GMT
Next Story